అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగిన దాడిలో తన స్నేహితురాలు గోపికను రక్షించేందుకు అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి గాయపడిన పదో తరగతి విద్యార్థిని లక్ష్మిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. ప్రస్తుతం అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మితో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిన్న వయసులోనే తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్నేహితురాలిని కాపాడేందుకు లక్ష్మి చూపిన తెగువను శ్రీ వైయస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. లక్ష్మికి మెరుగైన వైద్యం కోసం అవసరమైన పూర్తి వైద్యసాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందిస్తామని, ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మికి మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని రాప్తాడు వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి శ్రీ వైయస్ జగన్ సూచించారు. వైద్యులతో మాట్లాడి లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకోవాలని, అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రిలో మరింత మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్‌తో మాట్లాడిన లక్ష్మి, తన ఆరోగ్య పరిస్థితి కన్నా ముందుగా స్నేహితురాలు గోపిక ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకుంది. దాడి సమయంలో గోపికను కాపాడేందుకు సాహసం ప్రదర్శించిన లక్ష్మి, చికిత్స పొందుతున్న సమయంలోనూ స్నేహితురాలి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేయడం ఆమె స్నేహభావానికి నిదర్శనంగా నిలిచింది. లక్ష్మి ఆరోగ్యంగా కోలుకుని తిరిగి చదువుపై దృష్టి పెట్టాలని శ్రీ వైయస్ జగన్ ఆకాంక్షించారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. చదువుతో పాటు కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందిస్తామని భరోసా ఇచ్చారు. శ్రీ వైయస్ జగన్ స్వయంగా ఫోన్ చేసి లక్ష్మిని పరామర్శించడం, ఆమె ధైర్యసాహసాలను అభినందించడంతో పాటు వైద్యసాయం, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడంపై లక్ష్మి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.