తాడేపల్లి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీని ఎదుర్కోలేక కూటమి నేతలు దాడులు, బెదిరింపులు, అక్రమ నిర్బంధాలనే ఆయుధాలుగా ప్రయోగిస్తున్నారు. నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను చించివేయడం, వైయస్ఆర్‌సీపీ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం ద్వారా ప్రజలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కును కాలరాస్తున్నారు. అధికార పార్టీ నేతల అరాచకాలకు పోలీసులు అండగా నిలుస్తూ, రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారనే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలనూ ఖాతరు చేయకుండా సాగుతున్న ఈ దౌర్జన్యాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర పోషించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానం. ప్రజాబలంతో గెలవాలనే ధైర్యం లేక వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ల దశలోనే అడ్డుకోవడమే కూటమి బలహీనతకు నిదర్శనం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాస్వామ్య హక్కుల కోసం వైయస్ఆర్‌సీపీ పోరాటం ఆగదు! రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలు ఇలా: వైయస్సార్ జిల్లా: పులివెందుల: ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆయన ఇంటి చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మోహరించారు. అనంతరం అవినాష్‌రెడ్డిని కడపలో అదుపులోకి తీసుకుని పులివెందుల పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. లింగాల మండలంలోని తొమ్మిది జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వాలని వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు పోలీసులను కోరినా పట్టించుకోలేదు. కడప: కడప నగరంలోని వైయస్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయం వద్ద పోలీసుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డితో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని బద్వేల్‌కు తరలించారు. జమ్మలమడుగు: పెద్దముడియం మండలం, గుండ్లకుంట వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించాచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దుండగులు ఓ బైక్‌ను దహనం చేశారు. చాపాడు: వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు బాలయ్య, ఎర్రగుడి శ్రీనివాసులరెడ్డి, మహేష్‌రెడ్డిలను నామినేషన్‌కు వెళ్లకుండా అడ్డుకుని, వారి పత్రాలను లాక్కొని చించివేశారు. తొండూరు: నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ శ్రేణులు తిష్టవేసి అభ్యర్థులను అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో వైయస్ఆర్‌సీపీ నాయకులను పోలీసుల అరెస్టు చేశారు. బద్వేలు: పోరుమామిళ్ల మండలం టేకురుపేట మాజీ సర్పంచ్ కల్లూరి రమణారెడ్డిని ఇంటి నుంచి అరెస్ట్ చేసి పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిత్తాగిరి ప్రణీత్‌రెడ్డిని కూడా గృహ నిర్బంధం చేశారు. బద్వేలు నియోజకవర్గానికి చెందిన పలువురు వైయస్ఆర్‌సీపీ నాయకులను అట్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు: తాడిపత్రి నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. అభ్యర్థులతో నామినేషన్లు వేయించేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తిమ్మంపల్లిలోని ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రి శైలజానాథ్‌ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. రాప్తాడు: చెన్నేకొత్తపల్లిలో వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి వెంకటలక్ష్మి, ఆమె భర్త వెంకట్రామిరెడ్డిపై దాడి జరిగింది. ఓబుళంపల్లి నుంచి చెన్నేకొత్తపల్లికి వెళ్తుండగా పరిటాల వర్గీయులు అడ్డుకుని, నామినేషన్ వేస్తే చంపేస్తామని బెదిరించారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిని కూడా గృహ నిర్బంధం చేశారు. ధర్మవరం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని నామినేషన్లు వేయించేందుకు వెళ్తుండగా హౌస్ అరెస్ట్ చేశారు. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. తాడిమర్రి: స్థానిక నాయకుడు తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి ఇంట్లోకి పోలీసులు చొరబడి మహిళలు, కార్యకర్తలపై దాడి చేశారు. తొమ్మిది నెలల గర్భిణిపై కూడా దాడి జరిగింది. ఈ ఘటనపై వీడియో, ఆడియో ఆధారాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. పల్నాడు జిల్లా: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. క్రోసూరు మండలంలో జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్లిన దుగ్గి చినబాబుపై దాడి చేసి నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేశారు. అచ్చంపేట మండలంలోనూ అభ్యర్థులను అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో నామినేషన్ కేంద్రాల వద్ద అడ్డంకులు ఎదురవుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. నరసరావుపేట: పెట్లూరివారిపాలెం మాజీ ఎంపీపీ మోరబోయిన శ్రీనివాసరావు ఇంటిపై అర్ధరాత్రి పోలీసులు దాడికి ప్రయత్నించారు. ఆయన ఇంట్లో లేని సమయంలో కుమారుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. స్థానికులు అభ్యంతరం తెలపడంతో పోలీసులు వెనుదిరిగారు. వినుకొండ: నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి గృహ నిర్బంధం, స్థానికంగా అభ్యర్థులను అడ్డుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. అన్నమయ్య జిల్లా: పీలేరులో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు రహదారులపైనే అడ్డుకున్నారు. నాయకులపై అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారు. సీఐ వెంకటేశ్వర్లు వ్యవహారశైలికి నిరసనగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కలకడ – కదిరాయచెరువు: చిరంజీవి, శంకరమ్మ, రాధిక అనే వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసి నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేశారు. రాయచోటి నియోజకవర్గం: లక్కిరెడ్డిపల్లెలో నామినేషన్లు వేయడానికి వస్తున్న వైయస్ఆర్‌సీపీ నాయకులు ఢిల్లీ విశ్వనాథరెడ్డి, లక్ష్మీరెడ్డి, మహేంద్రబాబులపై దాడి జరిగింది. వారి కారును ధ్వంసం చేసి కర్రలతో కొట్టడంతో మహేంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరు: వైయస్ఆర్‌సీపీ – చౌడేపల్లి మండల అధ్యక్షుడు నాగభూషణరెడ్డి ఇంటిపై దాడి చేసి ఇల్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. యనమసామనపల్లిలో వైయస్ఆర్‌సీపీ నాయకుడు శ్రీనివాసులరెడ్డిపై దాడి జరిగింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలు: జీడీ నెల్లూరులో వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకులు చించివేసి, అభ్యర్థులను అడ్డుకున్నారు. తమిళనాడు నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దాడులు చేయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎస్.ఆర్.పురం మండల నామినేషన్ కేంద్రం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. రామకుప్పం: సీఎం చంద్రబాబు నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలంలో వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ నామినేషన్లను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. బయటి ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పార్టీ నాయకులు ఆరోపించారు. కుప్పంఎంపీడీవో కార్యాలయం ప్రధాన గేటు వద్ద పోలీసుల వాహనం ఆపడంతో ఆర్‌డీఓ, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఐడీ కార్డు చూపించాలన్న పోలీసుల అభ్యర్థనతో మొదలైన వివాదం సుమారు అరగంట కొనసాగింది. చంద్రగిరి నియోజకవర్గం: వైయస్ఆర్‌సీపీ పాకాల ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకుడు చెన్నకేశవరెడ్డి బహిరంగంగా చించివేశారు. అభ్యర్థిపై దాడి చేసి, మరోసారి నామినేషన్ వేయడానికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. చంద్రగిరి: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి తదితరులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభ్యర్థులతో నామినేషన్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. తిరుపతి: ఎంపీ గురుమూర్తిని బ్యాంక్ ఎంప్లాయీస్ కాలనీలోని ఆయన నివాసం వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. శ్రీకాళహస్తి: వైయస్ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు, ఎంపీపీ అభ్యర్థి చెవిరెడ్డి మధుసూదన్‌రెడ్డిపై దాడి చేసి నామినేషన్ పత్రాలను చించివేశారు. పుత్తూరు : కార్వేటినగరం మండలంలో అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా గతంలో అడ్డుకున్న నేపథ్యంలో, వారితో నామినేషన్లు వేయించేందుకు వెళ్లకుండా పుత్తూరులో ముందస్తు గృహ నిర్బంధాలు చేశారు. ప్రకాశం జిల్లా: కొండేపిలో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ కేంద్రానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మోహరించారు. కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు గుంపులుగా ఉన్నా..వారి వైపు కన్నెత్తి చూడని వైనం. పొదిలి: వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను రిటర్నింగ్ అధికారి గదిలోనే అడ్డుకుని నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేశారు. నామినేషన్ వేయడానికి ప్రయత్నించిన మహిళ చేతిపై బ్లేడ్‌తో గాయాలు చేశారు. కొనకనమిట్ల: నామినేషన్ కేంద్రం వద్ద వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను అడ్డుకుని, పత్రాలు చించివేయడంతో పార్టీ నాయకులు రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఈ ఘటనలపై జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గిద్దలూరు: ఎంపీడీవో కార్యాలయం వద్ద నామినేషన్లను అడ్డుకుని, నామినేషన్ కేంద్రంలోకి వెళ్లి పత్రాలను చించివేశారు. కేంద్రం చుట్టూ గుంపులు చేరినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. మార్కాపురం: పొదిలి, కొనకనమిట్ల ఘటనలపై జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ పంకజ్‌కుమార్ మీనాకు అన్నా రాంబాబు ఫిర్యాదు చేశారు. దర్శి: గత నామినేషన్ ఘటనకు సంబంధించి అరెస్టై జైలులో ఉన్న వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పరామర్శించారు. యర్రగొండపాలెం: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను ఆయన కార్యాలయంలోనే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఏలూరు జిల్లా: దెందులూరు, పెదవేగి, పెదపాడు: వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తుండగా అడ్డుకున్నారని, కొన్ని చోట్ల పత్రాలను బలవంతంగా తీసుకుని ధ్వంసం చేశారని ఫిర్యాదులు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని కలిసి అభ్యర్థులకు భద్రత కల్పించాలని, ఘటనలపై విచారణ జరపాలని కోరారు. కాకినాడ జిల్లా: తునిలో వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తొండంగి ఎంపీడీవో కార్యాలయంలో అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, కార్యకర్తలపై రాళ్లు విసరడంతో పలువురికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా: ఆదోని: ఎంపీటీసీ నామినేషన్లు వేయడానికి వచ్చిన వైయస్ఆర్‌సీపీ అభ్యర్థుల పత్రాలను టీడీపీ నాయకుడు గోనెహాళ్ గోపాల్‌రెడ్డి, ఇతర నాయకులు చించివేశారు. నెల్లూరు జిల్లా: వైయస్ఆర్‌సీపీ నాయకుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సూళ్లూరుపేట: మాజీ మున్సిపల్ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు దబ్బల శ్రీమంత్‌రెడ్డిని నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దర్గామిట్టలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసి, నామినేషన్ల ప్రక్రియ సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని అడ్డుకున్నారు. వైయస్సార్ జిల్లా: నందలూరు ఎంపీపీ సీటు విషయంలో టీడీపీకి చెందిన మేడా విజయశేఖర్‌రెడ్డి, పార్టీ ఇన్‌చార్జి జగన్మోహన్‌రాజు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఎస్ఈసీకి ఫిర్యాదు రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులపై జరిగిన దాడులు, దౌర్జన్యాలపై వైయస్ఆర్‌సీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. నామినేషన్లకు భద్రత కల్పించాలని, అడ్డంకులు తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.