కౌంటింగ్‌ కేంద్రాల్లో కూటమి హల్‌చల్‌

వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లకు అడ్డంకులు

ఓట్ల తేడాలపై ప్రశ్నిస్తే అడ్డుకోవడం.. ఏజెంట్లను బయటకు పంపడం.. పలుచోట్ల పోలీసుల ఏకపక్ష వైఖరి

తాడేప‌ల్లి: ఏపీ పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైన రోజే పలు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లను కౌంటింగ్‌ కేంద్రాల్లోకి రాకుండా అడ్డుకోవడం, ఓట్ల తేడాలపై ప్రశ్నించిన వారిపై దాడులు, దూషణలకు దిగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కూటమి నేతలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తూ, వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపేందుకు పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌ ప్రక్రియపై ఆందోళన వ్యక్తమవుతోంది.

రాష్ట్ర‌వ్యాప్తంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లు ఇలా:

 ఎన్టీఆర్ జిల్లా – ఇబ్రహీంపట్నం:
కొటికలపూడి ఎంపీటీసీ స్థానంలో పోలైన ఓట్లకు, బ్యాలెట్‌ బాక్సులో ఉన్న ఓట్లకు తేడా రావడంపై కౌంటింగ్‌ కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 2,432 ఓట్లు పోలవగా బ్యాలెట్‌ బాక్సులో 2,427 ఓట్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ప్రశ్నించగా, వారిని సీఐ సుబ్రహ్మణ్యం అడ్డుకున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

 ఎన్టీఆర్ జిల్లా – జగ్గయ్యపేట:
కౌంటింగ్‌ హాల్‌లోకి కేసులు ఉన్నాయంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలీసులు అడ్డుకోవడంపై సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు సీఐ వెంకటేశ్వర్లును ప్రశ్నించారు. ఏజెంట్‌ పాసులు ఉన్నప్పటికీ అడ్డుకోవడంపై వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

 ఉమ్మడి చిత్తూరు జిల్లా: 
తిరుపతి రూరల్‌, పుంగనూరు, కుప్పం, చిత్తూరు నియోజకవర్గాల్లో పోలింగ్‌ రోజు వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వేదాంతపురం, మల్లంగుంట, సాయినగర్‌, మంగళం, సప్తగిరినగర్‌, ఓటేరు ప్రాంతాల్లో రిగ్గింగ్‌ జరిగిందని, చౌడేపల్లి మండలంలోని చారాల, దాదేపల్లిలో ఏజెంట్లను బయటకు పంపారని ఆరోపించాయి. తిరుపతి రూరల్‌ మండలంలో రీపోలింగ్‌ కోరినా స్పందన లేదని పేర్కొన్నాయి.

 అనంతపురం జిల్లా – కళ్యాణదుర్గం: 
 కౌంటింగ్‌ కేంద్రంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులను పోలీసులు అనుమతించగా, వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్యను హౌస్‌ అరెస్ట్‌ చేశారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పోలీసుల ఏకపక్ష వైఖరిపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

 నంద్యాల జిల్లా – నందికొట్కూరు: 
కౌంటింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే జయసూర్య పీఏ రవీంద్ర అధికారులతో, ఏజెంట్లతో మాట్లాడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. అదే కేంద్రం వద్ద మీడియా ప్రతినిధులను ప్రధాన గేటు వద్దే నిలిపివేయడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేశాయి.

 శ్రీ సత్యసాయి జిల్లా – హిందూపురం: 
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు శ్రీనివాసరావు, బాలాజీ కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లి అక్కడే ఉన్నారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు మీడియా ప్రతినిధులను కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించలేదని తెలిపాయి.

 అన్నమయ్య జిల్లా – పీలేరు: 
 ఆరు మండలాలకు చెందిన వైయ‌స్ఆర్‌సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లను బైండోవర్‌ సాకుతో పోలీసులు అడ్డుకున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏజెంట్‌ పాసులు ఉన్నప్పటికీ లోపలికి అనుమతించకుండా బయటే నిలిపివేసి, కొందరిని బలవంతంగా బయటకు పంపారని ఆరోపించాయి.

 కర్నూలు జిల్లా – ఆలూరు: 
ఆర్వోల ద్వారా అధికారికంగా ఏజెంట్‌ పాసులు తీసుకున్నప్పటికీ వారిని కౌంటింగ్‌ హాల్‌లోకి పోలీసులు అనుమతించలేదని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఏజెంట్లపై లాఠీచార్జ్‌ చేశారని తెలిపాయి. కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లు, మీడియా స్వేచ్ఛగా విధులు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ కోరుతోంది.

Back to Top