‘అలా టీడీపీ గెలిస్తే.. రాజకీయ సన్యాసం చేస్తా’

అనంతపురం: చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సవాల్ విసిరారు. అనంతపురం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. ఎక్కడైనా టీడీపీ అభ్యర్థి గెలిస్తే.. తాను రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్‌ చేశారు.

నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే టీడీపీ ఓటమి ఖాయమని అనంత వెంకటరామిరెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. గత 40 ఏళ్లలో ఇన్ని అరాచకాలు ఏనాడూ చూడలేదని అన్నారు. అధికార పార్టీ నేతలకు ఎన్నికల అధికారులే లొంగిపోవడం... రక్షించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర దుర్మార్గమని ఆక్షేపించారు. 

నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ సమయాల్లో రిగ్గింగ్ చేసిన ఘనత టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులదేనని తెలిపారు. బౌన్సర్లను తీసుకొచ్చి దాడులు చేస్తుంటే.. పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో జరిగిన దౌర్జన్యంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అప్పటి ఎన్నికల్లో మేమూ ఇలాగే చేసుంటే గత సార్వత్రిక ఎన్నికల్లో మీరు గెలిచేవారా అని ప్రశ్నించారు. 

Back to Top