వైయస్‌ జగన్‌ మనస్తత్వంపై సోషల్‌ మీడియాలో విస్తృత చర్చ

వ్యక్తిగత విషయాల్లోనూ హుందాతనం పాటించాలన్న వైఖరిపై నెటిజన్ల ప్రశంసలు 

తాడేప‌ల్లి: వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలపై రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ, వ్యక్తుల గోప్యతను గౌరవించాలన్న వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి  వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి వైఖరిపై సోషల్‌ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ దంప‌తుల విడాకుల అంశంపై వ్యక్తిగత విషయాలను రాజకీయ ప్రచారానికి ఉపయోగించకుండా సంయమనం పాటించాలని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలకు ఇచ్చిన సూచనలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయకుండా ఉండటం, సోషల్‌ మీడియా వేదికల్లో సంబంధిత పోస్టులను పంచుకోకపోవడం, బహిరంగ చర్చలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు స్పష్టంగా చెప్పడం వైయస్‌ జగన్‌ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందంటూ నెటిజన్లు చర్చిస్తున్నారు. రాజకీయాల్లో తీవ్ర విమర్శలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాల్లో హద్దులు పాటించడం మంచి రాజకీయ సంస్కారానికి సంకేతమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజా సమస్యలపై రాజకీయ పోరాటం కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న వైఖరి వైయస్‌ జగన్‌ నాయకత్వంలోని విలువల రాజకీయాలను మరోసారి చాటుతోందంటూ సోషల్‌ మీడియా వేదికల్లో చర్చ సాగుతోంది. రాజకీయాల్లో ప్రత్యర్థిని విమర్శించడం వేరు.. వారి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించడం వేరు అనే అంశాన్ని పలువురు నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. 
 

Back to Top