ఎస్ఈసీ గారూ..ఇకనైనా మేల్కోండి

సుప్రీంకోర్టు ఆదేశాలకూ విలువ లేదా?

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ఆగ్ర‌హం

వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లకు కూటమి నేతల అడ్డంకులు, దాడులు, దౌర్జన్యాలు!

నామినేషన్లు వేస్తే గంజాయి కేసులు, రౌడీషీట్లంటూ పోలీసుల బెదిరింపులు!

ఎన్నికల అక్రమాలపై చర్యలేవి? ఎస్ఈసీ తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ నేతల ధ్వ‌జం

ఎన్నిక‌ల క‌మిష‌న్ కార్యాల‌యం ఎదుట ఆందోళ‌న‌

ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆందోళనకు దిగారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఫిర్యాదు స్వీకరించడంలో జాప్యాన్ని నిరసిస్తూ కార్యాలయంలో బైఠాయించారు. చివరకు ఎస్ఈసీ అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జ‌గ్గ‌య్య‌పేట ఇన్‌చార్జ్ త‌న్నీరు నాగేశ్వ‌ర‌రావు మీడియాతో మాట్లాడారు.

విజ‌య‌వాడ‌: సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం కూడా రాష్ట్రంలో ఎన్నికల అక్రమాలు ఆగడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో కూటమి నేతలు అడ్డంకులు సృష్టిస్తూ, దాడులకు పాల్పడటమే కాకుండా నామినేషన్ పత్రాలను చించివేస్తున్నారని, వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థులు నామినేషన్లు వేస్తే గంజాయి కేసులు పెడతామని, రౌడీషీట్లు తెరుస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఎస్ఈసీ తక్షణమే స్పందించి స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా అపాయింట్‌మెంట్ ఇవ్వడంలో జాప్యం చేయడంతో కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులు, దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చివరకు ఎస్ఈసీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు మీడియాతో ఏమ‌న్నారంటే..

- సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతా మార్పు లేదు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి:  లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ

“సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన తర్వాతైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించి, వ్యవస్థలను కాపాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందని ఆశించాం. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారలేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పలు ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై దాడులు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. నామినేషన్లు వేస్తే గంజాయి కేసులు పెడతాం, రౌడీషీట్లు తెరుస్తామంటూ పోలీసులు బెదిరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లను హౌస్ అరెస్టులు చేస్తూ అభ్యర్థులను భయపెడుతున్నారు. నామినేషన్ కేంద్రాల్లో అధికారులకు సమర్పించిన పత్రాలను సైతం లాక్కుని చించివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు ఎలా వేయగలరు?.

- నిష్పక్షపాత ఎన్నికల కోసం పోరాటం ఆగదు

ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రాలు ఇచ్చి, వాటిని అధికారులకు పంపితే సరిపోదు. క్షేత్రస్థాయిలో వాటి అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. అధికారుల ఏకపక్ష నివేదికలను నమ్మకుండా వాస్తవాలను పరిశీలించాలి. టీడీపీ అభ్యర్థులు అన్ని చోట్లా నామినేషన్లు వేస్తుంటే, వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులే ఎందుకు అడ్డంకులు, దాడులు, అరెస్టులను ఎదుర్కొంటున్నారు? ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే నిర్ణయాలు తీసుకుంటే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. అవసరమైతే ఎన్నికల కమిషన్ తీరుపైనా పోరాటం చేస్తాం. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుంది” అని లేళ్ల అప్పిరెడ్డి తేల్చి చెప్పారు.

- మహిళా అభ్యర్థులపై దాడులు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకూ గౌరవం లేదా?:  క‌ల్ప‌ల‌తారెడ్డి, ఎమ్మెల్సీ

“గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్తుంటే అడ్డుకోవడం, దాడులు చేయడం, అరెస్టులు, హౌస్ అరెస్టులు కొన‌సాగుతున్నాయి.  మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలే ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లలోనూ పునరావృతమవుతున్నాయి. ఎన్నికల కమిషన్‌కు పదేపదే ఫిర్యాదులు చేస్తున్నా, చర్యలు తీసుకుంటామని చెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో అమలు కనిపించడం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం గౌరవించడం లేదు. ముఖ్యంగా కుప్పంలో మహిళా అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్తుంటే వారిపై దాడులు చేయడం, చీరలు లాగి అవమానించడం అత్యంత దారుణం. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల గౌరవాన్ని కూడా పట్టించుకోకుండా ఇంతలా దిగజారుతారా? ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి మహిళా అభ్యర్థులకు రక్షణ కల్పించాలి, స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకునే అవకాశం కల్పించాలి. మాకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తాం.” అని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి స్పష్టం చేశారు.

- అక్రమ ఏకగ్రీవాలకు అడ్డుకట్ట వేయాలి: మ‌ల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే

“రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి స్వేచ్ఛాయుత వాతావరణం కనిపించడం లేదు. బెదిరింపులు, ప్రలోభాలు, కిడ్నాప్‌లు, దాడులతో ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికలు జరగాలని, ప్రజలు తమ ఓటు ద్వారా ఎవరిని ఎన్నుకోవాలో వారే నిర్ణయించాలని కోరుతోంది. సుప్రీంకోర్టు కూడా అభ్యర్థులకు రక్షణ కల్పించి, భద్రత కల్పిస్తూ, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఆదేశించింది. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు ప్రభుత్వ ఒత్తిడికి లోనవుతున్నారని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మేము ఫిర్యాదు చేశాం. పక్షపాత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఓటరు జాబితాల్లో లోపాలు, ప్రజలకు దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలు, అక్రమ ఏకగ్రీవాల ప్రయత్నాలపై ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించాలి. ఎక్కడైనా తప్పుడు నివేదికలు సమర్పించినా, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను భయపెట్టినా, అక్రమ ఏకగ్రీవాలకు ప్రయత్నించినా సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుంది” అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు.

- జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికలను రద్దు చేయాలి: త‌న్నీరు నాగేశ్వ‌ర‌రావు,  జ‌గ్గ‌య్య‌పేట వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌

“జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో నామినేష‌న్ల ఉపసంహరణల ప్రక్రియ పూర్తయినా తుది జాబితాను ప్రకటించకుండా అధికారులు జాప్యం చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రకటించాల్సిన వివరాలను రాత్రి ఏడున్నర గంటలకు ప్రకటించడంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏడు గంటలపాటు నిరసన తెలిపాం. ఏ వార్డులో ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారో తెలియజేయాలని అడిగినా అధికారులు వివరాలు వెల్లడించలేదు. రెండో వార్డుకు చెందిన టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఉపసంహరణ పత్రాన్ని ఎస్‌ఐ స్వయంగా తీసుకెళ్లి మున్సిపల్ కార్యాలయంలో అందించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. మున్సిపల్ సిబ్బంది, కమిషనర్, పోలీసు సిబ్బంది టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ పరిణామాలు అప్రజాస్వామికం. కాబట్టి జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికలను రద్దు చేసి, మళ్లీ నామినేషన్ల ప్రక్రియ నుంచే ప్రారంభించాలి” అని వైయ‌స్ఆర్‌సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.  

ఎస్ఈసీని క‌లిసిన వారిలో ఎమ్మెల్సీ రుహుల్లా, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు  టీజేఆర్ సుధాక‌ర్‌బాబు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ యోహ‌న్‌రాజు, అధికార ప్ర‌తినిధులు నాగార్జున యాద‌వ్‌, ష‌రీఫ్‌, ఎంప్లాయిస్ అండ్ పెన్ష‌న‌ర్స్ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు న‌లమారు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, గ్రివెన్స్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు అంకంరెడ్డి నారాయ‌ణ‌మూర్తి,  పార్టీ అనుబంధ విభాగాల నాయ‌కులు ఉమాదేవి, న‌రేంద్ర‌సింగ్‌, త‌దిరులు ఉన్నారు.

Back to Top