రాజంపేటలో నామినేషన్లకు అడ్డంకులు.. అభ్యర్థులకు భద్రత కల్పించాలి

ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి  

అన్నమయ్య జిల్లా: రాజంపేటలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆరోపించారు. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని, తమను గృహ నిర్బంధంలో ఉంచి పార్టీ కార్యాలయం నుంచి బయటకు రాకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ అభ్యర్థులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రశాంతమైన రాజంపేటలో ఇదేం పరిస్థితి?

సమితి ఎన్నికల నుంచి గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల వరకు రాజంపేటలో ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ సాగేదని ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

పోలీసుల తీరుపై అభ్యంతరం

మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో టీడీపీకి చెందినవారికే పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని, నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ తమ అభ్యర్థులకు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించడం లేదని ఎమ్మెల్యే ఆరోపించారు. రాజంపేట సంస్కృతికి విరుద్ధంగా రాజకీయ వాతావరణాన్ని ఉద్రిక్తంగా మారుస్తున్నారని విమర్శించారు.

ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి

నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్న తమకు భద్రత కల్పించాలని వైయ‌స్ఆర్‌సీపీ మున్సిపల్ అభ్యర్థులు కోరారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి, అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి కోరారు. 

Back to Top