ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా చంద్రబాబుకు దాసోహం

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల స్క్రూట్నీలో  కూటమి పక్షపాతిగా ఆయన చర్యలు

 వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం

స్థానిక ఎన్నికల్లో కూటమి అక్రమాలు, దౌర్జన్యాలపై ఎస్ఈసీ అధికారులకు ఫిర్యాదు చేసిన పార్టీ ఎమ్మెల్సీ  లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు

 కుట్రపూరితంగానే వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ

 అధికార పార్టీ ముసుగు, చట్టంలో లొసుగుతో ఏకపక్ష చర్యలు

 ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టీకరణ

 టీడీపీ నేతలే నకిలీ నామినేషన్లు వేస్తూ ఫేక్ ప్రక్రియను సాగిస్తున్నారు

 కుప్పంలో జరుగుతున్న దారుణాలకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు..?

 లేళ్ల అప్పిరెడ్డి నిలదీత

 ఎస్ఈసీ పోస్టాఫీసులా వ్యవహరిస్తే ఎలా..?

 కూటమి అరాచకాలు, అక్రమాలపై వైసీపీ చేసిన ఫిర్యాదులపై చర్యలేవీ..?

 క్షేత్రస్థాయిలో పర్యటించి ఎస్ఈసీ వివరాలు సేకరించలేదు ఎందుకు..?

 లేళ్ల అప్పిరెడ్డి సూటి ప్రశ్నలు

విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పూర్తిగా దాసోహం అయ్యారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల స్క్రూటినీలో అధికార పార్టీకి పక్షపాతిగా వ్యవహరిస్తూ  వారికి అనుకూలంగా చర్యలు తీసుకోవడం దారణమని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, స్క్రూట్నీలో కూటమి పక్ష పాతంగా అధికారుల వ్యవహరిస్తున్న తీరుపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటుగా పలువురు నాయుకులు అధికారులను కలసి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ,  అధికార పార్టీ సాగిస్తున్న ఆరాచకాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా  రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏమాత్రం స్పందించడం
లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణలో కొత్త కొత్త నిబంధనలు తెరపైకి తెస్తూ, ఆధికార పార్టీ ముసుగులో, చట్టాల లోసుగులను వాడుతూ  అభ్యర్థిత్వాలను తిరస్కరణకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేరుతో టీడీపీ నేతలే నకిలీ నామినేషన్లు వేస్తూ ఎస్ఈసీ సహకారంతో ఫేక్ నామినేషన్ల ప్రక్రియను సాగిస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేసారు.  సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా కూటమికి బానిసలుగా పని చేస్తున్న అధికారులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఎట్టిపరిస్థితుల్లోనూ చట్టం ముందు నిలబెడతామని తేల్చి చెప్పారు.  ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా ఏం మాట్లాడరంటే... 
 

- వైఎస్సార్సీపీ  ఫిర్యాదులపై చర్యలేవీ..? క్షేత్రస్థాయిలో ఎస్ఈసీ పరిశీలన చేయరా..?

ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు, అధికార పార్టీ నాయకుల ప్రవర్తన, అధికారుల తీరుపై మేము ప్రతిరోజూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నాం. అయితే మా ఫిర్యాదులను స్వీకరించి కిందిస్థాయి అధికారులకు పంపిస్తున్నామని చెప్పడం తప్ప, వాటిపై సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఎన్నికల సంఘం కేవలం పోస్టాఫీసులా వ్యవహరిస్తే ఎలా?మేం చేసిన ఫిర్యాదులపై ఎస్ఈసీ గానీ, ఆయన సిబ్బంది గానీ ఎన్నడైనా, ఎక్కడైనా సరే క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించి తెలుసుకున్న దాఖలాలు కూడా లేవు.   నామినేషన్ల పరిశీలన సమయంలో అభ్యర్థులు సమర్పించిన పత్రాలు, ఆస్తిపన్ను వివరాలు, ఓటరు జాబితా వివరాలు, స్వీయ ధ్రువీకరణ పత్రాలు తదితర అంశాలను పరిశీలించాలి. కానీ ఇప్పుడు నిబంధనలను తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ, చిన్నచిన్న సాంకేతిక కారణాలతో నామినేషన్లను తిరస్కరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి.  ఓటరు సీరియల్ నంబర్‌లో అంకె మారిందనే కారణంతో అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించడం, రుణాలపై వడ్డీ బకాయిలున్నాయనే సాకుతో నామినేషన్ తిరస్కరించడం, ప్రభుత్వ పథకం కింద ఇల్లు పొందిన అభ్యర్థి  వివరాలు చూపలేదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేయడం వంటి చర్యలు ఎస్ఈసీ కూటమి పక్షపాతిగా వ్యవహరిస్తుందనేందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.   వైఎస్సార్‌సీపీ పేరుతో నామినేషన్లు వేసిన కొందరు వ్యక్తులకు తెలుగుదేశం పార్టీ నాయకులతో సంబంధాలున్నాయనే ఆధారాలు లభించాయి. కుప్పం వంటి ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వ్యక్తుల రాజకీయ నేపథ్యం, వారి అనుబంధాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఒక పార్టీకి చెందిన వ్యక్తులు మరో పార్టీ పేరుతో నామినేషన్లు వేసి, ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకుంటే అసలు పోటీలో ఉన్న అభ్యర్థులను అడ్డుకోవడానికి అది ఒక మార్గంగా మారే ప్రమాదం ఉంది. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం స్వతంత్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలి. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

- కుప్పంలో చంద్రబాబు కుట్రలు బహిర్గతం

ఎన్నికల విలువలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో జరుగుతున్న పరిణామాలపై సమాధానం చెప్పాలి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్లినప్పుడు అడ్డంకులు ఎదురవుతున్న ఘటనలను చూసాం.  పార్టీ అభ్యర్థులను తీసుకెళ్లే ప్రయత్నాలపై దాడులు జరిగాయని కూడా ఫిర్యాదులు వచ్చాయి.  మరోవైపు వైఎస్సార్‌సీపీ పేరుతో నామినేషన్లు వేసిన వారి రాజకీయ నేపథ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై ఎన్నికల సంఘం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ చేపట్టాలి.  ముఖ్యమంత్రి దేశంలో ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని నిర్ణయించడంలో తన పాత్ర గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ వైఎస్సార్‌సీపీ తరఫున ఎవరు పోటీ చేయాలో నిర్ణయించే హక్కు మాత్రం ఆయనకు లేదు. ఇతర పార్టీల అభ్యర్థులను నిర్ణయించే సంస్కృతిని తీసుకురావద్దని చంద్రబాబుకు స్పష్టం చేస్తున్నాం.

- సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలేమయ్యాయి..?

ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న ఘటనలపై సుప్రీంకోర్టు దృష్టి సారించిన నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సమస్యాత్మక ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవ పరిస్థితులను న్యాయస్థానానికి నివేదించాలి. నామినేషన్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను సమర్థంగా అమలు చేయాలి. నామినేషన్ కేంద్రాల్లోకి రాజకీయ నాయకులు ప్రవేశించి అధికారులపై ప్రభావం చూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నప్పుడు, అక్కడి పరిస్థితులను పారదర్శకంగా పర్యవేక్షించాలి.  కేవలం కిందిస్థాయి అధికారులు ఇచ్చే నివేదికలపై ఆధారపడకుండా, అవసరమైన చోట రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ జరపాలి. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను కూడా ప్రజలకు వెల్లడించాలి.

 
- తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టం

రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జరిగిన అక్రమాలు, అధికారుల వ్యవహారశైలి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగి తీసుకున్న నిర్ణయాలపై చట్టపరమైన పరిధిలో విచారణ జరిపిస్తాం. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినట్లు, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారణ అయితే వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు చర్యలు తీసుకుంటాం.  అధికారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను విస్మరించవద్దు. నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాలి. ఇకనైనా సరే  రాష్ట్ర ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించి, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది అని వైెస్సార్ సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు.

Back to Top