ఎన్నికలు కాదు.. ఇవి ఎంపికలు!

ప్రతిపక్షానికి పోటీ చేసే అవకాశమే లేకుండా ఎన్నికల ప్రక్రియను హైజాక్‌ చేశారు\

చంద్రబాబు, పోలీసు వ్యవస్థ, ఎస్‌ఈసీ తీరుపై వైయస్‌ జగన్‌ ఆగ్రహం

తాడేప‌ల్లి: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ తీరుపై వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. నామినేషన్ల దశ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి అడుగులోనూ ఎన్నికల ప్రక్రియను అధికార పార్టీకి అనుకూలంగా మార్చారని తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. ప్రతిపక్షానికి పోటీ చేసే అవకాశం లేకుండా చేసి ఎన్నికల్లో గెలిచినట్లు ప్రకటించుకోవడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు.

ప్రతి దశలోనూ అక్రమాలే

నామినేషన్ల దశను హైజాక్‌ చేయడం, పరిశీలనలో అక్రమాలు, ఉపసంహరణలపై ఒత్తిళ్లు, పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకోవడం లేదా బయటకు పంపించడం, పోలింగ్‌లో రిగ్గింగ్‌, పోలింగ్‌ శాతంలో అవకతవకలు, చివరకు కౌంటింగ్‌ను కూడా తమకు అనుకూలంగా మార్చుకోవడం జరిగిందని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.

ప్రజలు ఎన్నుకోలేదు.. మీరే ఎంపిక చేశారు!

అభ్యర్థులను ప్రజలు ఎన్నుకోలేదని, అధికారంలో ఉన్నవారే ఎంపిక చేశారని విమర్శించారు. ఇవి ఇక ఎన్నికలు కావని, కేవలం ఎంపికలుగా మారిపోయాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యవస్థలో సమూల సంస్కరణల అవసరం ఇంతకుముందెన్నడూ లేనంతగా ఇప్పుడు స్పష్టమైందని పేర్కొంటూ, ఈ పరిణామాలకు చంద్రబాబు, పోలీసు వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ బాధ్యత వహించాలని తన పోస్టులో ప్రస్తావించారు.

Back to Top