విశాఖపట్నం: టీడీపీ నేత చిన్న శ్రీను అలియాస్ మజ్జి శ్రీనివాసరావు ఉత్తరాంధ్రలో కొత్త సంస్కృతికి తెరలేపారని, కుల ధ్రువీకరణ పత్రాల వ్యవహారంతో బీసీల రిజర్వేషన్లకు ఎసరు పెట్టే ప్రయత్నం జరుగుతోందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు మండిపడ్డారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెం వైయస్ఆర్‌సీపీ జిల్లా కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్తవలస, తెర్లాం జెడ్పీటీసీ స్థానాలకు సిరి సహస్ర దాఖలు చేసిన నామినేషన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ, నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు పాటించారా లేదా అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని, బీసీల రిజర్వేషన్ హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే సిరి సహస్ర నామినేషన్లను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో రేగిడి లక్ష్మణరావు ఏమన్నారంటే.. - బీసీ సర్టిఫికెట్లతో నామినేషన్లు ఎలా వేస్తారు? “సిరి సహస్ర జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల జాబితాలో తండ్రి పేరు ముస్కాన్ జైన్‌గా నమోదై ఉందనే అంశంపై స్పష్టత ఇవ్వాలి. కొత్తవలస, తెర్లాం జెడ్పీటీసీ స్థానాలకు ఆమె బీసీ కుల ధ్రువీకరణ పత్రాలతో నామినేషన్లు దాఖలు చేయడంపై మాకు అభ్యంతరాలు ఉన్నాయి. ఈ పత్రాల చెల్లుబాటు, ఆమె అర్హతపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ జరపాలి. - నామినేషన్ డిపాజిట్‌పైనా సమాధానం చెప్పాలి జెడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్‌కు సంబంధించి జనరల్ కేటగిరీకి రూ.6 వేలు చెల్లించాల్సి ఉండగా, బీసీ కేటగిరీ కింద రూ.3 వేల డిపాజిట్ చెల్లించిన వ్యవహారంపై ఎన్నికల అధికారులు వివరణ ఇవ్వాలి. సిరి సహస్ర నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని ఎలా అంగీకరించారు? నామినేషన్ల పరిశీలనలో అన్ని నిబంధనలను పాటించారా? ఈ ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలి. - బీసీల రిజర్వేషన్ హక్కులను కాపాడాలి బీసీలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన రిజర్వేషన్ హక్కులకు భంగం కలిగించే పరిస్థితులను సహించేది లేదు. కుల ధ్రువీకరణ పత్రాల జారీ నుంచి నామినేషన్ల స్వీకరణ వరకు ప్రతి అంశాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించాలి. చిన్న శ్రీను ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలి. అర్హత, నిబంధనల విషయంలో ఎలాంటి సందేహాలున్నా వాటిని సంబంధిత అధికారులు చట్ట ప్రకారం పరిష్కరించాలి. - ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి సమగ్ర విచారణకు చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్లు దాఖలైనట్లు విచారణలో తేలితే వాటిని తిరస్కరించాలి. అభ్యంతరాలను పట్టించుకోకుండా నామినేషన్లను కొనసాగిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. బీసీల రిజర్వేషన్ హక్కులను పరిరక్షించేందుకు చట్టపరంగా పోరాడతాం” అని రేగిడి లక్ష్మణరావు స్పష్టం చేశారు.