ఫిర్యాదులపై ఎస్‌ఈసీ నుంచి కనీస స్పందన లేదు

అధికార పార్టీ అక్రమాలను పోలీసులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు

కౌంటింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకుని, టీడీపీ నేతలకు స్వేచ్ఛ కల్పించారు

వైయ‌స్సార్‌సీపీ నేతలు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, మలసాని మనోహర్‌ రెడ్డి, నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి ధ్వజం

విజయవాడ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలు.. చివరకు ఓ్ల లెక్కింపుల్లో కూడా అంతులేని అరాచకాలకు పాల్పడుతున్న వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకులు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, మలసాని మనోహర్‌ రెడ్డి, నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌లో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)కి ఫిర్యాదు చేసిన అనంతరం వారు అక్కడే మీడియాతో మాట్లాడారు.
    వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకోవడం, పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేయడం, హౌస్‌ అరెస్టులు చేయడం ద్వారా అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మరోవైపు వెన్నుపోటు పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల అనుచరులు, వారి కుటుంబ సభ్యులు కౌంటింగ్‌ కేంద్రాల్లోకి యథేచ్ఛగా ప్రవేశించి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని తెలిపారు. వీటన్నింటిపై ఎప్పటికప్పుడు ఎస్‌ఈసీకి ఫిర్యాదులు చేసినా సకాలంలో స్పందించకపోవడం దారుణమన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎస్‌ఈసీ, రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను విస్మరిస్తోందని ఆక్షేపించారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ పోలీసు వ్యవస్థను తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని  చెప్పారు. 
    రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసిన వారిలో పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, పార్టీ ఎంప్లాయీస్‌ అండ్‌ పెన్షనర్స్‌ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి, పార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మలసాని మనోహర్‌ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి తదితరులు ఉన్నారు. 
ఈ సందర్భంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే..:

వైయస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకున్నారు.
:టీజేఆర్‌ సుధాకర్‌బాబు. పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు

    మాజీ ఎంపీ తలారి రంగయ్య వంటి ప్రజాప్రతినిధిని కౌంటింగ్‌కు వెళ్లకుండా పోలీసులు నిర్బంధించిన విషయాన్ని ఉదయం 10 గంటలకే ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాం. శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రారెడ్డి, శిల్పా భువనేశ్వర్‌ రెడ్డిలను హౌస్‌ అరెస్ట్‌ చేయడం, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్‌ చేయడం, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను నిర్బంధించడం వంటి ఘటనలపై ఉదయం 10.30 గంటలకే ఫిర్యాదులు పంపినా ఎన్నికల సంఘం స్పందించలేదు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం, కటికలపూడి ఎంపీటీసీ స్థానం, అన్నమయ్య జిల్లా పీలేరు తదితర ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు. జగ్గయ్యపేటలో బైండోవర్‌ కేసులు ఉన్నాయనే కారణంతో ఏజెంట్లను అనుమతించకపోవడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం. మరోవైపు బాలకృష్ణ పీఏ శ్రీనివాసులు, బాలాజీతో పాటు అధికార పార్టీకి చెందిన పలువురు వ్యక్తులు కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ప్రవేశించి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బెదిరించారు. పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేల అనుచరులు, కుటుంబ సభ్యులు కౌంటింగ్‌ కేంద్రాల్లో తిరుగుతున్నా పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదు. 
    గుంటూరు జిల్లా పెదనందిపాడు నియోజకవర్గంలోని వెంగళపాలెం బ్యాలెట్‌ బాక్సుకు సంబంధించిన ఘటనలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై అక్రమంగా కేసు పెట్టి రిమాండ్‌ చేయించారు. పోలింగ్‌ అధికారి బస్సు నుంచి బ్యాలెట్‌ బాక్సును కిందకు దించిన విషయాన్ని పోటీ చేసిన అభ్యర్థి గుర్తించి ప్రశ్నించారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో అప్పిరెడ్డి అక్కడికి వెళ్లి నిరసన తెలిపారు. బ్యాలెట్‌ బాక్సును కిందకు దించడం తప్పేనని సంబంధిత పోలింగ్‌ అధికారి కూడా అంగీకరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లాం. అయినా అసలు ఘటనపై విచారణ జరపకుండా అప్పిరెడ్డిపైనే కేసు నమోదు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఒత్తిళ్లతోనే ఈ వ్యవహారం జరిగింది. బ్యాలెట్‌ బాక్సుల భద్రతపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, అక్రమాలను ప్రశ్నించకుండా చేయాలనే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఈ ఘటనపై ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. 

అడుగడుగునా అధికార దుర్వినియోగం.
:మలసాని మనోహర్‌ రెడ్డి, పార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు  

    నామినేషన్ల దశ నుంచి స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్‌ వరకు అధికార పార్టీ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. వైఎస్సార్‌సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లకు అన్ని అర్హతలు, అనుమతి పత్రాలు ఉన్నప్పటికీ వివిధ సాకులతో కేంద్రాల్లోకి అనుమతించడం లేదు. ఆలూరు సహా పలు ప్రాంతాల్లో ఏజెంట్‌ ఫారాలు ఉన్నవారిని కూడా అడ్డుకున్నారు. కొన్ని చోట్ల పోలీసులే లాఠీచార్జి చేసి దాడులకు పాల్పడ్డారు. మరోవైపు టీడీపీకి చెందిన నాయకులు, ఎమ్మెల్యేల అనుచరులు కౌంటింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లి ప్రతిపక్ష ఏజెంట్లను భయపెడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులు, పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కౌంటింగ్‌ కేంద్రాలను సందర్శిస్తూ ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేశారు.
    ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగి ఉంటే ప్రజల తీర్పు తమకు అనుకూలంగా ఉండదనే భయంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి నిర్బంధాలకు దిగుతోంది. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు.

పోలీసులు, ఎన్నికల సంఘం ఘోరంగా విఫలం.
:నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి, పార్టీ ఎంప్లాయీస్‌ అండ్‌ పెన్షనర్స్‌ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

    రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి అధికార పార్టీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్‌ పత్రాలను తొలగించడం, బీ ఫారాలు సమర్పించకుండా నిర్బంధించడం, అభ్యర్థులపై దాడులు చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్‌ రోజున ఓటు వేయడానికి వచ్చిన ప్రజలపై దాడులు, లాఠీచార్జీలు జరిగాయి. కౌంటింగ్‌ సమయంలోనూ అదే తరహా అక్రమాలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపిస్తూ టీడీపీ నేతలకు మాత్రం పూర్తి స్వేచ్ఛ కల్పిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మెజారిటీ వచ్చిన చోట్ల కూడా రీకౌంటింగ్‌ పేరుతో ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నాలు జరిగాయి. 
    ఎన్నికల కమిషన్, డీజీపీ, పోలీసు అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లే రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణ తీరును దేశవ్యాప్తంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ వ్యవహారాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రజలే రాబోయే రోజుల్లో ఈ అరాచక పాలనకు తగిన బుద్ధి చెబుతారు.

Back to Top