వైయ‌స్ఆర్‌సీపీ ఘన విజయం.. తిరుపతిలో చెవిరెడ్డి విక్టరీ

 
 తిరుపతి/ పాడేరు: అధికార టీడీపీ గూండాలు ఎన్ని కుట్రలు, అరాచకాలకు పాల్పడినా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలంతా వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నారు. పరిషత్‌ ఎన్నికల్లో​ కూటమి సర్కార్‌కు షాకిస్తూ వైఎస్సార్‌సీపీ సంచలన విజయాలు సాధించింది. చంద్రగిరి నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ..  అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్‌ పీఠాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.  

చంద్రగిరి నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగించింది. తిరుపతి రూరల్ మండలం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి 602 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన కౌంటింగ్‌లో 14వ రౌండ్‌లో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి విజయం దక్కింది. కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసినా విజయం మాత్రం వైఎస్సార్‌సీపీవైపే నిలిచింది. ఈ ఫలితాలతో చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది.

మరోవైపు.. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్‌ పీఠాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. జిల్లాలో మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలకు గానూ ఏడు చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. చింతపల్లి, పెదబయలు, అనంతగిరి, జీకే వీధి, డుంబ్రిగూడ, పాడేరు, హుకుంపేట జడ్పీటీసీ స్థానాలు వీటిలో ఉన్నాయి. ఈ ఫలితాలతో చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది.

ప్రభావితం చేయలేకపోయిన ప్రలోభాలు
కూటమి ప్రలోభాలు, కోట్లాది రూపాయల కుమ్మరింపులు.. వంటివేవీ గిరిజన ఓటర్ల తీర్పును ప్రభావితం చేయలేకపోయాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై వారు తమకున్న అభిమానాన్ని ఎప్పుడూ చాటుతూనే వచ్చారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి జరిగిన పలు ఎన్నికల్లో జిల్లా ఓటర్లు  వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నారు.  2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో అరకు ఎంపీ, అరకులోయ, పాడేరు ఎమ్మెల్యే స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులనే గెలిపించారు. అలాగే 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతగిరి జడ్పీటీసీ, జి.మాడుగుల ఎంపీపీ పదవులు మినహా మిగిలిన పది మండలాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే విజయం సాధించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1,606 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు
ఎంపీటీసీ స్థానాల్లో మొత్తం 1,606 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. 89 ఎంపీటీసీలను ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది. జడ్పీటీసీ స్థానాల్లో ఏకగ్రీవమైన ఒక స్థానంతో పాటు 56 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. 

Back to Top