మేక తోలు కప్పుకున్న తోడేలులా చంద్రబాబు ప్రవచనాలు

వ్యవస్థలను నాశనం చేసి నీతులు చెబుతారా?

చంద్రబాబును సూటిగా నిలదీసిన మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)

 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని).

స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్య విధ్వంసం

పోలీసుల అండతో టీడీపీ దొంగ గెలుపు:

పేర్ని నాని ధ్వజం

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను పక్షవాత రోగిలా మార్చేశారు

పులివెందుల బూత్ క్యాప్చరింగ్‌పై సీసీటీవీ ఫుటేజీలు బయటపెట్టే దమ్ముందా? 

సీఎం చంద్రబాబుకు పేర్ని నాని సవాల్

తాడేపల్లి: రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ముమ్మాటికీ టీడీపీ అరాచకానికి, ప్రజాస్వామ్య విధ్వంసానికి పరాకాష్ట అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నామినేషన్ల స్వీకరణ పర్వంతో మొదలైన అధికార పార్టీ దౌర్జన్యాలు డిక్లరేషన్ ఫారాలు ఇచ్చే వరకు నిరాటంకంగా కొనసాగాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రెస్ మీట్ ఆవు తోలు కప్పుకున్న తోడేలు వంద అబద్ధాలు, యాభై నీతులు చెప్పినట్లుగా ఉందని, ఆయన ద్వంద్వ వైఖరి ఆధ్యాత్మిక ముసుగులో ఆగడాలు చేసే నిత్యానంద స్వామిని తలపిస్తోందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) పక్షవాతం వచ్చిన రోగిలా మార్చేశారని, కంచె చేను మేసిన చందాన ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన పోలీసులే దుశ్శాసనుడిలా మారి వ్యవస్థలను చెరబట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో వెన్నుపోటు పార్టీ గుండాలు బ్యాలెట్ పేపర్లు లాక్కొని దొంగ ఓట్లు వేసిన దృశ్యాలు బట్టబయలయ్యాయని.. దమ్ముంటే తాము అడిగే పోలింగ్ బూత్‌లు, మున్సిపల్ వార్డుల సీసీటీవీ ఫుటేజీలను మీడియాకు విడుదల చేయాలని పేర్ని నాని సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..: 

ఆవు తోలు కప్పుకున్న తోడేలులా చంద్రబాబు నీతులు.:
 చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన మీడియా సమావేశం ఆశాంతం చూస్తుంటే ఆవు తోలు కప్పుకున్న తోడేలు వంద అబద్ధాలు, యాభై నీతులు చెప్పినట్లు ఉంది. చేసేవన్నీ అకృత్యాలు.. చెప్పేవేమో నీతులు. బెంగళూరులో నిత్యానంద స్వామి బయట భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతూ, ఆశ్రమంలో ఆగడాలు సాగించినట్లే చంద్రబాబు తీరు కూడా ఉంది. ప్రెస్‌మీట్ నిండా సొంత భజన, జగన్ గారిపై, వైఎస్సార్‌సీపీపై నిందలు వేయడం తప్ప ఇంకేమీ లేదు. ధనాన్ని విచ్చలవిడిగా వాడి, పోలీసుల దాష్టీకాన్ని ప్రయోగించి గెలిచిన గెలుపును కూడా ఒక గొప్ప విజయంగా చిత్రీకరించుకోవడం సిగ్గుచేటు.

నామినేషన్ల దగ్గర్నుంచే దౌర్జన్యాలు..  ఫ్యాన్ గుర్తు లేకుండా కుట్రలు: 
రాష్ట్రంలో 17 మున్సిపాలిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారంటే ఎన్నికలు ఎంత దారుణంగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు గాను 51 చోట్ల ఫ్యాన్ గుర్తు లేకుండా దౌర్జన్యం చేశారు. కడప కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉంటే 51 చోట్ల ప్రతిపక్షాన్ని బరిలో నిలవకుండా అడ్డుకున్నారు. గురజాల, దాచేపల్లి, మాచర్ల, దర్శి, కనిగిరి, రాయచోటి, ప్రొద్దుటూరు, బద్వేల్, ఎర్రగుంట్ల, కమలాపురం, తాడిపత్రిల్లో వార్డు సభ్యులనే లేకుండా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 84 జెడ్పీటీసీలు, 2 వేలకు పైగా ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ నామినేషన్లు వేయకుండా పోలీసులతో అడ్డుకున్నారు.

ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన పోలీసులు.. పక్షవాత రోగిలా ఎస్ఈసీ: 
నామినేషన్లు వేయడానికి వెళ్తే పోలీసులు లోపలికి రానివ్వలేదు. తోసుకుని లోపలికి వెళ్తే టీడీపీ గుండాలు నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేశారు. అధికారులు నిబంధనల ప్రకారం క్లరికల్ తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా వేలాది నామినేషన్లను తిరస్కరించారు. అభ్యర్థులు రాకపోయినా దొంగ సంతకాలు పెట్టి అధికారులే విత్‌డ్రాలు చేసేశారు. వైఎస్సార్‌సీపీ క్రియాశీలక కార్యకర్తలపై అక్రమంగా రౌడీషీట్లు తెరిచి, లక్షల రూపాయల పూచీకత్తుతో బైండోవర్ చేశారు. మరి రాష్ట్రంలో తిరుగుతున్న కిరాతకులు, టీడీపీ హంతకులపై ఏ ఒక్క పోలీస్ స్టేషన్‌లోనైనా బైండోవర్ కేసులు పెట్టారా? ఎస్ఈసీని కోరలు పీకేసి, పక్షవాతం వచ్చిన రోగిలా మార్చేశారు. పురాణాల్లో దుశ్శాసనుడు చెరబడితే శ్రీకృష్ణుడు కాపాడాలి.. కానీ ఇక్కడ రక్షించాల్సిన పోలీసులే దుశ్శాసనుల్లా మారి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు.

పులివెందులలో రిగ్గింగ్.. సీసీటీవీ ఫుటేజీలు ఇచ్చే దమ్ముందా?: 
పులివెందులలో ప్రజలు తిరుగుబాటు చేశారని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. పులివెందుల పోలింగ్ బూత్‌లలో టీడీపీ గుండాలు కుర్చీలు వేసుకుని కూర్చుని ఓట్లు గుద్దిన వీడియోలు బట్టబయలయ్యాయి. బ్యాలెట్ పేపర్లు లాక్కొని దొంగ ఓట్లు వేసుకోవడం కూడా ఒక గెలుపేనా? ఆత్మకూరులో ఓట్లు లెక్కించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిచాక, రాత్రికి రాత్రే రీకౌంటింగ్ పేరుతో 900 ఓట్లను ఇన్వాలిడ్ చేసి టీడీపీని గెలిపించారు. చంద్రబాబుకు దమ్ముంటే.. వైఎస్సార్‌సీపీ అడిగే పోలింగ్ బూతులు, మున్సిపల్ వార్డులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సెగ్మెంట్ల సీసీటీవీ ఫుటేజీలను మీడియాకు విడుదల చేయగలరా?

అమరావతిలో నారాయణ, బాబు ఇళ్లు తప్ప ఇంకేమున్నాయి?: 
2021లో నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే విజయవాడ, గుంటూరు సహా రాజధాని ప్రాంతంలో ప్రజలు టీడీపీని ఘోరంగా ఓడించారు. తాడికొండ, మంగళగిరిల్లో టీడీపీ ఓడిపోయినప్పుడే అమరావతిని ప్రజలు తిరస్కరించినట్లు చంద్రబాబు ఒప్పుకుంటారా? గ్రామ కంఠం భూముల పేరుతో రాజధాని ప్రాంత రైతులను చంద్రబాబు, నారాయణ ఎందుకు కాల్చుకుతింటున్నారు? వారి ఆస్తులను నిర్దయగా కబ్జా చేస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు, నారాయణ ఇళ్లు తప్ప సామాన్య ప్రజలు కట్టుకున్న ఇల్లు ఒక్కటైనా ఉందా? జగన్ గారు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన పనులు తప్ప, ఈ రెండున్నర ఏళ్లలో చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా?

రైతులపై కక్ష.. పంట హక్కు ఉన్న కృష్ణా డెల్టాను ఎండగట్టారు: 
బ్రిటిష్ కాలం నుంచి పంట హక్కు ఉన్న కృష్ణా డెల్టా రైతుల గొంతు కోశారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మొహమాటం కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు. సాంకేతికతతో తుపానులను ఆపేస్తానన్న చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఆర్ణబ్ తుపానులో ప్రాణనష్టం జరిగింది. ఆర్ణబ్, మురుసు తుపానులతో సర్వం కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నయాపైసా అయినా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? కరువుతో అల్లాడుతున్న రాయలసీమ, పల్నాడు రైతులకు దమ్మిడీ సాయం చేయకుండా, సిగ్గులేకుండా ఇన్సూరెన్స్ ఉందా అని ఫోటో షూట్లలో అడుగుతున్నారు.

పీ4 అంటే బాబు, లోకేష్ కుటుంబాలే బంగారు కుటుంబాలు: 
పీ4 అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కాదు.. అమరావతి కాంట్రాక్టర్లే మార్గదర్శులు, చంద్రబాబు, లోకేష్ కుటుంబాలే బంగారు కుటుంబాలు. బాగుపడింది వాళ్ల కుటుంబాలు, వాళ్ల మంత్రుల కుటుంబాలే తప్ప సామాన్య పేద కుటుంబాలు కావు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని డబ్బాలు కొడుతున్న చంద్రబాబు.. ఆ యువకుల పేర్లు, ఆధార్ నంబర్లు, ఏ కంపెనీలో ఇచ్చారో, ఎంత జీతమో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. భారతదేశ రాజకీయాల్లోనే ఇంత చెత్త రాజకీయాలు (వర్స్ట్ పాలిటిక్స్) నడిపిన నాయకుడు మరొకరు లేరు.

సామాజిక న్యాయంపై సొల్లు కబుర్లు.. మేనిఫెస్టో హామీ ఏమైంది?: 
మరోవైపు సామాజిక న్యాయం గురించి మాట్లాడే చంద్రబాబు.. మేనిఫెస్టోలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, కేంద్రం వద్ద రాజ్యాంగ సవరణ ఎందుకు చేయించలేదు? అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. కేబినెట్‌లోని 25 మంది మంత్రుల్లో కేవలం ఇద్దరు దళితులకేనా మంత్రి పదివులు ఇచ్చారు, రాష్ట్రంలో కమ్మవారు ఎక్కువా? దళితులు ఎక్కువా? అని నిలదీశారు. 1978లో రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుది అంతా తప్పుడుతనం, మోసం, లజ్జాహీనతేనని స్పష్టం చేశారు.  ప్రభుత్వం ఇన్ని అకృత్యాలు, దౌర్జన్యాలు చేసినా వైఎస్సార్‌సీపీకి 34 శాతం ఓట్లు వచ్చాయంటే కూటమి ప్రభుత్వం పునాదులు కదిలినట్లేనన్న పేర్ని నాని..  పోలీసుల లాఠీలు, అక్రమ కేసులు, బెదిరింపులను ధైర్యంగా ఎదుర్కొని పార్టీ జెండాను మోసిన ప్రతి  వైయస్సార్సీపీ కార్యకర్తకు, నాయకుడికి సెల్యూట్ చేస్తున్నామని చెప్పారు.

Back to Top