దాడులు, వాహనాల దహనంపై సమగ్ర దర్యాప్తు చేప‌ట్టండి

ఎస్పీని కలిసిన కాటసాని రామభూపాల్‌రెడ్డి, గంగుల నాని 

నంద్యాల జిల్లా : ఎస్పీని వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని కలిసి ఆళ్లగడ్డలో చోటుచేసుకున్న వరుస ఘటనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి షరీఫా బీ కుమారుడిపై జరిగిన దాడి, అనంతరం వారి ఇంటి వద్ద పార్క్‌ చేసిన వాహనాలకు నిప్పుపెట్టిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కాటసాని రామభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆళ్లగడ్డలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమన్నారు. షరీఫా బీ కుమారుడిపై హత్యాయత్నం జరిగిందని, తాజాగా వాహనాలకు నిప్పుపెట్టి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, ఏజెంట్లను అడ్డుకోవడం, కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించకపోవడం వంటి అంశాలను కూడా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజలు బ్యాలెట్‌ ద్వారా ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని కాటసాని స్పష్టం చేశారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా కాకుండా చట్టం ప్రకారం నిష్పక్షపాతంగా వ్యవహరించి, బాధితులకు న్యాయం చేయాలని, దాడులకు పాల్పడిన వారిని గుర్తించి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Back to Top