అనంతపురం జిల్లా: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డిని పోలీసులు మంగళవారం ఆయన స్వగృహంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కళ్యాణదుర్గంలో జరిగిన దౌర్జన్యాలను నిరసిస్తూ మాజీ ఎంపీ రంగయ్య ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు ఆయన అనంతపురం నుంచి కళ్యాణదుర్గం బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు అధికార బలంతో దౌర్జన్యాలకు పాల్పడిన కూటమి ప్రభుత్వం, గెలుపుపై నమ్మకం లేక కౌంటింగ్ సమయంలోనూ అక్రమాలకు పాల్పడిందని అన్నారు. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు గెలిచిన చోట రీకౌంటింగ్ పేరుతో ఫలితాలను మార్చే ప్రయత్నాలు జరిగాయని, కళ్యాణదుర్గం కౌంటింగ్ కేంద్రాల్లో బౌన్సర్లను తీసుకువచ్చి దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనలను నిరసిస్తూ ర్యాలీ చేపడితే అరెస్టు చేయడం దారుణమని, కళ్యాణదుర్గం పరిసరాల్లో బందోబస్తు పెట్టి వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని అన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల ఫలితాలపై మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని అనంత వెంకటరామిరెడ్డి కోరారు. ప్రజలపై, ఎన్నికల ఫలితాలపై నిజంగా నమ్మకం ఉంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 స్థానాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. అనంతపురంలో ప్రజలే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించుకున్నారని, కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చినా ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని అన్నారు. పోలింగ్ రోజు బూత్ క్యాప్చరింగ్, గొడవలు లేకపోతే వైయస్ఆర్‌సీపీకి 15 వేల ఓట్ల మెజార్టీ వచ్చేదని పేర్కొన్నారు. ఎన్నికలపై అనుమానం ఉంటే అనంతపురంలోనూ ఫలితాలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దామని సవాల్ చేశారు. 2024 ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి కాబట్టే అందరూ గెలిచారని, వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్య ఎన్నికలపై ఇప్పుడు ఎందుకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ప్రశ్నించారు.