నెల్లూరు: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక, వెల్లువలా వస్తున్న ప్రజావ్యతిరేకతకు భయపడి స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు వరుసగా దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని, తాజాగా ఫేక్ నామినేషన్లు, నామినేషన్ల తిరస్కరణలు, ఆమోదించి నామినేషన్ల విత్ డ్రాకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎన్ని అక్రమాలకు పాల్పడినా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గుండె ధైర్యంతో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు వీరోచితంగా పోరాడుతున్నారని ఆయన కితాబిచ్చారు. చంద్రబాబు బ్లాక్ మెయిలింగ్ కూ, ఉడత ఊపులకూ బెదిరేది లేదని, ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం కొనసాగిస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి తేల్చిచెప్పారు. ప్రెస్ మీట్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంకేమన్నారంటే.. ఎన్నికల హింసతో రాష్ట్రం పరువు తీస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై వైఎస్సార్సీపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేయడం, పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్ఈసీ తూతూమంత్రంగా నాలుగు చోట్ల మాత్రం నామినేషన్ల గడువు పొడిగించింది. ఆ తర్వాత రెండో ఘట్టంలో భాగంగా సుప్రీంకోర్టు చెంపపెట్టులాంటి తీర్పుు ఇవ్వడం, చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుబట్టడం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీని మీద సమీక్షించాలని ఇచ్చాక చంద్రబాబుకు ఏమాత్రమైనా నీతి నిజాయితీ ఉంటే రాజీనామా చేయాల్సింది. ఇంత అనుభవజ్ఞుడని చెప్పుకునే చంద్రబాబు.. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అంటేనే ఏహ్యభావం కలిగేలా, రాష్ట్రం పరువుకు తీవ్ర నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే తీరు కొనసాగిస్తే మళ్లీ సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టేలా ఉందని తెలిసి మరో కుట్రకు తెరలేపారు. ఈ ఎన్నికల్లో అయినా చంద్రబాబు సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని వ్యవహరిస్తాడని అనుకుంటే అదీ జరగడం లేదు. దీనికి బదులుగా టీడీపీ అభ్యర్ధులతో నామినేషన్లు వేయించడం, వైఎస్సార్సీపీ అభ్యర్ధుల్ని అడ్డుకోవడం, టీడీపీకి సంబంధించిన వ్యక్తుల చేతే వైఎస్సార్సీపీ నామినేషన్లు కూడా వేయిస్తున్నారు. రేపు ఒకవేళ వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించినా, లేదు అంతా న్యాయబద్దంగా జరిగింది, నామినేషన్లు సక్రమంగానే దాఖలయ్యాయని చెప్పుకునేందుకు కుట్ర మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఫేక్ నామినేషన్లను ఆధారాలతో సహా మేం బయటపెడుతున్నాం. వైఎస్సార్సీపీ తమ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని చెప్పుకోకుండా ఉండేందుకు, నామినేషన్లు వేసిన వ్యక్తులు పోటీలో పాల్గొనకుండా చేసి, వారంతా ఓటు అడగకుండా చేసి, ఏకగ్రీవంగా గెలిచినట్లు చూపించుకునేందుకే ఇదంతా చేస్తున్నారు. ఫేక్ నామినేషన్లతో మరో కుట్రకు తెరలేపిన చంద్రబాబు ఎన్ని విధాలుగా కుట్రలు, దొంగతనాలకు పాల్పడాలో అన్నీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు. ఆయన జీవితంలో ఎక్కడా నీతి, నిజాయితీ కనిపించవు. అందుకే ఫేక్ నామినేషన్లు వేయించి, దొంగ లెక్కలు, కాకి లెక్కలతో ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రహసనంగా మార్చేస్తున్నారు. మొదటిది దాడులు చేసి నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం, రెండవది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నామినేషన్లు వేయలేదనే అంశాన్ని అధిగమించడానికి తన మనుషులతో దొంగనామినేషన్లు వేయించడం, మూడవది కొంత మంది ఎదురుతిరిగి నామినేషన్లు వేసిన వాళ్ల నామినేషన్లను తిరస్కరించడం. నెల్లూరు జిల్లాల్లోనూ ఇలాగే రిటర్నింగ్ అధికారులు ఏమాత్రం నీతీ నిజాయితీలు లేకుండా, అన్నీ విడిచిపెట్టి, అక్కడున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల మాటల్ని వేదంలా భావించి, వారి స్వామి భక్తిని చాటుకున్నారు. ప్రజాస్వామ్య విలువలకూ, రాజ్యాంగ నిబంధనలకు పాతరేస్తూ ఆర్వోలు వ్యవహరిస్తున్నారు. ఏదో విధంగా బలమైన అభ్యర్ధుల్ని, వైఎస్సార్సీపీ తరఫున గెలుస్తారని అనుకున్న వారి నామినేషన్లను తిరస్కరిస్తున్నారు. వెంటనే అప్పీలుకు వెళ్తారు కాబట్టి తిరస్కరణకు గురైన నామినేషన్లు ఆమోదించకుండా ఆర్డీవోలపై ఒత్తిడి తెస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల ఆర్వోలు ఆమోదించిన నామినేషన్లను సైతం తిరస్కరించాలంటూ ఆర్డీవోలకు అప్పీల్లు పెడుతున్నారు. వృత్తి పేరు రాయలేదని ఒకరి నామినేషన్, పెళ్లి కాకపోయినా భార్య ఆస్తులు డిక్లేర్ చేయలేదంటూ మరో నామినేషన్ తిరస్కరించారు. పెళ్లే కాని వ్యక్తికి భార్య ఎక్కడి నుంచి వస్తుంది చంద్రబాబూ. మా లీగల్ టీమ్ వెళ్లి అభ్యంతరాలు చెప్పినా, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, రాతపూర్వకంగా ఇచ్చి వెళ్లాలని ఆర్వోలు చెప్పేస్తున్నారు. నామినేషన్ తిరస్కరించినట్లు కొన్ని చోట్ల లేఖలు ఇచ్చారు, మరికొన్ని చోట్ల అది కూడా ఇవ్వడం లేదు. ఏ కారణంతో తిరస్కరించారో చెప్పాలని మా అభ్యర్ధులు ఆర్వోల దగ్గర అప్పీలు చేసుకోవాల్సిన పరిస్ధితులు ఉన్నాయి. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే అక్రమాలు ఎన్నికలకు ముందే చంద్రబాబు అనేక హామీలు ఇచ్చాడు. వాటిని అమలు చేయలేని పరిస్ధితుల్లో ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రజలు భగ్గు మంటున్నారు, ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయం వారికి ఉంది. చంద్రబాబు ఇవాళ ఓటమిపాలైతే రేపు అధికారులు ఆయన మాట వినరు కాబట్టి, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా ఏదో విధంగా గెలిచామనే సందేశం ఇస్తే తప్ప గట్టెక్కలేమనే అక్రమాలకు దిగుతున్నారు. గంజాయి బ్యాచ్ ను కూడా రంగంలోకి దింపి, వాళ్లను కొట్టండి, చంపండి కానీ వాళ్లు నామినేషన్ వేయడానికి లేదని చెప్తున్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో ఆర్డీవో.. ఇన్ కంప్లీట్ అని నామినేషన్ తిరస్కరించారు, మీడియా అడిగినా సమాధానం చెప్పలేదు. వైఎస్సార్సీపీ వేసిన నామినేషన్లను రెండో రోజు టీడీపీ ఆఫీసుకు తీసుకెళ్లి ఇచ్చి, వాటిలో తప్పులు వెతకమని చెప్పడం, వాళ్లు చెప్పిన తప్పుల ఆధారంగా వాటిని తిరస్కరిస్తున్నారు. రేషన్ షాపు నడిపే వాళ్లు, వాటిని ఎప్పుడో తీసేసినా, గతంలో రేషన్ షాపు ఉంది కాబట్టి నామినేషన్ తిరస్కరించామని చెప్తున్నారు. అంగన్ టీచర్లు సైతం రాజీనామాలు చేసినా, ఇంకా పనిచేస్తున్నట్లుగానో, రికవరీలు ఉన్నాయని చెప్పి నామినేషన్లు తిరస్కరిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేసిన వాళ్లను సైతం మీ మీద రికవరీ వచ్చిందని డీఆర్డీఏ నుంచి సమాచారం వచ్చిందని చెప్పి నామినేషన్లు తిరస్కరిస్తున్నారు. డ్వాక్రా మహిళలు లోన్లు తీసుకుంటే, ఏపీఎం దగ్గరో, సీసీ దగ్గరో కాయితం రాయించి ఈమె ఆ గ్రూపులో ఉంది, ఆ గ్రూపుకు సంబంధించిన లోను ఆమె చూపించలేదు అని చెప్పి నామినేషన్లు తిరస్కరిస్తున్నారు. దీన్ని బట్టి ఎన్నికలకు చంద్రబాబు ఎంత భయపడుతున్నాడో అర్దమవుతోంది. సాధారణ ఎన్నికల్లో ప్రజల ఓట్లతో గెలిచిన చంద్రబాబు.. అదే ప్రజల ఓటు హక్కు హరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు మర్చిపోరని గుర్తించాలి. రాష్ట్ర ప్రజలు కీలెరిగి వాతలు పెడతారని తెలుసుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేదు, శక్తి లేదు, దమ్మూ ధైర్యం లేదు, అటువంటప్పుడు నామినేట్ చేసుకుంటే సరిపోయేది తప్ప, ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుని, దొంగ నామినేషన్లు వేయించి, నామినేషన్లను తిరస్కరించి దాన్ని గెలుపుగా చెప్పుకుంటారా? ఆ గెలుపును గెలుపుగా ప్రజలు అనుకుంటారా, దాన్నే గెలుపుగా అనుకునే స్దాయికి చంద్రబాబు దిగజారిపోయారా చెప్పాలి. చంద్రబాబు డైరెక్షన్, అధికారుల యాక్షన్ చంద్రబాబు డైరెక్షన్ ఆధారంగా ఆయన కింద ఉన్న డీజీపీ, డీఐజీలు, ఐజీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ పోలీసులు వ్యవహరిస్తున్నారు. దాని ప్రకారం రిటర్నింగ్ అధికారి యాక్షన్ చేస్తున్నారు. ఫలితంగా మొత్తం ఎన్నికల ప్రక్రియనే ఓ ప్రహసనంగా మార్చేసి, అభ్యర్ధులు పోటీ చేయకూడదు, ప్రజలు ఓటేయకూడదు, నేను చెప్పిన వ్యక్తే ఈరోజు ఎన్నిక కావాలనే దుర్మార్గమైన ఆలోచన కనిపిస్తోంది. ఎక్కడైనా ఆర్వోలు ఒకరిద్దరు గట్టిగా నిలబడి, తమ ఆత్మసాక్షి ప్రకారం నామినేషన్లు ఆమోదిస్తే, సదరు అభ్యర్ధులకు ఫోన్లు చేసి కేసులు బనాయిస్తామని, కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. కొంతమంది గిరిజనుల్ని బెదిరించి పోలీసు స్టేషన్లో పెట్టడం, విత్ డ్రా ఫారాలు తీసుకొచ్చి సంతకాలు చేయండి, మీ మీద కేసు లేకుండా చేస్తామని చెప్తున్నారు. ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్లింది, ప్రజాస్వామ్య విలువలు ఎక్కడికి పోయాయో తెలియట్లేదు. దళితుల్ని, గిరిజనుల్ని సైతం పోలీసు స్టేషన్లను తీసుకొచ్చి కేసులు పెడతామని బెదిరించి నామినేషన్లను విత్ డ్రా చేయిస్తున్నారు. చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాటలు ప్రజలకు అసహ్యం కలిగించేలా ఉన్నాయి. తన బురదను తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి పూసేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను భ్రష్టుపట్టిపోయా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనూ ఇలాగే జరిగిందని చెప్పుకోవడం అంటే, నేను చేయలేకపోయాను, నా చేతుల్లో లేదు అని చెప్తున్నట్లా లేక మీ గెలుపును నేను భరించలేకపోతున్నాను కాబట్టి ఇదంతా చేస్తున్నా అని చెబుతున్నట్లా అర్ధం కావట్లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రాణాలకు తెగించి రాష్ట్రంలో పోరాడారు. మీరు కత్తులు తెచ్చినా, కటార్లు తెచ్చినా, రాళ్లతో దాడులు చేసినా, దేనికైనా సిద్దపడ్డారు తప్ప వెనుకడుగు వేయలేదు. పోలీసులు కేసులు పెడుతున్నా, లాఠీచార్జ్ లు చేసినా, అవమానించినా, వైఎస్సార్సీపీ శ్రేణులు ముందుకు రావడం అభినందించాల్సిన విషయం. చంద్రబాబు ఉడత ఊపులకు బెదిరేది లేదు ఏ తప్పు చేయకుండానే పెళ్లకూరుకు సంబంధించిన నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి గారెని రెండోసారి అక్రమంగా జైల్లో పెట్టారు. జైలు నుంచే నామినేషన్ వేసేందుకు ప్రయత్నిస్తే జైలు సూపరింటెండెంట్ సంతకం పెట్టకుండా ఆటంకాలు కల్పించారు. హైకోర్టుల తీర్పుల్ని ప్రస్తావిస్తే ... సంతకం పెట్టారు. గూడూరులో మరో నాయకుడు యద్దాల నరేందర్ రెడ్డి ఇంట్లోకి 25 మంది పోలీసులు గోడలు దూకి వెళ్లి సోదాలు చేశారు. ఆయన్ను అడ్డుతొలగించుకుంటే గూడూరులో సులువుగా ఎన్నికలు జరిగిపోతాయని ఇలా చేశారు. మరో సీనియర్ నాయకుడు భక్తవత్సల రెడ్డి మీద అక్రమంగా 307 కేసు పెట్టి గాలిస్తున్నారు. మరో నాయకుడు శ్రీనివాసులరెడ్డిని అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపారు. మీరు నామినేషన్లు వేస్తే జైలుకు పోవడానికి సిద్దంగా ఉండండి, అంతే తప్ప మీ నామినేషన్లు ఒప్పుకోం, ఒక వేళ నామినేషన్ వేసినా ఉపసంహరించుకుంటారా లేక జైలుకు పోతారా అని బెదిరిస్తున్నారు. దళితులు, వెనుక బడిన వర్గాలని, ముస్లింలని చూడకుండా వైఎస్సార్సీపీ అభ్యర్ధుల్ని టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే మొత్తం తతంగం జరుగుతోంది. ఎక్కడికక్కడ గంజాయి బ్యాచ్ లు, సంఘవిద్రోహక శక్తుల్ని రంగంలోకి దింపి మహిళల బట్టలు చింపేయడం, దాడులు చేస్తున్నారు. పోలీసులు శాంతిభద్రతలు కాపాడేందుకు కాదు, టీడీపీ, కూటమి పెద్దలు చెప్పినట్లు నడుచుకోవడానికే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయిస్తుంటే సామాన్యులకు ఈ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా చంద్రబాబు..ఈ ఎన్నికలు నా వల్ల కావని కాడి కింద పడేసి వెళ్లిపోయారు. కానీ ఇవాళ విపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకు స్పందించి నామినేషన్లు వేసేందుకు ముందుకొచ్చి పోరాటం చేస్తుంటే, దాన్ని తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రతీ ఒక్కరికీ పోటీ చేసే, ఓటు వేసే హక్కు కల్పించాలని న్యాయపోరాటం చేస్తాం. మీ బ్లాక్ మెయిలింగ్ కు, ఉడత బెదిరింపులకు భయపడేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గుండె ధైర్యంతో వైఎస్సార్సీపీ శ్రేణులు పోరాడతాయి. వైఎస్సార్సీపీ క్షేత్రస్ధాయిలో బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం ఉంది, వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించే అవకాశం ఉందన్న నిఘా నివేదికలతోనే ఎలాగైనా పరువు ప్రతిష్టలు కాపాడుకునేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రల్ని ఖండిస్తున్నాం. వైఎస్సార్సీపీ తమ అభ్యర్ధులతో పాటు ప్రజలకూ అండగా నిలుస్తుంది. అక్రమాలకు అండగా నిలిచిన పోలీసులపై ప్రైవేటు కేసులు వేయబోతున్నాం. వాటి ఆధారంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.