శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: ప్రజలు గెలిపించిన అభ్యర్థిని.. టీడీపీ నేతలు, అధికారులు ఒక్కటై ఓడించేసిన వైనమిది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో అనంతసాగరం మండలం జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని అమరావతి 1,000 ఓట్లకుపైగా మెజార్టీతో గెలిచారు. వెంటనే టీడీపీ నేతలు కౌంటింగ్ నిలిపివేయించారు. పలుమార్లు కౌంటింగ్‌కు అడ్డుపడ్డారు. చివరకు ఏఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న తహసీల్దారు వీర వసంతరావు 979 ఓట్లు చెల్లనివని చెప్పి, టీడీపీ అభ్యర్థి శిరీష గెలుపొందినట్లు రాత్రి 9 గంటలకు ప్రకటించారు. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, నాయకులు కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 979 ఓట్లను ఏ కారణంతో తిరస్కరించారో తహసీల్దారు వీర వసంతరావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసినా, వారిని పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు. గెలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని కాదని అన్యాయంగా టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించడం దారుణమని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు.