వాల్మీకిపురం: అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వాల్మీకిపురంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కుమారుడు సాయికృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేయడం అభ్యర్థుల హక్కు. అలాంటి సమయంలో అభ్యర్థులపై లాఠీచార్జి చేయడం, నాయకులను అరెస్ట్ చేయడంపై వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పీలేరు నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియకు ఆటంకాలు లేకుండా చూడాల్సిన పోలీసులు, అభ్యర్థులపై బలప్రయోగానికి దిగడం ఏమిటని వైయస్ఆర్‌సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.