డీఎస్సీ-2025 ఎంపికలపై కంప్యూటర్ క్రాస్ వెరిఫికేషన్‌కు ప్రభుత్వం సిద్ధమా?

ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)

డీఎస్సీ-2025 అక్రమాల డొంక కదులుతోంది..

కర్నూలు నుంచి రాష్ట్రవ్యాప్తంగా తీగలు!

టెట్‌లో పాస్ కానివారికి స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టులా?

ఆధారాలతో సహా ఒక్కొక్కటిగా బయటపడుతున్న వాస్తవాలు

డీఎస్సీ అక్రమాలపై వెన్నుపోటు కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ఫైర్.

తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని).

డీఎస్సీ పాపాలను ఎంతకాలం కప్పిపుచ్చుతారు?

కర్మ బలంతో ఒక్కొక్కటిగా బట్టబయలు!

టెట్ అర్హత తప్పనిసరి నిబంధనను పక్కన పెట్టిన ప్రభుత్వం

స్పోర్ట్స్ కోటాలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు ఎలా జరిగాయి?

మెగా డీఎస్సీ కాదు.. అది నిరుద్యోగులను ముంచిన ‘దగా డీఎస్సీ’:

ధ్వజమెత్తిన మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని).

టెట్ అర్హత లేకున్నా ఉద్యోగాలు..

యువగళం కోటాలో స్పోర్ట్స్ ముసుగులో కోట్ల దందా

బయటపడ్డ డీఎస్సీ అక్రమాలపై గోతులదొడ్డి బడుల్లో చీకటి విచారణలా?

సూటిగా ప్రభుత్వాన్ని నిలదీసిన పేర్ని నాని.

డీఎస్సీ-2025 బాగోతంపై సీబీఐ విచారణ జరిపించాలి

అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి:

మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్.

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ-2025 ఒక ‘మెగా డీఎస్సీ’ కాదని, అది నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’ అని వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నారా లోకేష్ తన ‘యువగళం’ కోటా కింద, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అర్హత లేని తమ వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో లక్షల రూపాయలకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. స్వయంగా ప్రజలే ఆధారాలతో సహా ఈ పాపాలను బట్టబయలు చేస్తున్నా, ప్రభుత్వం ఇంకా బుకాయించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ-2025లో ఎంపికైన అభ్యర్థుల టెట్ స్కోర్, కేటగిరీ, సబ్జెక్ట్ అర్హత, కేటాయించిన పోస్టును కంప్యూటర్ ఆధారంగా క్రాస్ వెరిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమా? అని నాని సూటిగా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడులకు నిజాలు బయటపెట్టే దమ్ముందా? స్పోర్ట్స్ కోటాలో సమర్పించిన సర్టిఫికెట్లను, ముఖ్యంగా జరగని ఈవెంట్లకు సంబంధించినవిగా ఆరోపణలు వస్తున్న సర్టిఫికెట్లను పూర్తిస్థాయిలో వెరిఫై చేయించే ధైర్యం ఉందా? అని నిలదీశారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర థర్డ్ పార్టీ ఏజెన్సీ అయిన సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...

కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. లోకేష్ పాపాలు బద్దలవుతున్నాయి.

కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదు. అధికార బలంతో, అనుకూల మీడియా ప్రచారంతో ఎంత కాలం పాపాలను కప్పిపుచ్చగలరు? తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు తీగ లాగితే, రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ-2025 పాపాల డొంకంతా కదులుతోంది. నిన్నటిదాకా అసలు తప్పే జరగలేదన్న ఈ పాలకులు, ఇవాళ 16 వేల మందిలో ఒక్క తప్పు జరిగిందని తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రజలే శోధించి ఆధారాలతో సహా లోకేష్ బండారాన్ని బద్దలు కొడుతున్నారు.

టెట్ పాస్ కానివాడికి టీచర్ ఉద్యోగమా?

ప్రభుత్వ జీవో నం. 15 ప్రకారం టీచర్ ఉద్యోగం రావాలంటే టెట్ అర్హత తప్పనిసరి. ఏ కోటాలో వచ్చినా ఈ నిబంధన వర్తిస్తుంది. బీసీలకు 75 మార్కులు రావాల్సి ఉండగా, కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఒల్లూరు ప్రాథమిక పాఠశాలలో కేవలం 65 మార్కులు వచ్చిన ప్రభాకర్ అనే వ్యక్తికి ఎస్జీటీ ఉద్యోగం ఎలా ఇచ్చారు? 150 మార్కులకు కనీస అర్హత సాధించని అభ్యర్థి ఆన్‌లైన్ దరఖాస్తును కంప్యూటర్ ఎలా స్వీకరించింది? డీఈవోలు, ఐఏఎస్ అధికారులు ఎదురెదురుగా కూర్చుని స్క్రూటినీ చేశామని చెప్పారు కదా.. మరి ఈ అనర్హుడిని ఎలా ఎంపిక చేశారు? పైనుంచి వచ్చిన బలమైన ఒత్తిళ్లు కాక దీనికి కారణమేంటి?

బోర్డర్ మండలాల్లో స్పోర్ట్స్ కోటా దందా..

ఎవరూ రారు, చూడరు అనే ధీమాతో కర్ణాటక సరిహద్దున ఉన్న కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ఏకంగా 24 మంది స్పోర్ట్స్ కోటా టీచర్లను నియమించారు. ఒక్క ఒల్లూరు స్కూల్‌లోనే ఐదుగురు స్పోర్ట్స్ కోటా వాళ్లే పాఠాలు చెబుతున్నారు. 41 ఏళ్ల వయసులో 2009-10 నాటి జూడో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ తెచ్చుకుంటే, 42 ఏళ్లకు టీచర్ కొలువు ఇచ్చేశారు. జూడో ఆడేవాళ్లే లేని రాష్ట్రంలో 30-40 మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు? ఇంత జరుగుతుంటే ఎంఈవో, డీఈవో ఆఫీసుల్లో కాకుండా ‘గోతులదొడ్డి’ స్కూల్లో చీకట్లో రహస్య విచారణలు ఎందుకు జరుపుతున్నారు?

శాప్ ఒక దొంగల బండి.. ప్రైవేట్ కాలేజీ కేంద్రంగా స్కామ్..

"శాప్ (SAAP) ఇవాళ ఒక దొంగల బండిలా మారింది. శ్రీకాళహస్తిలోని ఒక ప్రైవేట్ బీఈడీ కళాశాల కేంద్రంగా ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల దందా నడిచింది. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు రాత పరీక్ష నిబంధనను ఎత్తేస్తూ జీవో 4, జీవో 47 తెచ్చారు. మేము నిలదీశాక మళ్లీ జీవోలు మార్చారు. గుర్రపు స్వారీ (ఈక్వెస్ట్రియన్), ఫెన్సింగ్, రైఫిల్ షూటింగ్ వంటి సంపన్నుల ఆటలను ఏ-కేటగిరీలో పెట్టి.. సామాన్యులు ఆడే కబడ్డీ, బాడీబిల్డింగ్, చెస్, క్యారమ్స్‌లను బి-కేటగిరీకి నెట్టేశారు. అసలు జరగని టోర్నమెంట్లకు ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చిన వారికి కొలువులు కట్టబెట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇదే దగా.. సీబీఐ విచారణ జరపాలి.

చిత్తూరు జిల్లాలో ఓసీ అభ్యర్థికి 90 మార్కులు రావాల్సి ఉండగా, 79 మార్కులే వచ్చినా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో తెలుగులో టెట్ రాస్తే, సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టింగ్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన వారి టెట్ స్కోర్, సబ్జెక్ట్ అర్హతలను కంప్యూటర్ ద్వారా క్రాస్ వెరిఫికేషన్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? తక్షణమే ఈ ‘దగా డీఎస్సీ’పై సీబీఐ లేదా థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలి. నారా లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి.

అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిస్తూ...

పాత టీచర్లకేమో రూల్స్.. యువగళం కోటా వాళ్లకేమో మినహాయింపులా?

పాతికేళ్లు, ముప్పై ఏళ్లుగా నిబద్ధతతో పాఠాలు చెబుతూ సమాజానికి ఎంతో మంది ప్రయోజకులను అందించిన సీనియర్ టీచర్లకేమో టెట్ పాస్ కావాలని వేధిస్తారు. కానీ మీ యువగళం కోటాలో అర్హత లేకపోయినా, టెట్ తప్పినా పర్వాలేదంటూ అడ్డగోలుగా ఉద్యోగాలు కట్టబెడతారా? లోకేష్ తన ఆత్రంతో రాజకీయాల్లో ఒక కామెడీ పీస్‌గా మారిపోతున్నారు.

విద్యావ్యవస్థ విధ్వంసం.. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎగ్గొట్టారు.

డబ్బులిచ్చి సర్వేలు రాయించుకుంటూ 82 శాతం అక్షరాస్యత వచ్చిందని ట్వీట్లు వేసుకోవడం హాస్యాస్పదం. గత రెండేళ్లలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక, చదువు భారమై సుమారు నాలుగైదు లక్షల మంది పేద విద్యార్థులు బడులు, కాలేజీలు మానేశారు. వీళ్లకు ఇవ్వడానికి నిధులు ఉండవు గానీ, యోగా మ్యాట్లకు, ప్రతినెలా సీఎం పెన్షన్ ఇచ్చేందుకు తిరిగే ఆర్భాటాలకేమో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తగలేస్తున్నారు.

ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

ఎన్నికలప్పుడు ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఇస్తామని ఊదరగొట్టిన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక 31 వేల కోట్ల రూపాయల బకాయిలను ఎగ్గొట్టారని నాని మండిపడ్డారు. ఒకపక్క ఉద్యోగుల జీతాల భారం అంటూనే, పాత డీఎస్సీ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి రెండో డీఎస్సీ అంటూ డ్రామాలు ఆడుతున్నారని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపి, ఉద్యోగుల బకాయిలు చెల్లించి, డీఎస్సీ అక్రమాలపై పూర్తిస్థాయి నిష్పక్షపాత విచారణ జరిపించాలని నాని డిమాండ్ చేశారు.
 

Back to Top