మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులకు దగా!

సీబీఐ విచారణకు ఎందుకు భయం చంద్రబాబూ?

యువతను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు?

అర్హత లేనివారికి ఉద్యోగాలు ఎలా?

సుపుత్రుడిని కాపాడేందుకు ఎందుకు దాక్కుంటున్నారు?

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ 

తాడేప‌ల్లి: మెగా డీఎస్సీ–2025 నియామకాలపై వస్తున్న అక్రమాల ఆరోపణలు, అర్హతలేని అభ్యర్థులకు ఉద్యోగాలు కట్టబెట్టినట్లు వెలుగులోకి వస్తున్న అంశాలపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విచారణలు కాకుండా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన స్పష్టం చేశారు. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ, డీఎస్సీతో పాటు స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల భర్తీపైనా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..  

చంద్ర‌బాబు గారూ… మెగా డీఎస్సీ స్కాంలో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ సాక్ష్యాలు బయటకు వస్తున్నా, ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? మీరు నిర్వహించిన డీఎస్సీ మోసాల్లో “మెగా”, నిజాయితీపరులైన అభ్యర్థుల పాలిట “దగా” అని తేలిపోతుంటే మీరు, మీ సుపుత్రుడు దాక్కోవడం ఎందుకు? ఈ స్కాంకు బాధ్యత వహిస్తూ, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ చేత రాజీనామా చేయించకుండా, అధికార బలంతో, అబద్ధాలుచెప్తూ, పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తూ కొడుకును కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?

కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థికి తన కేటగిరీ ప్రకారం టెట్‌లో 75 మార్కులు రావాల్సి ఉండగా 65 మార్కులే వచ్చినా స్పోర్ట్స్‌ కోటాలో ఎస్‌జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? ఒన్‌-టు-ఒన్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేసి మరీ, అర్హత లేదని తెలిసి కూడా, పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్‌ కావాల్సిన వ్యక్తి, ఆ తర్వాత దశలుకూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? అధికారుల చేత ఈ పని చేయించిన ఆ అదృశ్య శక్తి ఎవరు? లోకేష్‌ కాదంటారా? రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో డీఎస్సీ–2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయి.

చంద్రబాబుగారూ.., ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వమే అధికారంలో ఉండగా, మీ అధికారులతో చేసే విచారణలు నిజాయితీగా, స్వతంత్రంగా జరుగుతాయా? మీ కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో, మీ కిందపనిచేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌పై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టులోనూ పోరాడుతున్నాం.

చంద్రబాబుగారూ… మరో నిర్ఘాంతపరిచే విషయం ఏంటంటే, పరీక్షలు లేకుండానే టీచర్‌ పోస్టులు కట్టబెట్టిన మీరు, మీ అక్రమాల విధానాన్ని డీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీకి కూడా పాకించడం. మా హయాంలో ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ పొందిన అటవీశాఖలోని 814 ఉద్యోగాలకు, నోటిఫికేషన్లు జారీ చేసి, మెయిన్స్‌ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత, అందులో 40 స్పోర్ట్స్‌ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీవో నంబర్‌-4నే మీరు వాడుకున్న మాట వాస్తవం కాదా?

డీఎస్సీ అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రిక్రూట్‌మెంట్‌ను మధ్యలో ఆపేయడంతోపాటు, ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే బాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని కూడా నిలిపేయడం వాస్తవం కాదంటారా? 

చంద్రబాబుగారూ… ఇన్ని అక్రమాలు జరిగాయి కాబట్టే, వీటి వెనుక మీరు, మీ సుపుత్రుడు ఉన్నారు కాబట్టే మీరు సీబీఐ విచారణకు అంగీకరించడం లేదు. ఉద్యోగాలు పొందిన వారితో ర్యాలీలు చేయించి, మీకు డబ్బా కొట్టించుకోవడం వల్ల నిజాయితీపరులైన ఉద్యోగార్థులను దెబ్బతీసిన ఈ దారుణమైన స్కాంను కప్పిపుచ్చలేరు.

పారదర్శకంగా పరీక్షలు, నిష్పక్షపాతంగా ఉద్యోగ నియామకాల కోసం పోరాడుతున్న ఉద్యోగార్థులు, యువకులకు వైయస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తామని మరోమారు భరోసా ఇస్తూ,  లీకేజీ వ్యవహారం నుంచి స్పోర్ట్స్‌ కోటా వరకు, టెట్‌ అర్హతల నుంచి పోస్టింగ్‌ ఆర్డర్ల వరకు, మొత్తంగా మెగా డీఎస్సీ వ్యవహారాన్ని, జీవో నంబర్‌ 4 ఆధారంగా నడిచిన నియామకాలన్నింటినీ సీబీఐకి అప్పగించాలని మరోమారు డిమాండ్‌ చేస్తున్నాను.

Image

Back to Top