సుప్రీంకోర్టు ఆదేశించినా చంద్రబాబు తీరు మారలేదు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్రలు ఆపలేదు!

వైయ‌స్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ‌ వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఫైర్‌

వైయ‌స్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ‌ వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా స‌మావేశంలో మాట్లాడారు. 

19 మున్సిపాలిటీల్లో నామినేషన్లకు అడ్డంకులు.. రీనామినేషన్‌కు పరిమిత అనుమతులతో అభ్యర్థులకు అన్యాయం

కడపలో 66 వార్డులకు 13 చోట్లే పోటీకి అవకాశం.. రాజంపేటలో 32 వార్డులకు 14 చోట్లే పోటీ

మరో నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లోనూ స్క్రూటినీ పేరుతో చైర్మన్‌ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని వైయస్‌ జగన్‌ వెల్లడి

ఎంపీటీసీ ఎన్నికల్లో 659 మండలాలకు గాను 101 మండలాల్లో సున్నా నామినేషన్లు.. మరో 70 మండలాల్లో ఐదుకంటే తక్కువ

నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, దాడులు, ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరణలు, నకిలీ నామినేషన్లతో ప్రజాస్వామ్యానికి విఘాతం

నామినేషన్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, కేంద్ర బలగాలు.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలి

బాధిత అభ్యర్థులకు వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ అండ.. ప్రతి ఘటనకు ఆధారాలతో న్యాయపోరాటం

ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో పుస్తకం విడుదల చేసిన మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

తాడేప‌ల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియను అడ్డుకోవడం, అభ్యర్థులపై దాడులు, నామినేషన్‌ పత్రాలను చింపేయడం, స్క్రూటినీ పేరుతో అభ్యర్థిత్వాలను తొలగించడం వంటి ఘటనలపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాపాడాల్సిన ఎన్నికల వ్యవస్థే బాధితులకు న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు అక్టోబర్‌ 25 వరకు తుది అభ్యర్థుల జాబితా ప్రకటనను వాయిదా వేయాలని, నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల ఫిర్యాదులు, పత్రాలు, ఎలక్ట్రానిక్‌ ఆధారాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలోనూ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని తెలిపారు. నామినేషన్లకు పూర్తి రక్షణ కల్పించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం, నిష్పక్షపాత ఎన్నికల కోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేయడం అత్యవసరమని స్పష్టం చేశారు.

మీడియా స‌మావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ గారు ఏమ‌న్నారంటే.. 

 సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతైనా వ్యవస్థలు మారాలి

“స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలను ఆధారాలతో సహా గవర్నర్‌, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాం. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాలపై తీవ్రంగా స్పందించింది. అక్టోబర్‌ 25 వరకు తుది అభ్యర్థుల జాబితా ప్రకటనను వాయిదా వేయాలని, శాంతిభద్రతల సమస్యల కారణంగా నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల ఫిర్యాదులు, పత్రాలు, ఎలక్ట్రానిక్‌ ఆధారాలను పరిశీలించాలని ఆదేశించింది. అవసరమైతే నామినేషన్ల గడువును పొడిగించి, జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద అదనపు ఏర్పాట్లు చేసి అభ్యర్థులకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. నామినేషన్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాట్లపై కూడా ఆదేశాలు ఇచ్చింది. అయినా చంద్రబాబులో, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో, పోలీసు వ్యవస్థలో మార్పు కనిపించడం లేదు.”

 కడప, రాజంపేటల్లో పరిమిత రీనామినేషన్లు ఎందుకు?

“19 మున్సిపాలిటీల్లో మా అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న ఘటనలకు ఆధారాలతో సహా సుప్రీంకోర్టును ఆశ్రయించాం. కానీ రీనామినేషన్‌ ప్రక్రియను పరిమితంగా మాత్రమే అనుమతించారు. మైదుకూరులో అన్ని వార్డులకు అవకాశం ఇచ్చారు. తిరుపతిలో మిగిలిన 18 వార్డులకు, కడపలో 11 వార్డులకు, రాజంపేటలో మరో 11 వార్డులకు మాత్రమే అవకాశం కల్పించారు. కడప కార్పొరేషన్‌లో మొత్తం 66 వార్డులు ఉంటే, గతంలో రెండు వార్డుల్లో మాత్రమే పోటీకి అవకాశం కల్పించారు. ఇప్పుడు మరో 11 కలిపినా మొత్తం 13 వార్డులకే పరిమితం అవుతోంది. రాజంపేటలో 32 వార్డులకు గాను గతంలో మూడు వార్డుల్లో మాత్రమే పోటీకి అవకాశం ఉండగా, ఇప్పుడు మరో 11 వార్డులకు అనుమతిస్తున్నారు. అంటే మొత్తం 14 వార్డులకే పోటీ.. మిగిలిన 18 వార్డుల్లో పోటీ ఉండదు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడమా, చంద్రబాబు ఆదేశాలను పాటించడమా?”

  23 పట్టణ స్థానిక సంస్థల్లో పోటీకి అడ్డంకులు

“పుంగనూరు, రాయచోటి, పిడుగురాళ్ల, ఎర్రగుంట్ల, కమలాపురం, గురజాల, దాచేపల్లి, దర్శి, గుత్తి, మైదుకూరు, రాజంపేట, జమ్మలమడుగు, తిరుపతి, పులివెందుల, కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, తాడిపత్రి, కనిగిరి తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దశలో అడ్డంకులు ఎదురయ్యాయి. చిత్తూరు, నగరి, చిలకలూరిపేట, నెల్లూరు వంటి చోట్ల స్క్రూటినీ పేరుతో అభ్యర్థిత్వాలు తొలగించబడ్డాయి. మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థల్లో కొన్ని చోట్ల పోటీ లేకుండా, మరికొన్ని చోట్ల నామమాత్రపు పోటీ మాత్రమే ఉండే పరిస్థితి ఏర్పడింది. 15 చోట్ల మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థులు లేకుండా పోటీ జరుగుతున్న పరిస్థితి ఏర్పడిందని అధికారిక గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. పార్టీ అభ్యర్థుల జాబితా ఇచ్చినప్పుడు వారందరికీ నామినేషన్లు వేసే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై లేదా?”

 నామినేషన్ల నుంచి ఉపసంహరణల వరకు ఎనిమిది రకాల అడ్డంకులు

“నామినేషన్ల ప్రక్రియలో ఎనిమిది రకాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారు. మొదటగా అభ్యర్థులను పోలీస్‌ స్టేషన్లకు పిలిపించి బెదిరించడం, బైండోవర్‌ చేయడం, ముందస్తు అరెస్టులు చేయడం. రెండోది, అభ్యర్థులకు సహకరించే నాయకులను గృహనిర్బంధం చేయడం. మూడోది, నామినేషన్‌ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకుని ప్రతిపక్ష అభ్యర్థులను లోపలికి వెళ్లనివ్వకపోవడం. నాలుగోది, ఎన్నికల అధికారులు చూస్తుండగానే నామినేషన్‌ పత్రాలను లాక్కొని చింపేయడం. ఐదోది, దాడులను అడ్డుకోకుండా బాధితులైన అభ్యర్థులనే కేంద్రాల నుంచి బయటకు పంపించడం. ఆరోది, దాడులకు గురైన వారిపైనే కేసులు పెట్టి ఇంటికే పరిమితం చేయడం లేదా జైలుకు పంపించడం. ఏడోది, స్క్రూటినీ పేరుతో నామినేషన్లు తిరస్కరించడం, సంతకాలు ఫోర్జరీ చేసి ఉపసంహరించుకున్నట్లు చూపించడం. ఎనిమిదోది, బెదిరింపులతో అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడం. ఈ అష్టకుట్రలతో ఎన్నికల ప్రక్రియను ఎలా సాగనివ్వాలి?”

 ఫోర్జరీ సంతకాలతో అభ్యర్థుల తొలగింపు

“నంద్యాల మున్సిపాలిటీలోని 51వ వార్డులో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి నాగమణి నామినేషన్‌ను స్క్రూటినీ తర్వాత ఆమోదించారు. కానీ ఆ తర్వాత ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉపసంహరించుకున్నట్లు చూపించి, టీడీపీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ప్రకటించారు. నగరిలో వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి బాలకృష్ణ నామినేషన్‌ను స్వీకరించి అంగీకార పత్రం ఇచ్చిన తర్వాత కూడా తుది జాబితాలో ఆయన పేరును తొలగించారు. నామినేషన్‌ను స్వీకరించినట్లు పత్రం ఇచ్చిన తర్వాత అభ్యర్థిని ఎలా తొలగిస్తారు? ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు చోటు ఉండకూడదు.”

 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి

“659 మండలాల్లో 101 మండలాల్లో ఎంపీటీసీలకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. మరో 70 మండలాల్లో ఐదుకంటే తక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. అంటే 171 మండలాల్లో తీవ్ర పరిస్థితి నెలకొంది. జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ 659 మండలాలకు సంబంధించి 227 చోట్ల నామినేషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు మా వద్ద ఉన్న వివరాలు చెబుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో కనిపించిన పరిస్థితులే ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కొనసాగుతున్నాయి. నామినేషన్‌ కేంద్రాల వద్ద అభ్యర్థులను అడ్డుకుంటున్న అధికారులను బాధ్యతల నుంచి తప్పించకుండా నిష్పక్షపాత ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?”

  ఒక్కరోజులో నామినేషన్లు 547 శాతం పెరిగాయా?

“ఎన్నికల కమిషన్‌ గణాంకాలను పరిశీలిస్తే ఎంపీటీసీ నామినేషన్లు ఒక్కరోజులో 547 శాతం, జెడ్పీటీసీ నామినేషన్లు 468 శాతానికి పైగా పెరిగినట్లు చూపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మా అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న పరిస్థితుల్లో ఈ సంఖ్యలు ఎలా పెరిగాయి? కొండాపురం, మైలవరం, వేముల మండలాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల పేరుతో నకిలీ నామినేషన్లు దాఖలైనట్లు మా వద్ద ఆధారాలు ఉన్నాయి. వాటిలో ఏ, బీ ఫారాలు లేవు. అసలైన అభ్యర్థులను అడ్డుకుంటూ, మరోవైపు నకిలీ నామినేషన్లతో వైయ‌స్ఆర్‌సీపీ పోటీ చేస్తున్నట్లు చూపించడం ద్వారా కోర్టులకు తప్పుడు చిత్రం చూపించే ప్రయత్నం జరుగుతోందని మేము భావిస్తున్నాం. ఈ గణాంకాలపై ఎన్నికల కమిషన్‌ సమాధానం చెప్పాలి.”

 మహిళా అభ్యర్థులపై దాడులు.. ఇదేనా పాలన?

“మా ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం. గ్రామస్థాయి వార్డు సభ్యుల నుంచి కార్పొరేటర్ల వరకు సుమారు 80 వేల మంది మహిళలు ఎన్నికయ్యే అవకాశం కల్పించాం. కానీ నేడు నామినేషన్లు వేయడానికి వస్తున్న మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం, కొట్టడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ధర్మవరంలో మహిళా అభ్యర్థిపై దాడి చేశారు. దాచేపల్లికి చెందిన పద్మావతి చీర లాగేందుకు ప్రయత్నించారు. పుంగనూరులో ఎస్సీ మహిళ కమలమ్మ నామినేషన్‌ పత్రాలను లాక్కున్నారు. కనిగిరిలో సమీరా నామినేషన్‌ వేయించమని పోలీసుల కాళ్లపై పడి వేడుకున్నా అవకాశం కల్పించలేదు. జమ్మలమడుగు మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి ఇందిరమ్మను తుపాకీ చూపించి బెదిరించిన ఘటన కూడా జరిగింది. మహిళలకు రక్షణ కల్పించలేని వ్యవస్థతో స్వేచ్ఛాయుత ఎన్నికలు ఎలా సాధ్యమవుతాయి?”

 ఎన్నికల అధికారుల ముందే దాడులు

“గోరంట్లలో ఎన్నికల అధికారి గదిలోనే ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను లాక్కొని చింపేశారు. చిత్తూరు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జీడీ నెల్లూరు అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను చింపేశారు. చిలకలూరిపేటలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి బెల్లంకొండ నరేంద్ర చౌదరిపై దాడి జరిగింది. తాడిమర్రిలో తొమ్మిది నెలల గర్భిణితో పాటు మహిళలపై దాడులు జరిగాయి. కనిగిరిలో అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను లాక్కొని చింపేశారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు పోలీసులు అడ్డుకోవాలి. రిటర్నింగ్‌ అధికారులు ఫిర్యాదులు చేయాలి. కానీ బాధితులకే రక్షణ లేకుండా పోతే ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది?”

 సీసీ కెమెరాలు, కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలి

“నామినేషన్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కేంద్ర బలగాలను మోహరించాలి. పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాల ప్రత్యక్ష ప్రసారాలను అందుబాటులో ఉంచాలి. అభ్యర్థులకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించినా అమలు చేయకపోవడం ఏమిటి? ఎన్ని అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించారు? ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? దాడులకు పాల్పడిన వారిలో ఎంతమందిని అరెస్టు చేశారు? ఈ ప్రశ్నలకు ఎన్నికల కమిషన్‌ సమాధానం చెప్పాలి. ఎన్నికలు సజావుగా జరగాలంటే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు భద్రతా ఏర్పాట్లు తక్షణమే చేయాలి.”

 ఎన్నికల కమిషన్‌ బాధ్యత అభ్యర్థులకు అవకాశం కల్పించడం

“ఇవి పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల జాబితాను, ఏ, బీ ఫారాలను సమర్పించిన తర్వాత మా అభ్యర్థులందరికీ నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలి. అవసరమైతే ఒకే కేంద్రంలో నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయాలి. ఎన్నికల కమిషన్‌ తటస్థంగా వ్యవహరించి, ప్రతి అభ్యర్థికి సమాన అవకాశం కల్పించాలి. ప్రజలకు మంచి చేశామని నమ్మకం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల తీర్పును కోరాలి. నామినేషన్లను అడ్డుకుని, ప్రజల తీర్పును ఏకపక్షంగా మార్చాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యం కాదు.”

  ప్రజల ఆస్తులు, హక్కులను కాపాడుకోవాలి

“ఈరోజు నామినేషన్‌ పత్రాలను లాక్కొని చింపేస్తున్నారు. రేపు ప్రజలు తమ ఆస్తి పత్రాలతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే, వాటినీ లాక్కొని చింపేసే పరిస్థితి రావచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే ఎవరి ఆస్తులకూ, ప్రాణాలకూ, హక్కులకూ భద్రత ఉండదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, ఆ ప్రభుత్వం ప్రజల హక్కులను కాపాడటం. నియంతృత్వంలో ప్రజలకు స్వేచ్ఛ ఉండదు. అందుకే రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడాలి.”

 ఆధారాలతో న్యాయపోరాటం కొనసాగిస్తాం

“స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన ప్రతి ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, వివరాలతో ఒక పుస్తకాన్ని విడుదల చేస్తున్నాం. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఈ ఆధారాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. న్యాయస్థానాలకూ సమర్పిస్తాం. బాధిత అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై పార్టీ లీగల్‌ సెల్‌ సహకారంతో పిటిషన్లు దాఖలు చేయాలి. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదులు చేయాలి. ప్రతి ఘటనను పార్టీ డిజిటల్‌ రికార్డులో నమోదు చేయాలి. హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ ఆధారాలతో న్యాయపోరాటం కొనసాగిస్తాం. అభ్యర్థులకు, కార్యకర్తలకు, నాయకులకు పార్టీ లీగల్‌ సెల్‌ అండగా ఉంటుంది.”

 చంద్రబాబు పాలనకు ప్రజలే సమాధానం చెబుతారు

“మా ప్రభుత్వ హయాంలో కోవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు మంచి చేసి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసి ఎన్నికలకు వెళ్లాం. విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామ సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్థ, మహిళా సాధికారతలో మార్పులు తీసుకొచ్చి ప్రజల ముందుకు వెళ్లాం. ఆ ప్రోగ్రెస్‌ రిపోర్టు ఆధారంగా 86 శాతం స్థానాల్లో విజయం సాధించాం. ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ లేదు, సూపర్‌ సెవెన్‌ లేదు. ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, మహిళలు సంతోషంగా లేరు. ప్రజలకు చేసిన మంచిని చూపించి ఓట్లు అడగాల్సిన ప్రభుత్వం ఎన్నికల్లో పోటీనే లేకుండా చేయాలనుకోవడం ఏమిటి? ఈరోజు అన్యాయానికి గురైన ప్రజలు, కార్యకర్తలు తమ హక్కుల కోసం మరింత పట్టుదలతో పోరాడతారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.”

 ప్ర‌జాస్వామ్యాన్ని కాడుకోవాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి అభ్యర్థికి నామినేషన్‌ వేసే స్వేచ్ఛ, పోటీ చేసే హక్కు, ప్రతి ఓటరుకు నిర్భయంగా ఓటు వేసే అవకాశం కల్పించాలని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని, బాధ్యులైన అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో జరిగిన ప్రతి ఘటనకు సంబంధించిన ఆధారాలను ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. “పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజల తీర్పును గౌరవించాలి. ప్రతి అభ్యర్థికి పోటీ చేసే హక్కును పరిరక్షించాలి” అని పిలుపునిచ్చారు.

Back to Top