తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు నవంబర్ 6తో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్సార్ సమాధి వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్ర 13 జిల్లాలను దాటుకుంటూ 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్లు సాగిన యాత్రలో వైయస్ జగన్ లక్షలాది మంది ప్రజలను కలుసుకుని వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రజల మధ్యే 341 రోజులు 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా ప్రజాసంకల్ప యాత్ర సాగింది. 124 సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైయస్ జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా ప్రజల మధ్యే గడిపారు. పేద కుటుంబాలు విద్య, వైద్యం కోసం పడుతున్న కష్టాలను, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న అక్కచెల్లెమ్మల పరిస్థితులను, చిన్నచిన్న పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజల బాధలను స్వయంగా చూశారు. ఇచ్చిన మాటను పాలనలో ఆచరణలో పెట్టారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రలో తెలుసుకున్న సమస్యలకు పరిష్కారంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా వివక్ష లేని పాలన అందించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి ముంగిటకు తీసుకువచ్చారు. 1.34 లక్షల ఉద్యోగాల భర్తీతో భారీ స్థాయిలో నియామకాలు చేపట్టారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేశారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేశారు. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ బలోపేతం, ఆరోగ్య ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన, ఇంగ్లిష్ మీడియం వంటి పథకాల ద్వారా విద్య, వైద్యం, మహిళలు, విద్యార్థులు, పేద కుటుంబాలకు అండగా నిలిచే విధానాలను అమలు చేశారు. ప్రజల కోసం మళ్లీ పాదయాత్ర 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అమలు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయాయని వైయస్ఆర్సీపీ చెబుతోంది. రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు పెరిగాయని, రెడ్‌బుక్ పాలనతో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వచ్చే ఏడాది మళ్లీ పాదయాత్ర చేపడతానని వైయస్ జగన్ ప్రకటించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న వేళ.. మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు వైయస్ జగన్ సిద్ధమవుతుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నాడు ప్రజల కష్టాలను విని భరోసా ఇచ్చిన పాదయాత్ర.. నేడు మళ్లీ ప్రజల సమస్యలపై పోరాటానికి వేదిక కానుంది.