తాడేపల్లి: నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ వెన్నుపోటు కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో మెగా కుంభకోణానికి తెరలేపిందని వైయస్ఆర్‌సీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, కల్పలతారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ అర్హులైన అభ్యర్థుల గొంతు కోసి, అడ్డదారిలో టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. నవీన్ అనే వ్యక్తి వ్యవహారంతో మొదలైన క్వశ్చన్ పేపర్ లీకేజీ కుంభకోణం ద్వారా కోచింగ్ సెంటర్లకు పేపర్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. చట్టప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగానికి టెట్ తప్పనిసరి అయినప్పటికీ, ఎలాంటి టెట్ అర్హత లేని వారికి, కనీసం పరీక్ష కూడా రాయని వారికి బ్యాక్‌డోర్‌లో పోస్టింగులు ఇచ్చారని విమర్శించారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలను ఆధారాలతో సహా బయటపెట్టారు. అలాగే జీవో నెంబర్ 4, 47 లాంటి దొంగ జీవోలు తీసుకువచ్చి, అసలు డీఎస్సీనే లేకుండా ఉద్యోగాలు కట్టబెట్టాలని కుట్ర చేశారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా ముసుగులో కనీసం జరగని టోర్నమెంట్లకు సైతం నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు దోచుకున్నారని ఆధారాలు ప్రదర్శించారు. స్వయంగా శాప్ చైర్మన్ 870 నకిలీ సర్టిఫికెట్లు వచ్చాయని టీవీలో ఒప్పుకున్నా, కనీసం ఒక్కరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. శాసనమండలిలో ఈ అక్రమాలపై చర్చకు పట్టుబడితే, దానికి బదులు చెప్పలేక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సభ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా విద్యాశాఖ వెబ్‌సైట్‌లోని డేటాను తారుమారు చేసి, చివరకు ఆ వెబ్‌సైట్‌నే మాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్క ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలని న్యాయబద్ధంగా పోరాడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ, మరోపక్క టెట్ లేకుండా అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారితో ప్రభుత్వం ధర్నాలు చేయించడం దారుణమన్నారు. గత 15 రోజులుగా ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని ఆధారాలను వైయస్ఆర్‌సీపీ ప్రజల ముందు పెడుతున్నా ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదన్నారు. తప్పు చేయకపోతే ఈ మెగా కుంభకోణంపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని వారు డిమాండ్ చేశారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వైయస్ఆర్‌సీపీ నేతల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని, నిరుద్యోగుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ డీఎస్సీ కుంభకోణంపై ప్రభుత్వం సమాధానం చెప్పే తీరాలని వారు స్పష్టం చేశారు. వారు ఇంకా ఏం మాట్లాడారంటే... టెట్ లేని వారికి ఉద్యోగాలు ఎలా ఇస్తారు? టీచర్ ఉద్యోగానికి టెట్ తప్పనిసరి అని కేంద్ర నిబంధనలు, విద్యాహక్కు చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా చెబుతున్నాయి. డీఎస్సీ నోటిఫికేషన్‌లో కూడా టెట్ అర్హత తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. మీరు అసెంబ్లీలో చదివిన స్టేట్‌మెంట్‌లోనూ టెట్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. డీఎస్సీ టెట్ లేకుండా ఏవిధంగా రిక్రూట్‌మెంట్ చేస్తారు? అలాంటప్పుడు టెట్ లేదని స్పష్టంగా తేలిన ఈడిగ ప్రభాకర్ అనే వ్యక్తికి ఎస్జీటీ ఉద్యోగం ఎలా ఇచ్చారు? కెమెరా ముందు తనకు టెట్ లేదని ప్రభాకర్ స్వయంగా చెప్పిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం నుంచి తీసేశారు. ఒక్క ప్రభాకర్ మాత్రమే కాదు.. చాలా మందికి టెట్ లేకుండానే ఉద్యోగాలిచ్చారు. ఈ విషయం బయటపడిన తర్వాత అధికారులు కూడా వాస్తవాలను నిర్ధారించారు. మరి ఆ ఒక్క కేసుతోనే చేతులు దులుపుకుంటే సరిపోతుందా? టెట్ లేని వారికి ఉద్యోగాలు ఇచ్చిన మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలి. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తీసేయాలని పోరాడితే సస్పెండ్ చేశారు.. కానీ టెట్ రాయకుండానే దొడ్డి దారిలో ఉద్యోగం పొందిన వారిని మాత్రం ఏమీ చేయడం లేదు. నవీన్ వ్యవహారంపై సమాధానం చెప్పాలి డీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో నవీన్ పేరు మొదటి నుంచీ బయటకు వచ్చింది. ప్రశ్నాపత్రం లీక్ అయి కొన్ని కోచింగ్ సెంటర్లకు చేరిందన్న ఆరోపణలపై మేము ఆధారాలతో ప్రశ్నిస్తున్నాం. నవీన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాలేదని, ఎన్ఓసీ ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. కానీ ఆ వాదనలోనే అనేక ప్రశ్నలు ఉన్నాయి. అతను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి అయితే ఎన్ఓసీ ఎందుకు? అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పటికీ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై పూర్తి నిజాలు ప్రజల ముందు పెట్టాలి. స్పోర్ట్స్ కోటా మొత్తం అనుమానాస్పదమే స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు భర్తీ చేశారు. కానీ ఆ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లు, తప్పుడు మెరిట్ వివరాలు, బ్యాకప్ సర్టిఫికెట్లలో వేరే క్రీడలు, వాస్తవ రికార్డుల్లో లేని ప్లేస్‌మెంట్లు వంటి అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. ఒక అభ్యర్థి మెయిన్ సర్టిఫికెట్‌లో ఒక గేమ్, బ్యాకప్ సర్టిఫికెట్‌లో మరో గేమ్ ఉండటం ఎలా సాధ్యం? మేము ఆధారాలతో ప్రశ్నించిన తర్వాత వెబ్‌సైట్‌లోని డేటానే మార్చడం, చివరకు వెబ్‌సైట్‌ను లేపేయడం ఎందుకు జరిగింది? జీరో ర్యాంకు వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటా కిందనే తీసుకోవాలి. జరగని టోర్నమెంట్‌కు సర్టిఫికెట్ ఎలా వచ్చింది? జూడోలో పార్టిసిపేషన్ సర్టిఫికేషన్ ఉంటే ఉద్యోగం ఇస్తున్నారు. టోర్నమెంట్ జరగకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారు. ఫేక్ సంతకాలతో ఉద్యోగాలు ఇచ్చారు. ఖమ్మంలో అసలు 2013లో జూడో టోర్నమెంటే జరగలేదని అసోసియేషన్ లిఖితపూర్వకంగా ఇచ్చినప్పటికీ, ఆ ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఎలా అమ్ముకున్నారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ సర్టిఫికెట్‌లో సంతకాలు తమవి కాదని ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్‌కు చెందిన కైలాష్ యాదవ్ స్వయంగా చెప్పారు. ఒకే స్థానాన్ని ఇద్దరికి ఎలా కేటాయించారు? జూడోలో ఒకే కేటగిరీ, ఒకే వెయిట్ విభాగంలో ఇద్దరు అభ్యర్థులకు ఒకే రెండో స్థానం చూపించి ఫేక్ సర్టిఫికెట్లు ఎలా సృష్టించి ఉద్యోగాలు ఇచ్చారు? అసలు అధికారిక రిజిస్టర్ తెప్పించి చూస్తే ఆ స్థానాన్ని దుష్యంత్ రెడ్డి సాధించినట్లు రికార్డులో ఉంది. మరి అసలు విజేత పేరును పక్కన పెట్టి మరొకరికి మెరిట్ ఎలా ఇచ్చారు? గుంటూరులో హ్యాండ్‌బాల్‌లో కనీసం ప్లేస్ కూడా రాని అమ్మాయికి మెరిట్‌లో థర్డ్ ప్లేస్ అని తప్పుడు సర్టిఫికెట్ పెట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఎలా ఇచ్చారు? 870 ఫేక్ సర్టిఫికెట్ల నుంచి 32కి ఎందుకు తగ్గించారు? స్పోర్ట్స్ కోటాలో 870 నకిలీ క్రీడా సర్టిఫికెట్లను గుర్తించామని శాప్ చైర్మనే స్వయంగా టీవీలో ఒప్పుకున్నారు. తర్వాత సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే 32 మంది ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించారని సమాచారం ఇచ్చారు. 870 మంది అని మొదట ప్రకటించి, తర్వాత 32 మందికి పరిమితం చేసి బేరసారాలకు ఎందుకు దిగారు? ఆ 32 మందిపై ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకున్నారు? నోటిఫికేషన్‌లో ఫేక్ సర్టిఫికెట్లపై క్రిమినల్ చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు? మెరిట్ విద్యార్థుల గొంతు కోశారు లక్షలాది మంది నిరుద్యోగులు కష్టపడి పరీక్షలు రాశారు. మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఉద్యోగం వస్తుందని ఆశించారు. కానీ మెరిట్‌తో వచ్చిన వారిని పక్కనపెట్టి, అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులకు బ్యాక్‌డోర్‌లో రెడ్ కార్పెట్ వేశారు. యువగళం పాదయాత్రలో పాల్గొన్న వెన్నుపోటు పార్టీ కార్యకర్తలకు, మీ నాయకుల పిల్లలకే ఉద్యోగాలు ఇచ్చి కోట్లు దండుకోవడం వాస్తవం కాదా? డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు, ఎవరు ఎక్కువ ఇస్తే వారికి ఉద్యోగాలు ఇచ్చారు. 1:1 రేషియో, నార్మలైజేషన్ పేరుతో అన్యాయం జరిగిన వారికి ఎందుకు న్యాయం చేయరు? చర్చకు రమ్మంటే ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? డీఎస్సీ 2025 అక్రమాలు జరిగినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. డీఎస్సీపై చర్చ కోసం కౌన్సిల్‌లో ఎంత అడిగినా ప్రభుత్వంలో ఉలుకూ పలుకూ లేదు. ఆధారాలు ఉన్నాయని చెబుతున్నా పట్టించుకోలేదు. నాలుగు రోజుల పాటు శాసనమండలి సమావేశాలు జరిగినా డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. లోకేష్, చంద్రబాబులు సమాధానం చెప్పలేక సభ నుంచి పారిపోయారు. బయట అసెంబ్లీలో మాత్రం రంకెలేశారు. డీఎస్సీ మీద ఎంక్వయిరీ విషయాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ప్రభుత్వంతో చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే చర్చకు రావాలి. ధర్నాలు చేయించి నిజాలను కప్పిపుచ్చలేరు అక్రమాలపై ప్రశ్నిస్తే టీచర్ల మీద కేసులు పెడతాం, సస్పెండ్ చేస్తామంటూ బెదిరించడం మీ దుర్మార్గపు ధృతరాష్ట్ర పాలనకు నిదర్శనం. డీఎస్సీ అక్రమం గురించి మాట్లాడిన వారిపై కేసులు పెడుతున్నారు. ఐఏఎస్ అధికారులే బెదిరిస్తున్నారు. ఉద్యోగాలు పొందిన వారితో ప్రభుత్వం టీచర్లతో ధర్నాలు చేయించడం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయ ధర్నాలకు ఉపయోగించుకోవడం ఎక్కడైనా చూశామా? ఈ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఆపాలి. సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? డీఎస్సీలో అక్రమాలు జరగలేదని దమ్ముంటే నిరూపించండి. ప్రశ్నపత్రం లీక్ నుంచి రిక్రూట్‌మెంట్ పూర్తయ్యే వరకు జరిగిన ప్రతి అంశంపై సమగ్ర దర్యాప్తు జరగాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. మేము ఆరోపణలు మాత్రమే చేయడం లేదు. జీవోలు, ఎఫ్‌ఐఆర్‌లు, ఆడియో రికార్డింగ్‌లు, సర్టిఫికెట్లు, అధికారిక రికార్డులతో సహా ఆధారాలు ప్రజల ముందుంచాం. వైయస్ఆర్‌సీపీ, డీఎస్సీ అభ్యర్థులు లేవనెత్తిన ప్రశ్నలకు కచ్చితంగా సమాధానం చెప్పాలి. వైయస్ఆర్‌సీపీ సీబీఐ ఎంక్వయిరీ మాత్రమే అడుగుతోంది. ప్రభుత్వం నిజాయితీగా ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదు? విచారణకు ఆదేశించే ధైర్యం లేదంటే అక్రమాలకు పాల్పడినట్లు అంగీకరించినట్లేనని ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, కల్పలతారెడ్డి స్పష్టం చేశారు.