కిమిడి కోడలిపై బొత్స కోడలు ఘన విజయం 

చీపురుపల్లి : విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామానికి గరివిడి జెడ్పీటీసీ ఎన్నికలు వేదికగా నిలిచాయి. ఇద్దరు రాజకీయ ప్రముఖుల కుటుంబాలకు చెందిన కోడళ్ల మధ్య జరిగిన పోరులో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయ కుడు, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కోడలు బొత్స పూజిత విజయం సాధించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కోడలు కిమిడి సంధ్యపై 1599 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  

రాజకీయ కుటుంబాల మద్య పోటీ... 
గరివిడి జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాయి. ఓ వైపు బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి పూజిత, మరోవైపు కళా వెంకటరావు కుటుంబం నుంచి సంధ్య బరిలో నిలవడంతో ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. రెండు కుటుంబాల ప్రతిష్టకు సంబంధించిన పోరుగా రాజకీయ పరిశీలకులు చూశారు. పూజిత విజయం సాధించడం, కళా కుటుంబానికి చెందిన సంధ్య ఓటమి పాలవ్వడం గరివిడి రాజకీయాల్లో చర్చకు దారితీసింది. తన కోడలు సంధ్యను గరివిడి నుంచి జెడ్పీటీసీగా గెలిపించి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టాలన్న కళా వెంకటరావు ఆశలపై ఓటమి నీళ్లుచల్లిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

Back to Top