ప్రచారంలో దూసుకుపోతున్న వరుదు కల్యాణి

  ‘సేవ్‌ వైజాగ్‌’ నినాదంతో హోరెత్తిన ప్రచారం

విశాఖపట్నం: విశాఖ నగరాన్ని కాపాడుకోవాలి.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలి.. నగర అభివృద్ధిని కొనసాగించాలి అనే లక్ష్యంతో వైయ‌స్ఆర్‌సీపీ మేయర్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ‘సేవ్‌ వైజాగ్‌’ నినాదంతో ప్రజల్లోకి వెళ్తూ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. వినూత్న ప్రచారశైలితో స్థానిక ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

 బీచ్‌రోడ్‌లో వాకర్స్‌తో మాటామంతీ

బీచ్‌రోడ్‌లో ఉదయం నడకకు వచ్చిన వాకర్స్‌తో వరుదు కల్యాణి ముచ్చటించారు. నగరంలో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలు, విశాఖ భవిష్యత్తు అభివృద్ధిపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు. ఆరిలోవ ప్రాంతంలో చిరు వ్యాపారులు, వృద్ధులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిత్యజీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ముఖ్యంగా తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు సక్రమంగా అందేలా చూడాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

 తాగునీటి సమస్యలపై ప్రజలతో చర్చ

విశాఖలో తాగునీటి ఇబ్బందులను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుంటూ, నగరంలో నీటి సరఫరా పరిస్థితిపై దృష్టి సారించారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందడం అత్యంత కీలకమని, మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రచారంలో వివరించారు. ‘సేవ్‌ వైజాగ్‌’ నినాదంతో సాగుతున్న ప్రచారంలో వరుదు కల్యాణి నగర అభివృద్ధి, ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై వైయ‌స్ఆర్‌సీపీ వైఖరిని ప్రజల ముందుంచుతూ, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. 

Back to Top