త‌ప్పు చేసిందే కాకుండా అప్పిరెడ్డిపై త‌ప్పుడు ప్ర‌చారమా? 

ఎన్నిక‌ల అధికారి త‌ప్పును అంగీక‌రించిన త‌ర్వాత కూడా ద‌బాయింపా?  

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు ధ్వ‌జం

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు,మాజీ 
ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు

ఎన్నిక‌లు నిష్ప‌క్ష‌పాతంగా జ‌రిగాయ‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం విడ్డూరం 

వెంగ‌లాయ‌పాలెం బ్యాలెట్ బాక్సు వ్య‌వ‌హారంలో టీడీపీ దొరికిపోయింది 

ఆ ఘ‌ట‌న‌పై ప్ర‌శ్నించినందుకే అప్పిరెడ్డిపై క్రిమిన‌ల్ అంటూ దుష్ప్ర‌చారం 

ఆ ప్ర‌కారం చూస్తే చంద్ర‌బాబు, లోకేష్‌ స‌హా మంత్రివ‌ర్గ‌మంతా క్రిమిన‌ల్స్ 

ఏడీఆర్ స‌ర్వే ప్ర‌కారం 23 మంది మంత్రుల్లో 22 మందిపై క్రిమిన‌ల్ కేసులు

అక్ర‌మాల‌ను ప్ర‌శ్నిస్తున్నందుకే అప్పిరెడ్డిపై టీడీపీ నాయ‌కుల ఎదురుదాడి 

ద‌మ్ముంటే అక్ర‌మాలకు పాల్ప‌డలేద‌ని ఆధారాల‌తో నిరూపించాలి

స‌వాల్ విసిరిన‌ టీజేఆర్ సుధాకర్ బాబు 

తాడేప‌ల్లి:  బ్యాలెట్ బాక్సుతో పోలింగ్ అధికారి బస్సు నుంచి దిగిన ఘట‌న‌కు స‌హేతుక‌మైన కార‌ణాలు చెప్ప‌లేక.. ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వాన్ని నిల‌దీసినందుకు  వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు చేసిందే కాకుండా క్రిమిన‌ల్ అంటూ ఆయ‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం మొద‌లుపెట్టార‌ని వైవైయ‌స్ఆర్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు ధ్వ‌జ‌మెత్తారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వెంగ‌లాయ‌పాలెంకి సంబంధించిన పోలింగ్ అధికారి తన బస్సు నుంచి కిందకు దిగి బ్యాలెట్ బాక్సును రోడ్డు మీదకు తీసుకురావడం ఎన్నికల్లో జ‌రిగిన ప్రత్యక్ష స్కామ్ అని సుధాకర్ బాబు స్పష్టం చేశారు. బస్సులో స్థానం లేక దిగామంటూ టీడీపీ నేతలు రామాంజనేయులు, ఆలపాటి రాజా, పిల్లి మాణిక్యరావు, నాని ఇస్తున్న కవరింగ్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అసలు అక్కడ బస్సే లేదని, బ్యాలెట్ బాక్సులను మార్చేందుకే టీడీపీ నాయకులు పన్నాగాలు పన్నారని ఆరోపించారు. ఈ అక్రమాలను ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ అధికారి తప్పు చేశానని స్వయంగా చెబుతున్నా, టీడీపీ నేతలు మాత్రం దాన్ని సమర్థించడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. 

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

దేశ చ‌రిత్ర‌లోనే లోప‌భూయిష్ట‌మైన ఎన్నిక‌లు: 

వెంగలాయపాలెం బ్యాలెట్ బాక్సు వ్యవహారంపై సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించామని  ప్రకటించుకోవ‌డం విడ్డూరంగా ఉంది. దేశ చరిత్రలోనే ఇంత లోపభూయిష్టమైన, అప్రజాస్వామిక ఎన్నికలను గతంలో ఎన్న‌డూ చూడ‌లేదు. వెంగలాయపాలెం గ్రామానికి సంబంధించిన బ్యాలెట్ బాక్సుతో పోలింగ్ అధికారి బస్సు నుంచి రోడ్డుపైకి దిగారు. ఓట్లున్న బ్యాలెట్ బాక్సును పోలీసు భద్రత లేకుండా రోడ్డుపైకి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎన్నికల నిర్వహణలో బ్యాలెట్ బాక్సులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులకు లేదా? అసలు అక్కడ మరో బస్సే లేనప్పుడు బస్సు మారడానికి దిగాడని టీడీపీ నేతలు ఎలా చెబుతారు? బస్సులో స్థలం లేదని చెప్పడం ఎంత విడ్డూరం? 

ఆ ఎన్నిక‌ల అధికారి త‌న త‌ప్పును అంగీక‌రించాడు: 

వైఎస్సార్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్ర‌మ అరెస్టు చంద్ర‌బాబు క‌క్ష‌సాధింపు రాజ‌కీయాల‌కు ప‌రాకాష్ట‌. ఒక ఎమ్మెల్సీ తన పార్టీ అభ్యర్థికి న్యాయం చేయాలని అడిగితే నేరస్తుడిగా చిత్రీకరిస్తున్నారు. వెంగలాయపాలెం బ్యాలెట్ బాక్సుతో పోలింగ్ అధికారి బస్సు నుంచి దిగడం తన తప్పేనని స్వయంగా అంగీకరించారు. మరి ఆ అధికారిని ప్రశ్నించడమే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన తప్పా? బ్యాలెట్ బాక్సుతో రోడ్డుపైకి ఎందుకు దిగారని అడిగినందుకు ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తారా? ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ప్రశ్నించడం నేరమా? ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడటం తప్పా? అప్పిరెడ్డి గారు బ్యాలెట్ బాక్సు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించలేదు. ఎన్నికల అధికారి చర్యను ప్రశ్నించారు. తన అభ్యర్థికి అన్యాయం జరుగుతోందని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? తప్పు చేసిన అధికారులను ప్రశ్నించకుండా ఉండాలా?  

ఈ వీడియో నిజం కాద‌ని నిరూపించ‌గ‌ల‌రా?: 

నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో రామాంజనేయులు, ఆలపాటి రాజా, పిల్లి మాణిక్యరావు, నాని త‌దిత‌రులు ప్రెస్‌మీట్ పెట్టి లేళ్ల అప్పిరెడ్డే తప్పు చేశారని మాట్లాడారు. వెంగలాయపాలెం బ్యాలెట్ బాక్సుతో బస్సు నుంచి దిగింది పోలింగ్ అధికారా? లేళ్ల అప్పిరెడ్డా?.  ఆయన కేవలం మీరు ఎందుకు బస్సు దిగారని ప్రశ్నించారు. ఆ అధికారి తన తప్పును అంగీకరించిన విషయం వీడియో సాక్షిగా కనిపిస్తుంది. నేను చూపించిన ఈ వీడియో తప్పని వాళ్లు నిరూపించగలరా?  పైగా లేళ్ల అప్పిరెడ్డిపై 14 కేసులున్నాయని పదేపదే మాట్లాడుతున్నారు. ఇతరులపై ఆరోపణలు చేసే ముందు టీడీపీ నాయకుల అఫిడవిట్లు చూసుకోవాలి. చంద్రబాబుపై 19 కేసులు, నారా లోకేష్‌పై 17 కేసులు, నిమ్మల రామానాయుడుపై 20 కేసులు, కొల్లు రవీంద్రపై 15 కేసులు ఉన్నాయని వారి ఎన్నికల అఫిడవిట్లలోనే వెల్లడైంది. చింతమనేని ప్రభాకర్‌పై 70 కేసులు, పులివర్తి నానిపై 31 కేసులు ఉన్నాయని అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఇవన్నీ మేము సృష్టించిన లెక్కలు కాదు. వాళ్లే ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లలో ఉన్న వివరాలు. ఏడీఆర్ (అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్‌), నేష‌న‌ల్ ఎల‌క్ష‌న్ వాచ్ సంస్థలు 2025 సెప్టెంబర్ 4న విడుదల చేసిన నివేదికలో 23 మంది మంత్రుల్లో 22 మంది, అంటే 96 శాతం మంది తమపై క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించారు. 13 మంది మంత్రులపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. మరి నేర చరిత్ర గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నాయకులకు ఎక్కడుంది? ప్రజా సమస్యలపై పోరాటాలు చేసినందుకు నమోదైన కేసులను చూపించి అప్పిరెడ్డిని నేరస్తుడిగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం? 

అక్ర‌మాల‌కు సమాధానం చెప్ప‌కుండా ఎదురుదాడా? : 

ప్రకాశం జిల్లా బూద‌వాడలో నామినేషన్ వేసి పోటీలో నిలబడినందుకు దళితులపై దాడులు చేశారు. వెంగలాయపాలెంలో బ్యాలెట్ బాక్సుతో అధికారి బస్సు దిగిన వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు లేళ్ల అప్పిరెడ్డిపై కేసులు పెట్టారు. ఒకవైపు దళితులపై దాడులు, మరోవైపు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రశ్నించే నాయకులపై పోలీసు కేసులు.. ఇదేనా చంద్రబాబు పాలన? ఎన్నికల్లో నామినేషన్ వేసే దశ నుంచి పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడం, బ్యాలెట్ బాక్సుల తరలింపులో అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకోవడం వరకు ప్రతి అంశంపైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వెంగలాయపాలెం బ్యాలెట్ బాక్సు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి. బ్యాలెట్ బాక్సుతో బస్సు నుంచి రోడ్డుపైకి దిగిన పోలింగ్ అధికారి చర్యపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. లేళ్ల అప్పిరెడ్డిపై పెట్టిన కేసుల వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టాలి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తే ప్రజలు నమ్మరు. చంద్రబాబు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేసినా వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల ఓటు హక్కు కోసం వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని టీజేఆర్ సుధాక‌ర్ బాబు స్ప‌ష్టం చేశారు.

Back to Top