విశాఖ: స్థానిక సంస్థల ఎన్నికల్లో నమ్మకానికి.. అమ్మకానికి మధ్య పోరాటం జరుగుతోందని వైయస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. విశాఖపట్నం భూములు, పర్యావరణం, ప్రజల హక్కులు, నగర భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో “సేవ్ వైజాగ్” నినాదంతో వైయస్ఆర్సీపీ ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. చంద్రబాబుది “సేల్ వైజాగ్” విధానమైతే, వైయస్ జగన్‌ది “సేవ్ వైజాగ్” సంకల్పమని వైయస్ఆర్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైయస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే.కే.రాజు పేర్కొన్నారు. విశాఖలోని వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నేతలు, అనంతరం “సేవ్ వైజాగ్” పోస్టర్‌ను ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో వైయస్ఆర్సీపీ నేతలు ఏమన్నారంటే.. - విశాఖను కార్పొరేట్లకు అమ్మేస్తున్నారు: కురసాల కన్నబాబు, మాజీ మంత్రి “రెండున్నరేళ్లలో విశాఖకు చంద్రబాబు చేసిందేమిటి? యోగా డేలు, సమ్మిట్లు, ఫోటోషూట్ల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి ఏది? పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా వేలాది ఎకరాలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. ఎకరం 99 పైసలకే విలువైన భూములిచ్చే విధానంతో విశాఖను ‘సేల్ వైజాగ్’గా మార్చేశారు. తాగునీటి ఎద్దడి, మౌలిక వసతుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. భోగాపురం విమానాశ్రయ పనులు, పోలవరం కాలువల ద్వారా వచ్చిన నీటి విషయంలో కూడా గతంలో జరిగిన పనులకు చంద్రబాబు తన ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు. రుషికొండ పేరుతో పర్యావరణంపై మాట్లాడినవారే ఇప్పుడు విశాఖలో కొండలను తవ్వేస్తున్నారు. - నకిలీ నామినేషన్లతో ఎన్నికల వ్యవస్థను దెబ్బతీస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు అడ్డుకున్న వ్యవహారంపై కోర్టులు ప్రశ్నించడంతో వైయస్ఆర్సీపీ పేరుతో నకిలీ నామినేషన్లు వేయించే కుట్రకు కూటమి నేతలు తెరతీశారు. టీడీపీ కండువాలతో వచ్చి వైయస్ఆర్సీపీ తరఫున నామినేషన్లు వేసి, తర్వాత ఉపసంహరించుకోవడం ద్వారా ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ల అడ్డంకులు, నాయకుల గృహ నిర్బంధాలు, పోలీసు వ్యవస్థ దుర్వినియోగం ప్రజాస్వామ్యానికి విఘాతం. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. విశాఖ భూములు, పర్యావరణం, ప్రజల భవిష్యత్తును కాపాడేందుకే వైయస్ఆర్సీపీ ‘సేవ్ వైజాగ్’ పోరాటం. విశాఖ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణితో పాటు పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి విశాఖను కాపాడుకోవాలి” అని కురసాల కన్నబాబు విశాఖ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. - విశాఖ భవిష్యత్తుకు “బ్లూ వైజాగ్” లక్ష్యం: గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి “విశాఖ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి నాయకత్వంలో ‘బ్లూ వైజాగ్’ నినాదంతో బీచ్‌ల అభివృద్ధి, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, పారిశుధ్యం, ప్రజారోగ్యం, తాగునీరు, రహదారులు, పార్కులు, క్రీడా సముదాయాలు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తాం. జగన్మోహన్రెడ్డి గతంలో ప్రతిపాదించిన లక్ష కోట్ల రూపాయల ‘విజన్ విశాఖ’ ప్రణాళికను మా స్థానిక మేనిఫెస్టోకు ప్రాతిపదికగా తీసుకుంటాం. విశాఖను భూముల అమ్మకాలకు కేంద్రంగా మార్చే కూటమి విధానానికి వ్యతిరేకంగా ‘సేవ్ వైజాగ్’ నినాదంతో పోరాడతాం. పెన్షన్లు, రేషన్ కార్డులు తొలగిస్తామంటూ బెదిరించినా వైయస్ఆర్సీపీ శ్రేణులు వెనక్కి తగ్గవు. జగన్ విశ్వసనీయతకు, చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో వరుదు కళ్యాణితో పాటు వైయస్ఆర్సీపీ అభ్యర్థులందరినీ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలి.” - విశాఖలో భూముల కోసమే కూటమి తాపత్రయం: కేకే రాజు, వైయస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు “విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి, అధికార దర్పానికి మధ్య పోటీ జరుగుతోంది. గీతం యూనివర్సిటీకి చెందిన రూ.5,000 కోట్ల విలువైన 55 ఎకరాల భూముల వ్యవహారంలో గతంలో వైయస్ఆర్సీపీ మేయర్‌ను దించేందుకు ప్రయత్నించిన కూటమి నాయకులు, ఇప్పుడు తమ ప్రయోజనాల కోసం వందల కోట్ల ధన ప్రవాహంతో పాటు వైయస్ఆర్సీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారు. వ్యాపారాలు చేసుకోనివ్వమని, ఉపసంహరించుకుంటే ఆర్థిక సహాయం చేస్తామని కార్పొరేటర్ అభ్యర్థులపై ఒత్తిడి తెస్తున్నారు. విశాఖ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ, తాగునీటి సమస్యను పరిష్కరించలేని ప్రభుత్వం నగర భూములను మాత్రం కారుచౌకగా కట్టబెడుతోంది. ప్రజల పక్షాన పోరాడే వరుదు కళ్యాణిని మేయర్‌గా, వైయస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించి విశాఖ భవిష్యత్తును కాపాడాలి.” - విశాఖ విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రజల తీర్పు కావాలి: వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ, విశాఖ మేయర్ అభ్యర్థి “కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విశాఖను విధ్వంసం చేస్తున్నారు. గత ఆరు నెలలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి, సింహాద్రి అప్పన్న కొండపై పర్యావరణ విధ్వంసం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ముప్పు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పేదల బడ్డీలను, చిన్న ఇళ్లను తొలగిస్తున్న ప్రభుత్వం రూ.5,000 కోట్ల విలువైన భూముల వ్యవహారంపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ధరల నియంత్రణలోనూ ప్రభుత్వం విఫలమైంది. శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి గారి హయాంలో విశాఖను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను మేయర్‌గా, అన్ని డివిజన్ల వైయస్ఆర్సీపీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించి ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం కల్పించాలి” అని వరుదు కళ్యాణి ఓటర్లను అభ్యర్థించారు.