తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్ పాఠంశెట్టి సూర్యచంద్ర, శ్రీదేవి దంపతులు వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తోట నరసింహం ఆధ్వర్యంలో సూర్యచంద్ర దంపతులకు వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సూర్యచంద్ర అనుచరులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కిర్లంపూడి మండలం జెడ్పీటీసీ స్థానానికి పాఠంశెట్టి సూర్యచంద్ర సతీమణి శ్రీదేవిని వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రజల్లో మంచి పరిచయాలు, ఆదరణ ఉన్న నాయకులకు పార్టీలో సముచిత గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా ఆమోదం తెలిపారని వివరించారు. గ్రామస్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగిన సూర్యచంద్ర గతంలో సర్పంచ్‌గా పనిచేస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేశారన్నారు. వైఎస్ జగన్ గారు తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై, ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సూర్యచంద్ర వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని తోట నరసింహం వెల్లడించారు. ఎన్నికల హామీలు కనీసం పది శాతం కూడా అమలు చేయలేదు - పాఠంశెట్టి సూర్యచంద్ర వైఎస్సార్‌సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ గ్రామస్థాయి నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాను. మూడు సార్లు సర్పంచ్‌గా పనిచేసి, మా గ్రామాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిపాను. 2019లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన తర్వాత కూడా ఐదేళ్లపాటు రాత్రింబవళ్లు ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం పోరాడాను. 2024 ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 12,531 ఓట్లు సాధించాను. ఎన్నికల తర్వాత కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీస్తున్నాను. వైఎస్ జగన్ నాయకత్వంపై నమ్మకంతో, తోట నరసింహం గారి ఆధ్వర్యంలో నా భార్య శ్రీదేవి, మా అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరడం గర్వంగా భావిస్తున్నాను. వైఎస్సార్‌సీపీ కార్యకర్తగా జగ్గంపేట నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, ప్రజలకు మేలు జరిగేలా పనిచేస్తాను. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైంది. కనీసం పది శాతం హామీలైనా నెరవేర్చకుండా ప్రజలను మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్న కూటమి నాయకులను ప్రజలు నిలదీయాలి. పెన్షన్లు, ఇళ్లు, స్థలాలు, ఇతర సంక్షేమ పథకాల పేరుతో ఇంటింటికీ వెళ్లి హామీలు ఇస్తున్న నాయకులను గత రెండున్నరేళ్లలో ఏం చేశారని ప్రశ్నించాలి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మేయర్, వార్డు సభ్యుల స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వైఎస్ జగన్ గారు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు, రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే వరకు నా శక్తివంచన లేకుండా పనిచేస్తాను. నామినేషన్ల ప్రక్రియలో దౌర్జన్యాలు సిగ్గుచేటు - తోట నరసింహం, మాజీ ఎంపీ పాఠంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. గ్రామస్థాయి నుంచి ఎదిగి సర్పంచ్‌గా సేవలందించడంతో పాటు, 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రజలతో మమేకమయ్యారు. వైఎస్ జగన్ గారి గత పాలనలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై, ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సూర్యచంద్ర గారు వైఎస్సార్‌సీపీ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య శ్రీదేవి, అనుచరులు పార్టీలో చేరడం జగ్గంపేటలో వైఎస్సార్‌సీపీ కి మరింత బలాన్ని చేకూరుస్తుంది. కిర్లంపూడి మండల జెడ్పీటీసీ స్థానం అన్‌రిజర్వ్ కావడంతో, ఆ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున శ్రీదేవి గారిని పోటీ చేయించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులు, దౌర్జన్యాలు చోటు చేసుకుంటున్నాయి. మహిళా అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ అభ్యర్థులు భయపడకుండా స్వేచ్ఛగా నామినేషన్లు వేసే పరిస్థితులు కల్పించాలి. ఎన్నికల సంఘం, పోలీసు వ్యవస్థ భద్రతాపరమైన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడాలి. పాఠంశెట్టి సూర్యచంద్ర, శ్రీదేవి దంపతులు వారి అనుచరులతో కలిసి మేమంతా ఐక్యంగా పనిచేస్తూ జగ్గంపేటలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తాం.