మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలీసుల నిర్బంధం, నామినేషన్లకు అడ్డంకులు కొనసాగుతున్నాయి. వైయస్ఆర్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నామినేషన్ల చివరి రోజున కూడా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మూడు రోజులుగా ఆయనపై నిర్బంధం కొనసాగుతుండటంతో పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై రెండు రోజులు గడిచినా మాచర్ల నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. నియోజకవర్గవ్యాప్తంగా అభ్యర్థులకు ఆటంకాలు సృష్టిస్తూ, దాడులకు దిగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడుతున్నాయి. మరోవైపు, పోలీసుల సమక్షంలోనే వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయని, అయినప్పటికీ దాడులను అడ్డుకోవడంలో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అభ్యర్థులపై దాడులు, నామినేషన్లకు అడ్డంకులు కొనసాగుతుండగా వైయస్ఆర్‌సీపీ నాయకులను మాత్రం గృహ నిర్బంధంలో ఉంచడం పక్షపాత వైఖరికి నిదర్శనమని పేర్కొంటున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం, అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మాచర్లలో చోటుచేసుకుంటున్న ఘటనలపై ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించి, అభ్యర్థులకు భద్రత కల్పించి, నామినేషన్ల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు కోరుతున్నాయి.