కౌంటింగ్‌ వేళ వైయ‌స్ఆర్‌సీపీ నేతల హౌస్‌ అరెస్టులు

కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా పలువురు నేతలకు అడ్డంకులు

నంద్యాల: పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ వేళ నంద్యాల జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిని కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు తెలిపారు. కౌంటింగ్‌లో కుట్రలకు పాల్పడేందుకే ఈ నిర్బంధాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్‌రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. కర్నూలు జిల్లాలో నందికొట్కూరు వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయానికి వెళ్తున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతపురంలో మాజీ మంత్రి శైలజానాథ్‌ను కూడా కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లకుండా హౌస్‌ అరెస్ట్‌ చేసినట్లు వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రజలు కూటమికి వ్యతిరేకంగా ఓటు వేశారనే భయంతోనే వైయ‌స్ఆర్‌సీపీ నేతలను కౌంటింగ్‌కు దూరంగా ఉంచేందుకు కుట్రలు చేస్తున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. కౌంటింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అన్ని పార్టీల ఏజెంట్లు, నేతలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు.

Back to Top