సోషల్‌ మీడియాలో ఎన్నికల సెగ

‘ఎలక్షన్లా.. సెలక్షన్లా?’ అంటూ వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల చర్చ

జగన్‌ అభిప్రాయంతో ఏకీభవిస్తున్న అధికశాతం నెటిజన్లు 

రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా ‘శకుని పాచికలు’ వ్యాఖ్యలు 

ఓట్ల లెక్కల్లో తేడాలపై అనుమానాలు, విమర్శలు 

ప్రతిపక్షాలపై జరిగిన దాడులపై ఆన్‌లైన్‌ వేదికల్లో చర్చ 

ఎన్నికల సంస్కరణలు కావాలంటూ డిమాండ్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపోటముల కంటే ఎన్నికల నిర్వహణ, ప్రజాస్వామ్య విలువలు, ప్రతిపక్షాలను అణచివేయడంపైనే సోషల్‌ మీడియా వేదికలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ‘ఎలక్షన్లా.. సెలక్షన్లా?’ అంటూ ఆయన సంధించిన ప్రశ్నతో పాటు ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు అవసరమనే అంశం ఆన్‌లైన్‌ చర్చల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. అధిక శాతం నెటిజన్లు వైఎస్‌ జగన్‌ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. చంద్రబాబు కూట­మి ప్రభుత్వ కుయుక్తులను ఎండగడుతున్నారు. 

‘శకుని పాచికలు’.. జగన్‌ వ్యాఖ్యతో చర్చ 
మహా భారతంలో శకుని పాచికలను తనకు అనుకూలంగా మార్చుకున్నట్లుగా రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు ప్రభావితం చేశారని వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్య సామాజిక మాధ్యమాల్లో పెద్ద అంశంగా మారింది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ నుంచి పోలింగ్‌ ఏజెంట్ల నియామకం వరకు అన్ని దశల్లో అక్రమాలు జరిగాయని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ప్రజలు తమ ప్రతినిధులను స్వేచ్ఛగా ఎన్నుకునే అవకాశాలకు భంగం కలిగిందని విమర్శించారు. 

ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పోస్టులు, వీడియోలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. జగన్‌ తన వ్యాఖ్యల్లో యువతను ప్రస్తావించడం కూడా ఆసక్తికరంగా మారింది. యువత ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధి వంటి అంశాలతో పాటు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణపైనా దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉండాలనే అంశం చర్చకు వచ్చింది. తాజా రాజకీయ పరిణామాలపై యువత సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేయడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలోనూ ఎన్నికల సంస్కరణల అవసరాన్ని వైఎస్‌ జగన్‌ ప్రస్తావించారు. 

నామినేషన్ల తిరస్కరణ, అభ్యర్థుల ఉపసంహరణపై ఒత్తిళ్లు, పోలింగ్‌ ఏజెంట్లకు ఎదురైన ఇబ్బందులు, ఓట్ల లెక్కింపుపై అభ్యంతరాలు వంటి అంశాలను లేవనెత్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించిందా? ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు కల్పించారా? ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకున్నారా? అనే ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో రాజకీయ చర్చకు దారితీశాయి. ఓట్ల లెక్కల్లో తేడాలపై సామాజిక మాధ్యమాల్లోనూ అధిక శాతం మంది అనుమానాలు వ్యక్తం చేసి, చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

శాశ్వత పరిష్కారానికి సంస్కరణలు అవసరం
ఎన్నికల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలకు, ‘పచ్చ’ కుట్రలకు శాశ్వత పరిష్కారం చూపాలంటే సంస్కరణలు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్‌ ఏజెంట్ల హక్కుల పరిరక్షణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఫిర్యాదులపై తక్షణ స్పందన, రీపోలింగ్‌ నిర్ణయాల్లో పారదర్శకత, ఓట్ల లెక్కింపుపై స్పష్టమైన మార్గదర్శకాలు వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపై ఉందనే అభిప్రాయం సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల విశ్వసనీయత, ఎన్నికల సంస్కరణలపై నెటిజన్ల పోస్టులు వైరల్‌ అవుతున్నాయి.

Back to Top