పెదకాకానిలో టెన్షన్‌.. టెన్షన్‌

అమ్మవారికి నాంతాడు సమర్పించేందుకు సిద్ధమైన అంబటి మురళీకృష్ణ

వైయ‌స్ఆర్‌సీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు.. భారీగా పోలీసుల మోహరింపు

గుంటూరు: పెదకాకాని శ్రీ భ్రమరాంబ అమ్మవారి ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమ్మవారి మంగళసూత్రం మాయమైన నేపథ్యంలో వారం రోజుల క్రితం కొత్త మంగళసూత్రాన్ని సమర్పించిన పొన్నూరు వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ అంబటి మురళీకృష్ణ.. ముందుగా ప్రకటించిన మేరకు ఇవాళ అమ్మవారికి నాంతాడు కానుకగా సమర్పించేందుకు సిద్ధమయ్యారు.

అంబటి మురళీకృష్ణతో పాటు పలువురు భక్తులు కొత్త నాంతాడును తయారు చేయించి అమ్మవారికి సమర్పించేందుకు ఆలయానికి చేరుకున్నారు. అయితే వారిని అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా ఆలయ పరిసరాలకు చేరుకున్నారు. దీంతో పెదకాకానిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అంబటి మురళీకృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కోన రఘుపతిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మల్లాది విష్ణు కారుపై దాడికి యత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.

అమ్మవారికి నాంతాడు సమర్పిస్తామని అంబటి మురళీకృష్ణ వారం రోజుల క్రితమే ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి వచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, భక్తులను ఆలయం వైపు వెళ్లకుండా అడ్డుకోవడంపై ఉద్రిక్తత కొనసాగుతోంది.

Back to Top