కూటమి పాలనపై విసుగు.. వైయ‌స్ఆర్‌సీపీలోకి 70 మంది చేరిక

 జగనన్న పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం: రేగం చాణక్య

 అరకు: డుంబ్రిగుడ మండలం కొర్ర పంచాయతీ పెదపాడులో వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీ విస్తృతస్థాయి సమావేశం, పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, సీపీఎం పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 70 మంది వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.

కూటమి ప్రభుత్వ పాలనపై విసుగు చెంది, గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేసుకుని వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. పార్టీలో చేరిన వారికి వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు రేగం చాణక్య కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రేగం చాణక్య మాట్లాడుతూ.. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు సాగుతాయని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, గ్రామస్థాయిలో వైయ‌స్ఆర్‌సీపీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వారిలో మాజీ వైస్‌ సర్పంచ్‌ వంతాల కామేశ్వరరావు, గెమ్మెలి కామయ్య, ప్రభాకర్‌, కేశవరావు, కకారి బాలరాజు, కొర్ర దసన్న నాయుడు, బురిడి దామోదర్‌, కొండబాబు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాంగి పరశురామ్‌, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ మండల నాయకులు, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.

Back to Top