కడప: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను భయపెట్టి గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని, నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డగింతలు, దాడులు, దౌర్జన్యాలు, చివరికి ఫేక్ నామినేషన్లతో బరి తెగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. జగన్ కూడా ఇలాగే చేసి ఉంటే మీరు ఎక్కడ ఉండే వారని ఆయన చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల మాటలు విని దాడులకు, అక్రమాలకు సహకరిస్తున్న అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. ప్రెస్ మీట్లో రవీంద్ర నాథ్ రెడ్డి ఇంకేమన్నారంటే..: దుర్మార్గంగా స్థానిక ఎన్నికల తీరు : చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉందా అసలు ? ఆయన జీవిత చరమాంకంలో ఉన్నారు. గతంలో ప్రజలకు మంచి చేయకపోయినా, ఏ ప్రాంతానికీ మంచి చేయకపోయినా, ఏ కులానికి మంచి చేయకపోయినా, ఏ వ్యక్తికి మంచి చేయకపోయినా.. ఇప్పుడు చేస్తున్న పాలన అంతకన్నా దుర్మార్గంగా ఉంది. నీ రాజకీయమే వెన్నుపోటు నుంచి ప్రారంభమై క్లైమాక్స్ లో పరాకాష్టకు చేరిపోయింది. సుప్రీంకోర్టు, హైకోర్టులు మొట్టికాయలు వేసినా చంద్రబాబుకు బుద్ధి రావడం లేదు. యథేచ్ఛగా మీ గూండాలు రాయలసీమ జిల్లాలతో పాటు పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అయినా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అయినా నామినేషన్లు వేయనీయడం లేదు. అధికారులు ముందే సాగిలపడుతున్నారు. అధికారుల ముందే అంతా జరుగుతున్నా వాళ్లు పట్టించుకోలేదు. నామినేషన్ పత్రాలు చించేయడం, మహిళలను సైతం లెక్కచేయకుండా దాడులు చేయడం, ఎవర్నీ వీళ్లు వదలడం లేదు. నామినేషన్లు లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం ? దీన్ని అసలు రాజకీయం అంటారా ? మేం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగే అనుకుని ఉంటే పరిస్ధితి ఎలా ఉండేదో తెలుసుకోండి. మంచి చేశాకే ప్రజల్ని ఓట్లడగాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడం వల్లే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి. ఎక్కడ చూసినా 80-90 శాతం పైగా ఓటింగ్ జరిగింది, ఫలితాలు కూడా అలాగే వచ్చాయి. దీనంతటికీ కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనే. సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఈవీఎంల వల్లే ఓడిపోయాం కానీ, ఎన్నికలు పారదర్శకంగా జరిగి ఉంటే కచ్చితంగా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అయ్యేవారు. ఫేక్ నామినేషన్లతో మభ్యపెట్టే యత్నం: ఇప్పుడు వైఎస్సార్సీపీ అభ్యర్ధులకు డూప్లికేట్లు తయారు చేసి టీడీపీ వాళ్లతో ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా నామినేషన్లు వేయిస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించామని కోర్టుల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని మభ్యపెట్టడానికే ఇదంతా చేస్తున్నారు. రామకుప్పం మండలం టీడీపీ నాయకుడు శంకరప్ప వైఎస్సార్సీపీ అభ్యర్దిగా నామినేషన్ వేశారు, అలాగే నీ సొంత నియోజకవర్గం కుప్పంలోని జీడిమాకుల పల్లె, సింగసముద్రం సెగ్మెంట్ లో తన భార్య పుష్పమ్మ పేరుతో వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా దొంగ నామినేషన్ వేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. నామినేషన్ల మొదటిరోజు ఎంపీటీసీలకు సంబంధించి 5267 నామినేషన్లు వైఎస్సార్సీపీ వేస్తే.. రెండో రోజు కల్లా వాటిని 26,856కు పెంచేశారు. ఇదంతా కోర్టుల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికే. మూడో రోజు కల్లా 25,016 ఎంపీటీసీ నామినేషన్లు వేశారు. జడ్పీటీసీలు కూడా తొలిరోజు వైఎస్సార్సీపీ పేరు మీద 409 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండో రోజు 2409 నామినేషన్లు, మూడో రోజు 3515 నామినేషన్లు వైఎస్సార్సీపీ తరఫున ఫేక్ నామినేషన్లు వేశారు. వీళ్లంతా వైఎస్సార్సీపీ కాదని విత్ డ్రా తర్వాత, బీ ఫామ్ ఇచ్చాక ప్రజలకు తెలుస్తుంది. అంతవరకూ వీళ్లు ప్రజల్ని మభ్యపెట్టవచ్చు. బరితెగింపు అధికారులు మూల్యం చెల్లించుకోవడం ఖాయం: కడపలో 14 జడ్పీటీసీల్లో ఫేక్ నామినేషన్లు వేశారు. దాఖలైన 39 నామినేషన్లలో ఇప్పుడు ఆమోదించినవి చూస్తే 21 మాత్రమే. మిగతావన్నీ తిరస్కరించారు. 39 నామినేషన్లలో ఓ ఆరు నామినేషన్లు పోలీసుల్ని అడ్డుపెట్టుకుని వీళ్లు చేసిన దాష్టికానికి బలైన వాళ్లే. నామినేషన్ కేంద్రాల లోపల మాత్రం వందల మంది వీళ్ల నాయకులే ఉంటారు. బయటి నుంచి మా వాళ్లు ఒక్కరిని కూడా రానివ్వరు. వేటిని తిరస్కరించాలి, వేటిని ఆమోదించాలన్నది పై నుంచి అన్నీ ఒత్తిళ్లే. స్ధానిక సంస్ధలకు జరిగేవి చిన్న ఎన్నికలే. ప్రజాస్వామ్యయుతంగా జరిగితే మంచి నాయకులు వచ్చి ప్రజలకు మేలు జరుగుతుంది. అలా కాకుండా మొత్తం ఎలక్షన్ ఫార్సుగా మార్చేస్తున్నారు. దీనికి బదులు మీరే నామినేట్ చేసుకుని ఉండాల్సింది. ఆంధ్రాలో వీళ్ల అరాచకాలు బీహార్ ను మించిపోయాయి. పోలీసులు, జిల్లా అధికారులను అడ్డుపెట్టుకుని వీళ్లు పులుల్లా తిరుగుతున్నారు. మా వాళ్లను వదిలితే తెలుస్తుంది ఎవరు పులులో. తిరిగి వైఎస్సార్సీపీ వాళ్లే దాడులు చేస్తున్నారని కోర్టుల్ని, ప్రజల్ని మభ్యపెడుతున్నారు. నామినేషన్ల తిరస్కరణకు గురైన వాళ్ల తరఫున అప్పీలుకు వెళ్తున్నాం. కలెక్టర్ గారు ఏం చేస్తారో చూడాలి. ఐఏఎస్, ఐపీఎస్ లు పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూస్తాం, అందరికీ మేలు చేస్తాం, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతామని ప్రమాణం చేసి వస్తారు. కానీ అలాంటి వాళ్ల ముందే ఇవాళ బదిలీలు, సొంత పనుల కోసమో, డబ్బుల కోసమో ఇలా దిగజారిపోతున్నారు. ప్రజాప్రతినిధులు వస్తుంటారు, పోతుంటారు, కానీ అధికారులు శాశ్వతం. వాళ్లకు సుమారు 45 ఏళ్ల సర్వీసు ఉంటుంది. కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో వీళ్లు ఇలా బరితెగిస్తున్నారు. ఈ పనులకు వారు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ ప్రజాప్రతినిధులకు వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే సినిమా చూపించడం ఖాయం. ఇప్పటికైనా వీళ్లంతా తమ తీరు మార్చుకోవాలని రవీంద్రనాథ్ రెడ్డి హితవు పలికారు.