తాడేపల్లి: రాష్ట్రంలో స్దానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియపై సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా ఎస్ఈసీకి కానీ, ప్రభుత్వం కానీ లెక్కలేనట్లుగా వ్యవహరిస్తున్నాయని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కొనసాగుతున్న ఘటనలే ఇందుకు నిదర్శమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. సుప్రీంకోర్టు దాడులు జరిగిన 19 చోట్ల ఎన్నికలు ఆపాలని చెప్తే, ఏకంగా 100 చోట్ల ఎన్నికలు ఆపాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు ఆపిన అధికారంతోనే ఎస్ఈసీ.. దాడులపై చర్యలు కూడా తీసుకోవాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. మరోవైపు షర్మిల కుమార్తె పెళ్లికి జగన్మోహన్ రెడ్డి భద్రతా కారణాలతోనే ఇల్లు ఇచ్చేందుకు నిరాకరించారని పేర్ని నాని స్పష్టం చేశారు. ప్రెస్ మీట్లో పేర్ని నాని ఇంకేమన్నారంటే.. ఘోరాతి ఘోరంగా స్థానిక ఎన్నికలు చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఘోరాతిఘోరంగా విఫలమైన పరిస్ధితులు కళ్ళముందు కనిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణలో ఒక్కటే కాదు, ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇచ్చిన హామీల అమల్లో విఫలమైంది. సంపద సృష్టిస్తామని బీరాలు పలికి చతికిలపడిన ఈ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. భావిపౌరుల్ని తీర్చిదిద్దాల్సిన పాఠశాల ప్రాంగణాల్లోకి డీఎస్సీ అక్రమాల ద్వారా దొంగ గురువుల్ని చొప్పించేందుకు ప్రయత్నించిన చరిత్ర వీళ్లది. తిరుపతి బ్రహ్మోత్సవాలు జరపడంలోనూ విఫలమై 9 మంది భక్తుల ప్రాణాలు తీసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఇది. సింహాచలం అప్పన్న చందనోత్సవం చేయడం చేతకాక ఏడుగురు భక్తుల ప్రాణాలు బలి తీసుకున్న ప్రభుత్వం ఇది. ముక్కోటి ఏకాదశి రోజున బాధ్యత లేక, సిగ్గుమాలిన తనంతో ఐదుగురు ప్రాణాలు తీసింది. అదీ ఇదీ అని కాదు. చెప్పలేనన్న వైఫల్యాల పుట్ట చంద్రబాబు ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోతున్న స్థానిక ఎన్నికలని బీరాలు పలికారు. కూటమి ప్రభుత్వం గొప్పగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని చెప్పుకుంది. ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికలు అలా జరుపుతుందని భావించారు. కానీ నామినేషన్లు ముగిశాక వీళ్ల చర్యలు చూస్తుంటే కూటమి అధ్వర్యం అంటే నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం, హరీష్ కుమార్ ఆధ్వర్యంలోని పోలీసు శాఖ, పునేఠా ఆధ్వర్యంలోని ఎన్నికల కమిషన్, ఎల్లో మీడియా అంతా కూటమిగా ఏర్పాటై చేస్తున్న తంతులా కనిపిస్తోంది. చర్యలు తీసుకోవడంలో ఎస్ఈసీ విఫలం నామినేషన్ల ప్రక్రియ చూస్తుంటే ఎందుకు ఈ ఎన్నికలు జరపడం అని ప్రశ్నిస్తున్నాం. బహుమేథావి అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన మేధస్సు అంతా రంగరించి మాట్లాడుతున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు పెట్టడం ఖర్చుతో కూడుకున్న పని అంటారు. అసలు ఎన్నికలు అంటేనే ఖర్చుతో కూడుకున్న పని కాదా. చంద్రబాబు, రామోజీరావు గారి అబ్బాయి, రాధాకృష్ణ, కొత్తగా వచ్చిన ఐ వెంకట్రావు గారి అబ్బాయి కలిసి కూర్చుని వీళ్లు పలానా జడ్పీ ఛైర్మన్, వీళ్లు పలానా మున్సిపల్ ఛైర్మన్ అని టిక్ కొట్టి ఇచ్చేస్తే పనయిపోతుంది కదా. ఖర్చేముంది. వీళ్లంతా తలో టిక్ పెడతారు. ఏమైనా మార్పులు చేర్పులుంటే చంద్రబాబు సరిదిద్దుతాడు. అంటే ఓ బాధ్యతాయుతమైన సీట్లో కూర్చొన్న వ్యక్తి ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పడం ఏంటి?, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సింది పోయి ఖర్చు ఎక్కువవుతుందని చెప్పడం ఏంటో అర్దం కాలేదు. ఎన్నికల సంఘం అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎస్ఈసీ చెప్తే ఓ పంచాయతీలో ఆర్వో కూడా లెక్కచేయడం లేదు, నామినేషన్లు తీసుకోవడం లేదు. అదే నిజమైతే ఎన్నికల కమిషన్ కు అధికారం లేదా, వానపాములా ఉండిపోతారా, కనీసం బుస కూడా కొట్టరా? సదరు ఆర్వోను, కలెక్టర్ ను విధుల నుంచి తప్పించరా, వారికి సన్మానాలు చేస్తారా అని అడుగుతున్నాం. పుంగనూరులో ఎన్నికలు చూస్తే నామినేషన్ కేంద్రం లోపలా, బయటా వందల మంది మోహరించారు, నామినేషన్లకు వెళ్తే కాళ్లో, చేతులో తీసేస్తారని అభ్యర్ధులు భయపడుతుంటే, స్థానిక ఎంపీ అయిన మిథున్ రెడ్డి గారు కారులో తీసుకుని గేటు దగ్గర దింపడానికి వెళ్తే ఆయనపై దాడులకు దిగుతున్నారు. కారులో నుంచి దిగడానికి కూడా అభ్యర్ధులకు అవకాశం ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో చంద్రబాబుకు ప్రభుత్వం నడిపే అర్హత ఉందా అని అడుగుతున్నాం. మీకు ఎలాంటి సిగ్గు లేదా?, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి కూడా జగన్ నువ్వు క్రిస్టియన్ అని మాట్లాడతారు. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా స్పందన శూన్యం బరితెగించిన చంద్రబాబు ప్రభుత్వం సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అంతకు మించి దారుణాలకు దిగుతోంది. నిన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా 76 ఘటనలు జరిగితే, ఇవాళ 65 ఘటనలు జరిగాయి. రేపు ఎన్ని వందల దారుణాలు చేస్తారో తెలియడం లేదు. దెందులూరులో ఏలూరు ఎస్పీకి, కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే ఫోన్ చేసి మా వాళ్లను నామినేషన్ కేంద్రంలోకి అనుమతించడం లేదని చెప్తే, మీరు రావద్దు, మేమే వెళ్తామంటూ అడ్డుకున్నారు. అక్కడికి అభ్యర్ధులు వెళ్తే దెందులూరు ఎమ్మెల్యే లోపల కూర్చొన్నాడు. నామినేషన్లు వేయడానికి వెళ్లిన వారి తలలు పగులగొడితే ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్లు బయటికి పరిగెత్తుకుని వచ్చారు. మీరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. ఈ దేశాన్ని, సమాజాన్ని కాపాడటానికి వచ్చారు మీరు. మిమ్మల్ని నమ్మి మేం ఇక్కడ బతకాలి. మిమ్మల్ని చూసి మీ తల్లితండ్రులు సిగ్గుపడాలి. ఇంత నీచంగా ఉద్యోగాలు చేస్తున్న మిమ్మల్ని చూసి మీ తల్లితండ్రులు సిగ్గుపడాలి. ఎందుకు ఇంత సిగ్గుమాలినతనంగా ఉద్యోగాలు చేయాలా అని అడుగుతున్నాం. సుప్రీంకోర్టు 24 గంటల్లో దాడుల ఘటనల్ని పరిశీలించి నామినేషన్లు పడని చోట, ఎన్నికలు ఆపి రెండు రోజుల గడువు ఇచ్చి నామినేషన్లు వేయించాలని చెప్పింది. శాంతియుతంగా ఎన్నికలు జరపాలని చెప్పి సుప్రీంకోర్టు గడ్డిపెట్టినా దారుణాలు ఆగడం లేదు. ఏ వ్యక్తికైనా తనకు విలువ లేకపోయినా, తాను కూర్చొన్న కుర్చీని బట్టి విలువ ఉంటుంది. కానీ ఇవాళ వాళ్లు కుర్చీకున్న విలువ కూడా దిగజారుస్తున్నారు. ఓ ఎంపీ మున్సిపల్ ఛైర్మన్ నామినేషన్ వేయడానికి వస్తే, ఎన్నికల కమిషనర్ ఫోన్ చేసినా ఆర్వో నామినేషన్ తీసుకోను అన్నాడంటే పరిస్ధితి ఏంటో అర్దమవుతోంది. పులివెందులలో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళల్ని లా ఆర్డర్ బాగోలేదని వెనక్కి పంపుతున్నాడంటే సిగ్గు లేదా అని అడుగుతున్నాం. ఎన్నికల కమిషన్ వెంటనే అలాంటి డీఐజీని సస్పెండ్ చేయాలి కదా. ఎందుకు అలా చేయలేదని అడుగుతున్నాం. ఏం చేస్తారు కేవలం జీతాలు తీసుకుంటూ, మేం కట్టిన పన్నులతో ఎంజాయ్ చేస్తారా? 19 చోట్ల ఎన్నికలు ఆపమంటే 100 చోట్ల ఎందుకు ఆపారు? సుప్రీంకోర్టు అంత మాట అన్నాక చంద్రబాబు, హోంమంత్రి రాజీనామా చేసి వెళ్లిపోవాలి. 19 చోట్ల నామినేషన్లు పడలేదు, అక్కడ ఎన్నికలు ఆపమంటే, 100 చోట్ల ఎందుకు ఆపేశారు, ఎందుకోసం ఇలా ఫిర్యాదులు లేని చోట ఆపారో చెప్పండి. గొడవలు జరిగినప్పుడు, తలకాయలు పగిలినప్పుడు, ఫైరింగ్ జరిగినప్పుడు మాత్రం అక్కడ ఎన్నికలు ఆపరు. ఎన్నికల కమిషన్ కు నిజాయితీ ఉంటే నామినేషన్లు పడని చోట, గొడవలు జరిగిన చోట జిల్లా కలెక్టర్ పరిశీలించి ఆన్ లైన్ లో వేసేందుకు అనుమతి ఇవ్వాలి. ఆఖరికి విజయవాడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో ఇచ్చినా నామినేషన్ చెల్లుతుందని చెప్తే మీరు గొప్పవారని అనుకునే వాళ్లం. అలా ఎందుకు చేయరు?, అప్పుడు చంద్రబాబు చెడిపోయినా, ఎన్నికల కమిషన్ చెడిపోలేదని ప్రజలు అనుకుంటారు కదా. అందులో తప్పేముంది?, కోర్టు 19 చోట్ల ఎన్నికలు ఆపమంటే, 100 చోట్ల ఆపారు కదా. మీకు ఉన్న అధికారాలు వాడి, నామినేషన్లు వేయడానికి ఇబ్బందులు ఉన్న చోట్ల ఈ ఆఫీసుల్లో కూడా నామినేషన్లు దాఖలు చేయొచ్చని చెప్తే మీకు ఎంత మంచి పేరు వస్తుంది. శేషన్ గారు ఇన్నేళ్లయినా గుర్తున్నారంటే అలాంటి మంచి పనులు చేయడం వల్లే కదా. రామ్ లాల్ అనే గవర్నర్ గురించి కూడా చెప్పుకుంటారు కదా, రేపు మీ గురించి కూడా అలా చెప్పుకుంటారు. మంచి చేసినా, చెడు చేసినా జనం గుర్తుపెట్టుకుని చెప్పుకుంటారు. చరిత్ర ఎవరినీ మర్చిపోదు. చరిత్రతో ఏం పని నాకు వచ్చే జీతం నాకు వస్తుంది, చంద్రబాబు చల్లగా ఉంటే నేను వెచ్చగా ఉంటానని అనుకున్నంత కాలం చేసేదేమీ లేదు. తక్షణం ఈ 19 మున్సిపాలిటీల్లో, అలాగే నిన్న, ఇవాళ ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా దాడులు జరిగిన చోట జిల్లా కలెక్టరేట్లలో నామినేషన్లు ఫైల్ చేసే అవకాశం ఇవ్వాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ప్రజల్నే కాదు మిత్ర పక్షాల్నీ ముంచిన చంద్రబాబు చంద్రబాబు ప్రజల్ని మాత్రమే కాదు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలను కూడా మోసం చేశాడు. మీకు ప్రభుత్వం కావాలంటే స్ధానిక ఎన్నికల్లో 40 శాతం సీట్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అడిగారు. ఓ ఎమ్మెల్యే 40 శాతం సీట్లలో పోటీ చేస్తామని చెప్పి ట్వీట్ చేసి, ఆ తర్వాత తూచ్ అంటాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాకు 30 శాతం ఇవ్వాల్సిందే అంటారు. ఇవన్నీ చూస్తే చివరిగా లోకేష్ పెట్టిన 15 శాతం సీట్లు ఇస్తామన్న ట్వీట్ గుర్తుకొస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అర్ధరాత్రి 12 గంటలకు కలిశారు, మాధవ్ వచ్చారు. మాట్లాడుతున్నారంటూ చేసిన హడావిడి చూస్తే చిరంజీవి ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్ గుర్తుకొచ్చింది. చివరికి ఇచ్చింది నాలుగైదు సీట్లే. ఠాకూర్ సినిమాలో చివరికి అప్పగించేది శవాన్ని మాత్రమే. ఇదీ అలాగే ఉంది. మీరు దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు పైన పంచుకుంటూ, కింది స్ధాయిలో కార్యకర్తల్ని మాత్రం మోసం చేశారు. కూటమి లోగోలో గొట్టాలు వచ్చి సైకిల్ నుంచి మిగతా రెండు పార్టీలకూ వెళ్తున్నట్లు పెట్టారు. ఇప్పుడు టీడీపీ నుంచి జనసేన, బీజేపీలోకి దూరి పోటీ చేస్తున్న వారిని చూస్తే దానర్దం ఏంటో తెలుస్తోంది. సీట్లు మాకు ఇచ్చామని చెప్పి, టీడీపీ వాళ్లు వచ్చి పోటీ చేస్తున్నారంటూ మిత్రపక్షాలు వాపోతున్నాయి. కార్యకర్తలు కింది స్దాయిలో గొడవలు పడుతూ వైఎస్సార్సీపీ వాళ్ల మీద దాడులు చేస్తుంటారు. పోటీ చేయడానికి మాత్రం టీడీపీ వాళ్లే చేస్తారు. చంద్రబాబు మోసం ఏ స్ధాయిలో ఉంటుందంటే, జనసేనకు ఇచ్చినవి నాలుగు కార్పోరేషన్లు అయితే అందులో రెండు కోర్టు కేసుల్లో ఉన్నాయి, మరో రెండు చోట్ల టీడీపీ వాళ్లనే పంపి మేయర్ టికెట్లు ఇచ్చారు. టీడీపీ తగువులు పడలేక వాళ్లకు కావాల్సి అభ్యర్ధుల్ని జనసేనలోకి పంపి టికెట్లు ఇస్తున్నారు. మా పెడనలో జనసేనకు ఏం బలం ఉందని సీటు ఇచ్చారు. తిరువూరు మున్సిపాలిటీలోనూ అదే పరిస్ధితి. ఇది దగా కాదా మోసం కాదా అని అడుగుతున్నాం. చంద్రబాబు ఈ రాష్ట్రంలో మోసం చేయనిది ఎవరినో చెప్పండి? ఎవరెవరైతే బరి తెగించి, సిగ్గులేకుండా పాపాలు చేస్తున్న వారంతా విష్ణుపురాణం ద్వితీయాంశం ఆరో అధ్యాయం గుర్తుతెచ్చుకోండి. ఇందులో ఉన్న శిక్షలకు సిద్దం కావాలని హెచ్చరిస్తున్నాం. భద్రతా కారణాలతోనే షర్మిల కూతురు పెళ్లికి జగన్ ఇల్లు నిరాకరణ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చాలా గొప్పోడు, తనది పేపరా, జనం చదువుతారా లేదా అనేది ఆయనకు అనవసరం. ఛీ జగన్.. మేనకోడలి పెళ్లికి ఆటంకాలా అని వార్తలు రాస్తాడు. ఒకే స్థలంలో రెండు ఇళ్లు పక్క పక్కన ఉంటే, అందులో ఒకరికి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటే, ప్రాణహాని ఉంటే, అదే కాంపౌండ్ లో పెళ్లిళ్లు చేయడానికి ఎలా వీలవుతుందో చెప్పాలి. ఒకే కాంపౌండ్ లో ఒకే గేటులో నుంచి అందరూ వెళ్లాల్సిన పరిస్ధితి ఉంటే, విడివిడిగా కాంపౌండ్ వాల్స్ లేకపోతే ఇలా పెళ్లిళ్లు చేయడం ఎలా కుదురుతుంది. పెళ్లి అంటే అపరిచితులు వస్తారు, పూల డెకరేషన్, క్యాటరింగ్, క్లీన్ చేసే వాళ్లు వస్తారు. జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి అక్కడ ఉంటారు. చంద్రబాబు హైదరాబాద్ ఇంటి ఫొటోల్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎప్పుడైనా ప్రచురించాయా? వాళ్ల ప్రాణాలకు ముప్పు ఉంటుంది కాబట్టి ఆ ఫొటోలు ప్రచురించవు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు మాత్రం ఆ విలువ లేదా ? మాట్లాడితే రాజశేఖర్ రెడ్డి గారి సంతానం అంటారు. ఇద్దరూ కలిసి అదే కాంపౌండ్ లోనే ఉంటున్నారు కదా. పెళ్లి సందర్భంగా భద్రతా ముప్పు ఉంటుంది కాబట్టి వద్దని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికీ, వారి సోదరికీ ఉన్న తగువులు ఏంటో తెలియవా ? వారానికి ఓసారి యండమూరి గారు రాసినట్లుగా నీ ఇష్టం వచ్చినట్లు రాసుకుంటే ప్రజలకు వాస్తవాలు తెలియవా ? 75 ఏళ్ల వయసులో చంద్రబాబుకు బ్లాక్ క్యాట్ కమాండోలు ఎందుకు, నక్సలైట్లు లేవని మీరే చెప్తున్నారుగా. దగ్గుబాటి గారే చంద్రబాబు 150 ఏళ్లు బతుకుతానంటున్నాడు, వాళ్ల అబ్బాయికే ప్రాబ్లం చూసుకోండి అని చెప్పారు. 75 ఏళ్ల వ్యక్తికి మాత్రం 150 ఏళ్లు బతకాలని ఉంటుంది, ఎన్ఎస్జీ కమాండోలు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారెకి మాత్రం భద్రత అక్కర్లేదా? ఆయన గురించి నీచాతినీచంగా మీరు రాసిన రోజే ఆయన్ను ప్రజలు 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు. ఇంతకన్నా నీచంగా రాయలేం అనుకున్నప్పుడు ప్రజలే ఆయనకు పట్టం గట్టారు. ఇప్పుడు ఇలాంటి నీచపు వార్తలు ఎన్ని రాసినా ప్రజల గుండెల్లో ఆయనపై ఉన్న ప్రేమను తగ్గించలేరని పేర్ని నాని స్పష్టం చేశారు.