తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నవంబర్ 3 ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఓటుతో గెలవాల్సిన ఎన్నికలను చంద్రబాబు తన రాజకీయ అహంకారంతో, పోలీసు వ్యవస్థను, గూండాలను అడ్డుపెట్టుకుని కబ్జా చేశారని, ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో ఖూనీ చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. రెండున్నరేళ్ల పాలన తర్వాత ప్రజల్లోకి వెళ్లి తాము చేసిన అభివృద్ధిని చెప్పుకుని ఓట్లు అడగాల్సిన చంద్రబాబు, ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ప్రతిపక్షాన్ని భయపెట్టే స్థాయికి దిగజారారని, సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేసి తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే స్థానిక ఎన్నికలను అడ్డుపెట్టుకున్నారని ఆరోపించారు. రాయలసీమ, ప్రకాశం, గుంటూరు, పల్నాడు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఘర్షణలు సృష్టించి, ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలను రెచ్చగొట్టారని, ఎంపీలపై దాడులు, ఎమ్మెల్యేల గృహనిర్బంధాలు చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో తేటతెల్లం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను, డీజీపీ నుంచి కింది స్థాయి అధికారుల వరకు, ఎన్నికల అధికారులను, ఆర్వోలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.... కౌంటింగ్ రోజు కూడా అరాచకాలేనా?: రాష్ట్రంలో జరిగిన మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తమ రాజకీయ స్వార్థం కోసం అపహాస్యం చేశారు. రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక, ప్రజల వద్దకు వెళ్లి తమ పాలన చూసి ఓటు వేయాలని అడిగే ధైర్యం లేక పోలీసు వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని, టీడీపీ గూండాలను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేశారు. నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు ప్రతి దశలోనూ ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకోవడం, బెదిరించడం, అక్రమ కేసులు పెట్టించడం, నామినేషన్లు తిరస్కరించడం, సంతకాలు ఫోర్జరీ చేసి విత్‌డ్రాలు చేయించడం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డారు. పోలింగ్ రోజున ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి, వైఎస్సార్సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగి, ఓటు హక్కును కాలరాశారు. చివరకు కౌంటింగ్ ప్రక్రియలోనూ ప్రజల తీర్పును గౌరవించకుండా కొత్త కుట్రలకు తెరతీశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్న చోట్ల కౌంటింగ్‌ను నిలిపివేయడం, రీకౌంటింగ్ పేరుతో జాప్యం చేయడం, గెలిచిన అభ్యర్థులకు డిక్లరేషన్ ఫారాలు ఇవ్వకుండా హోల్డ్‌లో పెట్టడం, ఇప్పటికే ఇచ్చిన డిక్లరేషన్ ఫారాలను లాక్కొని చించేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కౌంటింగ్ కేంద్రాల్లోకి బయటి వ్యక్తులు చొరబడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం, అభ్యర్థులను, ఏజెంట్లను బయటకు పంపించడం, కొన్ని కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం వంటి అక్రమాలు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కలెక్టర్లకు, ఎస్పీలకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. స్వలాభం కోసం ఫ్యాక్షన్ రాజకీయాలను రెచ్చగొడుతున్నారు: చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రంలో కులాలు, ప్రాంతాల మధ్య ఘర్షణలు, ఫ్యాక్షన్ రాజకీయాలను మళ్లీ రెచ్చగొడుతున్నారు. రాయలసీమ, ప్రకాశం, గుంటూరు, పల్నాడు ప్రాంతాల్లో ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లోనూ గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎంపీలపై దాడులు చేయించడం, ఎమ్మెల్యేలను గృహనిర్బంధం చేయడం, ప్రజాప్రతినిధులను బయటకు రానివ్వకపోవడం, కార్యకర్తలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం వంటి చర్యలతో ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తున్నారు. రెండున్నరేళ్ల పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు, ఇన్పుట్ సబ్సిడీ అందించలేకపోయారు. అక్కాచెల్లెళ్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా అప్పుల మీద అప్పులు చేస్తూ ప్రజలపై భారాలు మోపుతున్నారు. సొంత పార్టీ నాయకుల్లో అసమ్మతి, మంత్రుల వైఫల్యాలు, నారా లోకేష్ రాజకీయ అసమర్థత, పవన్ కళ్యాణ్ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా రాజకీయ కక్షసాధింపులకు వేదికగా మార్చారు. ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను విస్మరించింది. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఒకరి మీద ఒకరు బాధ్యతను నెట్టుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన వ్యవస్థలే అధికార పార్టీకి తొత్తులుగా మారితే ఇక ప్రజాస్వామ్యానికి రక్షణ ఎక్కడ ఉంటుంది? పోటీకి అవకాశం ఇవ్వకుండా, ఓటర్లను అడ్డుకుని, కౌంటింగ్‌లో అక్రమాలకు పాల్పడి సాధించుకున్న విజయాలను ప్రజల మద్దతుతో వచ్చిన గెలుపులుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇవి ప్రజాస్వామ్య విజయాలు కాదు.. అధికార బలంతో సృష్టించుకున్న నకిలీ విజయాలు మాత్రమే. వైఎస్సార్సీపీ అభ్యర్థులు, కార్యకర్తలు, కౌంటింగ్ ఏజెంట్లకు సెల్యూట్: వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగాయి. కానీ చంద్రబాబు, నారా లోకేష్ మాత్రం ప్రజల తీర్పుపై విశ్వాసం లేక ఎన్నికల వ్యవస్థనే తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూశారు. అయినా ఇన్ని దాడులు, బెదిరింపులు, అక్రమాల మధ్య కూడా ధైర్యంగా పోటీ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు, కార్యకర్తలు, కౌంటింగ్ ఏజెంట్లకు పార్టీ తరఫున సెల్యూట్ చేస్తున్నాం. వారి పోరాటానికి వైఎస్ జగన్ గారు అండగా నిలిచారు. కార్యకర్తల కోసం రోడ్డుపై కూర్చుని, ఎన్నికల సంఘాన్ని, గవర్నర్‌ను కలిసి చివరి వరకు పోరాడిన నాయకుడు జగన్ గారు. చంద్రబాబు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం రాష్ట్రంలో కక్షలు, కార్పణ్యాలను పెంచి పోషిస్తుంటే, జగన్ ప్రజల కోసం, కార్యకర్తల కోసం పోరాడుతున్నారు. ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. కౌంటింగ్‌లో అక్రమాలకు గురైన వార్డులు, మున్సిపాలిటీల్లో జరిగిన పరిణామాలపై ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా స్పందించాలి. గెలిచిన అభ్యర్థులకు డిక్లరేషన్ ఫారాలు అందించకుండా అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైఎస్సార్సీపీ పోరాటం ఆపేది లేదు. చంద్రబాబు, నారా లోకేష్ గుర్తుంచుకోవాలి.. అధికార బలం శాశ్వతం కాదు, ప్రజల తీర్పే అంతిమం. ఈరోజు అక్రమాలతో సాధించామని చెప్పుకుంటున్న విజయాలు తాత్కాలికమే. రాబోయే ఎన్నికల్లో ప్రజలే మీ పాలనకు, మీ అరాచక రాజకీయాలకు తగిన సమాధానం చెబుతారు. వైఎస్ జగన్ గారి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతుందని టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు.