కూటమి పాలనలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ రవాణా..

వంద రోజుల్లో గంజాయి నిర్మూలన డెడ్‌లైన్ ఏమైంది?

హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి:

సూటిగా నిలదీసిన  వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల.

తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల.

టీవీ షోల టీఆర్పీలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో గంజాయి నియంత్రణపై లేదా?..

ప్రచారాలు కట్టిపెట్టి పూర్తిస్థాయి డ్రగ్ నెట్‌వర్క్‌ను కూల్చాలి: ఆరే శ్యామల డిమాండ్

వైయస్.జగన్ హయాంలో ఆపరేషన్ పరివర్తనతో 90 శాతం గంజాయి నిర్మూలన..

కూటమి పాలనలో పోలీసులే రవాణాదారులుగా మారడం సిగ్గుచేటు: ఆరే శ్యామల ఫైర్

 తాడేపల్లి : కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనలో రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా అక్రమ రవాణా అవుతున్నా, మాటల గారడీ తప్ప వాటి నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లో గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామని, ఒక్క గంజాయి మొక్క కూడా కనిపించకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన హోంమంత్రి, నేడు రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడుతుంటే ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. గతంలో వైయస్.జగన్ ప్రభుత్వంలో ‘సెబ్’ను ఏర్పాటు చేసి, ‘ఆపరేషన్ పరివర్తన’ ద్వారా 90 శాతం గంజాయి సాగును సమూలంగా నిర్మూలించడంతో పాటు రైతులకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించి మార్గదర్శకంగా నిలిచామని ఆమె గుర్తుచేశారు. 

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...

అబద్ధాల మత్తులో ముంచుతూ.. యువత జీవితాలతో ఆటలు.

రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలను అబద్ధాల మత్తులో ముంచుతూ, మరోవైపు నిజమైన మత్తు పదార్థాలను విచ్చలవిడిగా అందుబాటులో ఉంచి యువత భవిష్యత్తును నాశనం చేస్తోంది. ఎన్నికల ముందు గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని తెస్తామని చంద్రబాబు, లోకేష్ పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక ఎక్కడ చూసినా భారీ స్థాయిలో గంజాయి, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపామని సీఎం చంద్రబాబు సినిమా స్టైల్‌లో మాట్లాడటం తప్ప క్షేత్రస్థాయిలో సాధించింది శూన్యం. కూటమి ప్రభుత్వం ఆడుతున్నది స్ట్రెయిట్ గేమ్ కాదు, యువత భవిష్యత్తును నాశనం చేసే అత్యంత టాక్సిక్ గేమ్.

టీవీ షోల టీఆర్పీలకే హోంమంత్రి ప్రాధాన్యత..

రాష్ట్రంలో ఆడపిల్లలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతూ ఆర్తనాదాలు చేస్తుంటే హోంమంత్రి అనిత గారికి అవి ఏమాత్రం వినిపించడం లేదు. ఆమె దృష్టి అంతా టీవీ షోల షూటింగులు, టీఆర్పీలు పెంచుకోవడంపైనే ఉంది తప్ప, పెరుగుతున్న గంజాయి కేసులను అరికట్టడంపై లేదు. పండగలు, దసరా స్పెషల్స్ అంటూ ఆమె కాలక్షేపం చేస్తున్నారు. ‘ఈగల్’ విభాగానికి డేగ కళ్లు ఉన్నాయంటూ మాటలకే పరిమితమైన హోంమంత్రిగా ఆమె మిగిలిపోయారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ ఆదేశాలను పాటించే కీలుబొమ్మలా వ్యవహరిస్తూ, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఏం సాధించారో ప్రజలకు చెప్పాలి.

పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం.. సిగ్గుచేటు

మొన్న ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకరవారపాడు వద్ద పోలీసుల కారు డిక్కీలోనే గంజాయి, మద్యం బాటిళ్లు పట్టుబడటం అత్యంత సిగ్గుచేటు. ప్రజలు పట్టుకున్న 24 గంటల తర్వాత ఎస్పీ వివరణ ఇచ్చారు. తప్ప, ఎక్కడ ఎంత రికవరీ చేశారు, అధికారులు సివిల్ డ్రెస్సుల్లో ఎందుకు ఉన్నారనే ప్రశ్నలకు సమాధానం లేదు. పోలీసులే రవాణాదారులుగా మారుతున్న ఘటనలపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు.

వంద రోజుల డెడ్‌లైన్ తర్వాతే భారీ డ్రగ్స్ పట్టివేతలు..

మూడు నెలల్లో గంజాయిని నిర్మూలిస్తామన్న హోంమంత్రి మాటల తర్వాతే రాష్ట్రంలో గంజాయి, లిక్విడ్ గంజాయి, హాష్ ఆయిల్, ఎండీఎంఏ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. గత మూడు నెలల రికార్డులను పరిశీలిస్తే:  ఆగస్టు 27న తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో రూ.75 లక్షల విలువైన 6 లీటర్ల లిక్విడ్ గంజాయి పట్టుబడింది. సెప్టెంబర్ 2న విజయవాడ శివారు ఏనమలకుదురు/ప్రసాదంపాడు సమీపంలో గంజాయి ముఠా దాడిలో కానిస్టేబుల్ గాయపడ్డారు.  సెప్టెంబర్ 4న అనకాపల్లిలో ఒడిస్సా నుంచి తెచ్చిన రూ.3 కోట్ల విలువైన 600 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 17న విశాఖ పెదగంట్యాడ వద్ద బెంగళూరు నుంచి సరఫరా అయిన ఎండీఎంఏ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. సెప్టెంబర్ 27న అల్లూరి జిల్లా పెద్దబయలు వద్ద రూ.1.34 కోట్ల విలువైన 10.77 లీటర్ల లిక్విడ్ గంజాయి దొరికింది.సెప్టెంబర్ 28న హోంమంత్రి సొంత జిల్లా అనకాపల్లిలోని కోడూరు జంక్షన్ వద్ద రూ.5.5 కోట్ల విలువైన 43 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 8న విశాఖ నగరంలో 50 గ్రాముల ఎండీఎంఏ, లీటర్ హాష్ ఆయిల్ దొరికింది. ఇదేనా మీరు తెచ్చిన మార్పు? సొంత జిల్లాలో రూ.5.5 కోట్ల విలువైన హాష్ ఆయిల్ పట్టుబడితే హోంమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు?.

ఈగల్ వెబ్‌సైట్ లెక్కలే ప్రభుత్వ వైఫల్యానికి సాక్ష్యం..

ఆంధ్రప్రదేశ్ ‘ఈగల్’ అధికారిక వెబ్‌సైట్ డేటా ప్రకారమే రాష్ట్రంలో 2,444 కేసులు నమోదు కాగా, 6,332 మందిని అరెస్టు చేశారు. 6,07,825 కిలోల గంజాయి, 12,633 కిలోల ఇతర మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో గంజాయే లేదని మంత్రులు సభల్లో చెబుతూ, అధికారిక వెబ్‌సైట్లలో వేల సంఖ్యలో కేసులు ఎలా చూపిస్తున్నారు? ఆపరేషన్ చైతన్య, ఆపరేషన్ గరుడ అని పేర్లు మార్చడం తప్ప సాధించిన కొలవదగిన ఫలితం ఏంటి?.

వైయస్సార్‌సీపీ హయాంలోనే 90 శాతం గంజాయి నిర్మూలన

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  హయాంలో ‘నో డ్రగ్ ఏపీ’ అనేది కేవలం నినాదంలా కాకుండా విధానంగా అమలు చేశాం. సెబ్ (SEB)ను ఏర్పాటు చేసి, ‘ఆపరేషన్ పరివర్తన’ ద్వారా 90 శాతం గంజాయి సాగును నిర్మూలించాం. గంజాయి సాగు చేసిన గిరిజనులను శిక్షించకుండా, వారికి ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం విత్తనాలు పంపిణీ చేసి ఆదుకున్నాం. అనకాపల్లి కోడూరు వద్ద ఏకంగా 2 లక్షల కిలోల గంజాయిని ఒకేసారి దహనం చేసి ధ్వంసం చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది.

గంజాయి నివారణకు మీరేం చేశారు? 

గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న 712 మంది నిందితుల్లో ఇప్పటివరకు ఎంతమందిని పట్టుకున్నారు? పెండింగ్ వారెంట్ల సంగతేంటి?. పట్టుబడుతున్న వాహనాలు, భారీ సరుకుల వెనుక ఉన్న అసలు ఫైనాన్షియర్లు, సిండికేట్ సూత్రధారులను ఎంతమందిని గుర్తించారు?. కళాశాలలు, హాస్టళ్లు, విద్యాసంస్థల సమీపంలో మాదకద్రవ్యాల విక్రయాలపై నమోదైన కేసుల వివరాలను జిల్లాలవారీగా ఎందుకు బయటపెట్టడం లేదు?.

మరోవైపు అవగాహన కార్యక్రమాల వల్ల వాడకం తగ్గిందని చెప్పే నిర్దిష్ట లెక్కలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా?  అని ఆరే శ్యామల ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు, యువతకు కావాల్సింది హోంమంత్రి ఇచ్చే టీవీ వినోదం కాదని.. డ్రగ్స్ మహమ్మారి నుంచి సంపూర్ణ రక్షణ మాత్రమేనని స్పష్టం చేశారు. కేవలం చిరు వ్యాపారుల అరెస్టులు కాకుండా, మూలాల్లో ఉన్న డ్రగ్ నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకిలించడంతో పాటు... ఇప్పటికైనా ప్రభుత్వం కంటితుడుపు ప్రచారాలు ఆపి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

Back to Top