కోటలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లకు పోలీసుల అడ్డంకులు

తిరుపతి జిల్లా: గూడూరు నియోజకవర్గంలోని కోట మండలంలో వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన 16 మంది ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియకు పోలీసులు అడ్డంకులు సృష్టించారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. తనకు సైతం పోలీసులు నోటీసులు జారీ చేసి నామినేషన్ ప్రక్రియను అడ్డుకున్నారని పేర్కొన్నారు.

అధికార పార్టీ టీడీపీతో కలిసి పోలీసులు వ్యవహరిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి అభ్యర్థికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించాలని, ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సాగుతూ అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు దక్కేలా చూడాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కోరారు.

Back to Top