గుంటూరు: బ్యాలెట్ బాక్స్ తరలింపు వ్యవహారం, అనంతరం జరిగిన లాఠీచార్జ్, కేసులపై వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా వేర్వేరుగా పోలీసుల తీరును తప్పుబట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వెంగలాయపాలెంకు చెందిన బ్యాలెట్ బాక్స్‌ను ఓ అధికారి బస్సు దిగి తీసుకెళ్తుండగా వైయస్ఆర్‌సీపీ నేతలు అడ్డుకున్నారని, అనంతరం ధర్నా చేస్తే పోలీసులు లాఠీచార్జ్ చేసి, లేళ్ల అప్పిరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారని పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సులను దొంగతనంగా తరలించి మార్చే వారికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని, ప్రజలను రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్న పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. బ్యాలెట్ బాక్స్‌ను కాపాడుకోవడానికి వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు, ఎన్నికల కమిషన్ కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయలేదని, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో గల్లా మాధవి భర్త, ఆమె పోలింగ్ బూత్‌లలోకి వెళ్లడంపై ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేత అనర్హుడని పేర్కొన్నారు. నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ.. చంద్రబాబు అరాచక పాలనలో భాగంగానే లేళ్ల అప్పిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఎన్నికల్లో పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఉపయోగించుకుందని మండిపడ్డారు. పోలీసులు పసుపు చొక్కా వేసుకుని పనిచేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.