నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును కౌంటింగ్ కేంద్రాల్లో తారుమారు చేసి, వైఎస్సార్సీపీ గెలిచిన స్థానాలను తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకోవడం ద్వారా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ల దశ నుంచి మొదలైన అక్రమాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు పోలింగ్‌తో ఆగకుండా కౌంటింగ్ లోనూ కొనసాగాయని ఆరోపించారు. రీకౌంటింగ్ పేరుతో ఓట్ల లెక్కలను మార్చడం, గెలిచిన అభ్యర్థులకు డిక్లరేషన్లు ఇవ్వకుండా జాప్యం చేయడం, ఇచ్చిన డిక్లరేషన్లను సైతం చించివేసి కొత్తగా ఫలితాలు ప్రకటించడం వంటి దారుణాలకు కూటమి ప్రభుత్వం పాల్పడిందని ధ్వజమెత్తారు. ఎన్నికల అధికారులు, పోలీసు వ్యవస్థను అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. ప్రజలు వేసిన ఓటుకు విలువ లేకుండా చేసి, అధికార పార్టీ నేతలు చెప్పిన వారినే గెలిచినట్లు ప్రకటించే పరిస్థితిని తీసుకొచ్చారని అసహనం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు చేసిన మేలును చెప్పుకోలేని చంద్రబాబు, ఎన్నికల్లో అక్రమాల ద్వారా గెలిచినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ప్రతి ఆధారాన్ని వెలుగులోకి తీసుకొస్తామని హెచ్చరించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కాపాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేస్తుందని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - నోటా ఓట్లను టీడీపీ అభ్యర్థి ఓట్లతో కలిపి లెక్కించారు: మున్సిపల్ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం తన అక్రమాలకు మరింత పదును పెట్టింది. వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు లాక్కోవడం, చించేయడం, బలవంతంగా ఉపసంహరింపజేయడం, కిడ్నాప్‌లు చేయడం, బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు కారణాలతో నామినేషన్లు తిరస్కరించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్సార్సీపీ అభ్యర్థులు ధైర్యంగా పోరాడి విజయం సాధించారు. అయితే ఆ విజయాలను కూడా టీడీపీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో మా అభ్యర్థి తాతా నాగేంద్రమ్మకు మొదట 11 ఓట్ల మెజారిటీ వచ్చినా, రీకౌంటింగ్ పేరుతో నోటా ఓట్లను కలిపి టీడీపీ గెలిచినట్లు ప్రకటించారు. నెల్లూరు జిల్లా చిలకూరు మండలం తమ్మినపట్నంలో బొమ్మి సుజాతమ్మ ఏడు ఓట్ల మెజారిటీతో గెలిచినప్పటికీ, రీకౌంటింగ్ తర్వాత ఒక్క ఓటుతో ఓడిపోయినట్లు ప్రకటించారు. తనకు జరిగిన అన్యాయంపై నిరసన తెలిపిన ఆ మహిళను పోలీసులు బురదలో ఈడ్చుకెళ్లడం అత్యంత అమానుషం. ఒక మహిళకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పాలి. తిరుపతి జిల్లాలో నగరి నియోజకవర్గం ఇల్లత్తూరులో దేవికకు 17 ఓట్ల మెజారిటీ వచ్చినా, రీకౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థికి మూడు ఓట్ల మెజారిటీ వచ్చినట్లు ప్రకటించారు. నిరసన తెలిపిన మాజీ మంత్రి రోజాను పోలీసులు ఈడ్చుకెళ్లారు. గణపవరంలో భవన కుమారికి 37 ఓట్ల మెజారిటీ ప్రకటించిన తర్వాత డిక్లరేషన్ ఆలస్యం చేసి టీడీపీ అభ్యర్థి నాలుగు ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు. గోండగాల గోపాలప్పకు 27 ఓట్ల మెజారిటీ వచ్చినా మూడు గంటల పాటు డిక్లరేషన్ ఇవ్వకుండా నిలిపివేశారు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగిన పొరపాట్లు కావు.. ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు జరిగిన ప్రయత్నాలుగా మేము భావిస్తున్నాం. - కౌంటింగ్ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదు: సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలో జరిగిన కౌంటింగ్ అక్రమాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి రౌండ్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో నమోదు చేసి, అన్ని పార్టీల ఏజెంట్ల సంతకాలు తీసుకోవాల్సి ఉండగా, ఆ నిబంధనలను పట్టించుకోలేదు. ఎనిమిది ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించిన తర్వాత మిగిలిన స్థానాల కౌంటింగ్‌లో గందరగోళం సృష్టించారు. దూరుపాలెం ఎంపీటీసీ స్థానంలో మూడు రౌండ్లలో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉన్నా, చివరి రౌండ్లో ఫలితాన్ని తారుమారు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను బయటకు పంపించి, ఓట్ల కట్టలను మార్చి, నోటా ఓట్లను ఇతర లెక్కల్లో కలిపి ఫలితాన్ని మార్చినట్లు మా అభ్యర్థులు చెబుతున్నారు. జడ్పీటీసీ కౌంటింగ్‌లోనూ మొదట టీడీపీకి ఆధిక్యం ఉన్నట్లు చూపించి, ఆ తర్వాత వైఎస్సార్సీపీ ఆధిక్యంలోకి వచ్చినప్పుడు కౌంటింగ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫలితాన్ని నిలిపివేశారు. సుమారు 500 ఓట్లకు పైగా చెల్లని ఓట్లు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, కేవలం 57 ఓట్ల మెజారిటీతో ఫలితాన్ని ప్రకటించి రీకౌంటింగ్‌కు నిరాకరించారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మా అభ్యర్థుల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఫలితాన్ని ప్రకటించారు. పొదలకూరులోనూ ప్రతి రౌండ్ ఓట్ల వివరాలు, ఏజెంట్ల సంతకాలు లేకుండానే చివర్లో లెక్కలు ప్రకటించి 46 ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలిచినట్లు ప్రకటించారు. చింతపూడిలో వైఎస్సార్సీపీ అభ్యర్థికి 27 ఓట్ల మెజారిటీ వచ్చినా, నారా లోకేష్ ఒత్తిడితో టీడీపీకి 23 ఓట్ల మెజారిటీ వచ్చినట్లు ప్రకటించారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ రాళ్లబూదుగూరులో మా అభ్యర్థికి 17 ఓట్ల ఆధిక్యం వచ్చినప్పటికీ, మూడుసార్లు రీకౌంటింగ్ నిర్వహించి టీడీపీకి మూడు ఓట్ల మెజారిటీ వచ్చినట్లు ప్రకటించుకున్నారు. చంద్రబాబు, నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే ఇలాంటి ఆరోపణలు రావడం ఎన్నికల వ్యవస్థ పనితీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. - ఓట్ల లెక్కలను పారదర్శకంగా ప్రకటించాలి: ప్రజలు వేసిన ఓట్లను లెక్కించే అధికారం అధికారులకు ఇచ్చారు కానీ, ప్రజల తీర్పును మార్చే అధికారం ఎవరిచ్చారు? ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి రౌండ్ ఓట్ల వివరాలు నమోదు చేయాలి, ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి, మొత్తం ఓట్ల లెక్కలను పారదర్శకంగా ప్రకటించాలి. కానీ అనేక చోట్ల ఈ నిబంధనలను పక్కనపెట్టి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు అనుగుణంగా వ్యవహరించారనే ఫిర్యాదులు ఉన్నాయి. గెలిచిన అభ్యర్థులకు ఇచ్చిన డిక్లరేషన్లను చించివేయడం, కౌంటింగ్ కేంద్రాల్లోకి వందలాది మందిని అనుమతించడం, అభ్యంతరాలు తెలిపిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులపై దాడులు చేయడం వంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఎన్నికల అక్రమాలను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయడం ద్వారా గొంతు నొక్కాలని చూస్తున్నారు. - ఎన్నికల అక్రమాలపై మా న్యాయపోరాటం కొనసాగుతుంది: ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. వివాదాస్పదమైన ప్రతి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానానికి సంబంధించి మొదటి కౌంటింగ్ నుంచి రీకౌంటింగ్ వరకు రౌండ్వారీ ఓట్ల వివరాలను వెల్లడించాలి. చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లు, నోటా ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కలను బహిర్గతం చేయాలి. ప్రతి రౌండ్‌కు సంబంధించిన టేబులేషన్ షీట్లు, ఏజెంట్ల సంతకాలతో కూడిన రికార్డులను బయటపెట్టాలి. కౌంటింగ్ కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజీని భద్రపరచి, జరిగిన ఘటనలపై సమగ్ర విచారణ జరపాలి. సంబంధిత అధికారులు, పోలీసుల కాల్ డేటా రికార్డులను పరిశీలించి రాజకీయ జోక్యం జరిగిందా లేదా తేల్చాలి. ఎన్నికల అక్రమాలను ప్రశ్నించిన వారిపై పెట్టిన కేసులను సమీక్షించి ఉపసంహరించాలి. ప్రజలు ఇచ్చిన తీర్పును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. అధికార బలంతో, పోలీసు బలంతో ప్రజల గొంతును నొక్కలేరు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, న్యాయపరంగా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజల ఓటును అవమానించిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో తప్పకుండా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.