విజయవాడ: వైయస్ఆర్‌సీపీ కోసం, పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. మాజీ కార్పొరేటర్ పళ్లెం రవి ఇంట్లో లేని సమయంలో ఆయన భార్య, పిల్లలను జనసేన నాయకులు బెదిరించి భయభ్రాంతులకు గురిచేసిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన అర్ధరాత్రి జనసేన నాయకులు పళ్లెం రవి ఇంటిపైకి వచ్చి దాడికి ప్రయత్నించారు. రవి ఇంట్లో లేని సమయంలో ఆయన భార్య, పిల్లలను బూతులు తిడుతూ బెదిరించారు. అడ్డువచ్చిన వారిని కూడా భయపెట్టారు. సుమారు పది మంది ఇంటిపై దాడికి దిగారని, తలుపులు వేసుకున్నా వాటిని బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై దాడులా? పళ్లెం రవికి డివిజన్‌లో మంచి పేరు ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఏమిటి? ఇంట్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్న సమయంలో అర్ధరాత్రి వెళ్లి బెదిరించడం ఏ విధమైన రాజకీయమని దేవినేని అవినాష్ ప్రశ్నించారు. జనసేన నాయకులు అర్ధరాత్రి ఇళ్లపైకి వచ్చి దాడులకు పాల్పడుతుంటే పవన్ కల్యాణ్ ఏం సమాధానం చెబుతారు? మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలి. అప్పుడే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది. ఇంతటి దారుణమైన పాలన దేశంలో మరెక్కడా ఉండదని, రాష్ట్రంలో జంగిల్ రాజ్ తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయని అవినాష్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం. సీపీ ఫిర్యాదు స్వీకరించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరికీ శిక్ష పడే వరకు పోరాటం కొనసాగిస్తాం. వైయస్ఆర్‌సీపీ శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. భర్త లేని సమయంలో ఇంటిపైకి వచ్చారు తేజేశ్వరి, పళ్లెం రవి భార్య మాట్లాడుతూ.. నా భర్త ఇంట్లో లేని సమయంలో జనసేన నాయకుడు జయ, అతని అనుచరులు మా ఇంటిపైకి దాడికి వచ్చారు. నన్ను, నా పిల్లలను బెదిరించి భయపెట్టారు. మా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేశారు. పళ్లెం రవి, మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ.. జిలానీ అనే వ్యక్తి నన్ను బూతులు తిడుతూ బెదిరించాడు. నా భార్య, పిల్లలను కూడా భయపెట్టారు. గెలుపోటములను ప్రజలు నిర్ణయిస్తారు. బీసీ కులానికి చెందినవాడిననే కారణంతో నన్ను కొట్టడానికి ప్రయత్నించారు. ఈ దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై పోలీసులకు ఫిర్యాదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తాం.