ఎన్నికల కమిషన్ ఎప్పుడో చేతులెత్తేసింది!

స్థానిక ఎన్నికల్లో అరాచకాలు.. ఎస్ఈసీకి కనిపించవు, వినిపించవు!

వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఆగ్రహం

టీడీపీ గూండాల అరాచకంపై విజ‌య‌వాడ‌లో ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠాకు వైఎస్సార్‌సీపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ కార్యాల‌యం వ‌ద్దే వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, క‌ల్ప‌ల‌తారెడ్డి, ఎంప్లాయిస్ అండ్ పెన్ష‌న‌ర్స్ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

నామినేషన్ల చివరి రోజున కూడా వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు అడుగడుగునా అడ్డంకులు

నామినేషన్ పత్రాలు చించివేత.. అభ్యర్థులపై దాడులు.. నాయకులకు గృహ నిర్బంధం

పోలీసు, రెవెన్యూ అధికారుల్లో కొందరు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న వైనం

సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం కరువు

చివరి గంటలో సర్క్యులర్లు జారీ చేసి నామినేషన్లకు అవకాశం కల్పించడంపై వైయ‌స్ఆర్‌సీపీ నేతల అభ్యంతరం

ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించి, బాధిత అభ్యర్థులకు రక్షణ కల్పించాలి

మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి.

తాడేప‌ల్లి: స్థానిక ఎన్నికల్లో అరాచకాలు జరుగుతున్నా ఎన్నికల కమిషన్‌కు కనిపించడం లేదని, వినిపించడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ ఎప్పుడో చేతులెత్తేసిందని, నామినేషన్ పత్రాలు చించివేత, అభ్యర్థులపై దాడులు, పార్టీ నాయకుల గృహ నిర్బంధం వంటి ఘటనలను అడ్డుకోవడంలో ఎస్ఈసీ విఫలమైందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీ గూండాల అరాచకంపై విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు వైయ‌స్ఆర్‌సీపీ నేతల బృందం ఆధారాలతో ఫిర్యాదు చేసింది. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మీడియా స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఏమ‌న్నారంటే..

- సుప్రీంకోర్టు ఆదేశించినా నామినేషన్ల అడ్డంకులు తొలగలేదు:  లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ

“ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల చివరి రోజు కూడా వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను అడుగడుగునా అడ్డుకున్నారు. పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేయడం, నామినేషన్ పత్రాలు చించివేయడం, అభ్యర్థులపై దాడులకు పాల్పడటం వంటి ఘటనలు జరిగాయి. పోలీసు, రెవెన్యూ అధికారుల్లో కొందరు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనలపై ఎన్నికల కమిషనర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం.

- ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదు. కేవలం నాలుగు ప్రాంతాల్లోనే రీనామినేషన్లకు పరిమిత అవకాశం కల్పించడం సమంజసం కాదు. అధికారుల నివేదికలనే నమ్మకుండా, బాధితుల ఫిర్యాదులు, ఫొటోలు, వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఆ బాధ్యతను గుర్తించి స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు చర్యలు తీసుకోవాలి.

- చివరి నిమిషపు సర్క్యులర్లు కంటి తుడుపు చర్యే

నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థులకు చివరి గంటలో సర్క్యులర్ జారీ చేసి పోలీసు ఎస్కార్ట్ కల్పిస్తామని చెప్పడం కంటి తుడుపు చర్యే. గ్రామాల నుంచి నామినేషన్ కేంద్రాలకు చేరుకోవడానికి తగిన సమయం, రక్షణ కల్పించాలి. ఫేక్ నామినేషన్లు, బీఫారాల సమర్పణకు సంబంధించి ఎదురవుతున్న అడ్డంకులపై విచారణ జరపాలి. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలి. నామినేషన్ల గడువు పొడిగించి అర్హులైన ప్రతి అభ్యర్థికి పోటీ చేసే అవకాశం కల్పించాలి” అని లేళ్ల అప్పిరెడ్డి తేల్చి చెప్పారు.

- మహిళలపై దాడులు జరుగుతున్నా స్పందించని ప్రభుత్వం: కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ

“ రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీ మహిళా అభ్యర్థులపై దాడులు చేస్తూ, చీరలు లాగుతూ, జుట్టు పట్టి ఈడుస్తున్నా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం స్పందించడం లేదు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఎన్నికల్లో వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం దారుణం. చివరి గంటలో సర్క్యులర్లు జారీ చేసి నామినేషన్లు వేయాలని చెప్పడం వల్ల బాధితులకు న్యాయం జరగదు. మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని, అర్హులైన ప్రతి అభ్యర్థికి నామినేషన్ వేసే అవకాశం కల్పించాలి. న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ న్యాయపోరాటం కొనసాగిస్తుంది” అని క‌ల్ప‌ల‌తారెడ్డి స్ప‌ష్టం చేశారు.

 - ఎన్నికల అక్రమాలపై అధికారులు బాధ్యత వహించాలి:
నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు

“నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులను అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను చించివేయడం, దాడులు చేయడం, నాయకులను గృహ నిర్బంధం చేయడం జరుగుతున్నా ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? నామినేషన్ పత్రాలను అభ్యర్థుల నుంచి లాక్కుని చించివేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాసే విధంగా కాకుండా అధికారులు చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి. ప్రతి అభ్యర్థికి నామినేషన్ వేసే అవకాశం కల్పించి, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి ” అని చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

ఎస్ఈసీని క‌లిసిన వారిలో వైయ‌స్ఆర్‌సీపీ గ్రివెన్స్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు అంకంరెడ్డి నారాయ‌ణమూర్తి, మీడియా ఫ్యాన‌లిస్ట్ ష‌రీఫ్‌, ఎస్సీ సెల్ రాష్ట్ర‌ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ యోహ‌న్ రాజు, బొందిలి విభాగం అధ్య‌క్షుడు న‌రేంద్ర సింగ్‌,   హ‌స‌న్‌, ర‌బ్బాని త‌దిత‌రులు ఉన్నారు.

Back to Top