ఆర్వో సెంటర్లలో సీసీ ఫుటేజీని భధ్రపరచాలి

 మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ 

 వెన్నుపోటు పార్టీ నేతల కనుసన్నల్లో ఆర్వోలు, అధికారులు

 మాజీ మంత్రి సాకే శైలజా నాథ్ ధ్వజం

అనంతపురం లోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్

 నీతులు, సూక్తులు చెప్పడంలో చంద్రబాబు ప్రవచనకర్తలను మించిపోయారు

 వారసుడి రాజకీయ చట్రంలో ఇరుక్కుని దురాగతాలు

 మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆగ్రహం

 అనంతపురం, కడప, పల్నాడు జిల్లాలో దౌర్జన్యాలకు ఎవరు బాధ్యత వహిస్తారు ?

 ఫేక్ నామినేషన్లు, దౌర్జన్యాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

 ప్రెస్ మీట్ లో తేల్చి చెప్పిన సాకే శైలజానాథ్ 

అనంతపురం: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించకుండా కుట్రలు, కుతంత్రాలతో ప్రహసనంగా మార్చిందని  మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు.  ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, దాడులకు పాల్పడటం, మహిళా అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయడం, నామినేషన్ పత్రాల విషయంలో అక్రమాలకు పాల్పడటం వంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన ఉదహరించారు. అనంతపురంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సాకే శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ,   రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ల కార్యాలయాల్లోని  సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని డిమాండ్ చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద వెన్నుపోటు పార్టీ నేతలు, కూటమి నాయకులు, వారి అనుచరులు చెప్పినట్లు అధికారులు  పని చేస్తున్న తీరుపై  కూడా విచారణ జరగాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేలా ఎవరైనా వ్యవహరించి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.  అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, స్వతంత్రంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నీతి సూక్తులు వల్లివేయడంలో ప్రవచనకర్తలను మించిపోయారని ఎద్దేవా చేసారు.  గతంలో జరిగిన స్థానిక ఎన్నికలను  బహిష్కరించిన టీడీపీ నాయకత్వం, ఇప్పుడు ఏకగ్రీవాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఎన్నికలను బహిష్కరించడం ద్వారా తమ పార్టీ అభ్యర్థులను, కార్యకర్తలను చంద్రబాబు నాయుడు నట్టేట ముంచారని ఆక్షేపించారు. అనేక ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసి గెలిచినప్పటికీ, పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కార్యకర్తలు నష్టపోయారని గుర్తు చేసారు.  ప్రజలను, పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పడం తగదని మాజీ మంత్రి సాకే శైలజా నాథ్ హితవు పలికారు. 
ఈ ప్రెస్ మీట్ ఆయన ఇంకా ఏం మాట్లాడరంటే...

- ఈ దురాగతాలకు ఏం సమాధానం చెబుతారు..: 

వైఎస్సార్ జిల్లాలోని చక్రాయపేటలో 11 నామినేషన్లకు సంబంధించి కూటమి నేతలులతో కుట్ర పూరితంగా ఫేక్ నామినేషన్లు వేయించలేదా..? దీనిని  ఎలా సమర్థించుకుంటారు.  పెండ్లిమర్రి ప్రాంతంలోనూ, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఫేక్  నామినేషన్ల వెనుక  వెన్నుపోటు పార్టీ నేతలున్నారన్న వైఎస్సార్ సీపీ ఫిర్యాదులను  అధికారులు కనీసం పరిశీలన చేసారా..? ఒక పార్టీకి చెందిన వ్యక్తులు మరో పార్టీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసినట్లు తేలితే, అందుకు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియదా..? ఈ  అరాచకాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.  గుత్తి, గుంతకల్లు, పుట్లూరు, ఎల్లనూరు ప్రాంతాల్లో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చగా నిలుస్తాయి.  ఎల్లనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక ఎస్సీ మహిళా ఎంపీటీసీ అభ్యర్థి ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రజాసామ్యానికి ప్రమాదకరం. సదరు మహిళా అభ్యర్థిని ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌లోనే  ఉద్దేశ్యపూర్వకంగా నిర్భందం చేసి,  నామినేషన్ గడువు ముగిసిన తర్వాత ఆమెను బయటకు పంపడంతో చివరకు పత్రాలు దాఖలు చేయలేకపోయారు.  ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పోలీసుల పర్యవేక్షణలో ఉన్న అభ్యర్థిని నామినేషన్ దాఖలు చేయలేకపోవడానికి ఎవరు బాధ్యత వహిస్తారు..? ఎన్నికల సంఘం, పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పష్టమైన సమాధానం చెప్పాలి.

- నామినేషన్ల తిరస్కరణలో పారదర్శకత ఏది?: 

నామినేషన్ల పరిశీలనలో నిబంధనలను ఇష్టానుసారంగా అమలు చేస్తున్నారు.  కొన్ని చోట్ల సరైన కారణాలు తెలియజేయకుండానే నామినేషన్లను తిరస్కరించారు.  అభ్యర్థులు అడిగినప్పుడు సంబంధిత అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదు. బుక్కరాయసముద్రం ప్రాంతంలో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించి జరిగిన పరిణామాల ఇందుకు నిదర్శనం. అర్హతలపై సందేహాలుంటే నిబంధనల ప్రకారం వ్యవహరించాలి తప్ప రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకూడదు. నామినేషన్ పత్రాలు స్వీకరించిన తర్వాత వాటిలో కొన్ని పత్రాలు కనిపించకపోవడం, రసీదుల్లో వివరాలు ఉన్నప్పటికీ సంబంధిత పత్రాల విషయంలో సమస్యలు తలెత్తడం వంటి ఆరోపణలపై విచారణ జరగాలి.  

- బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: 

స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న దాడులు, బెదిరింపులు, నామినేషన్ల తిరస్కరణలు, పత్రాల గల్లంతు, నకిలీ నామినేషన్ల అంశాలపై ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపించాలి  అవసరమైన చోట సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుంది.  అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తాం. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు కలిసి రావాలని సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు.

Back to Top