గుంటూరు: కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ఎన్నికల అనంతరం బస్సులో నుంచి వెంగళాయపాలెం బ్యాలెట్ బాక్స్ ఎందుకు దించారు? అని ప్రశ్నించారు. గుంటూరు జైల్లో ఉన్న వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు ములాఖత్ ద్వారా పరామర్శించారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే అప్పిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించిందని, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో వైయస్ఆర్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న గుంటూరులో దుష్ట సంప్రదాయాలకు తెరతీశారని, వైయస్ఆర్‌సీపీ నేతలు జైళ్లకు వెళ్లేందుకు భయపడరని స్పష్టం చేశారు. చిన్న ఘటనను అడ్డంపెట్టుకుని లోకేష్, పెమ్మసాని కలిసి అప్పిరెడ్డిని జైల్లో పెట్టేందుకు కుట్ర చేశారని, వైయస్ఆర్‌సీపీ యాక్టివ్ నాయకులను జైళ్లకు పంపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా మారిందని పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం వెంగళాయపాలెం బ్యాలెట్ బాక్స్‌ను బస్సు నుంచి ఎందుకు దించారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసిన బ్యాలెట్ బాక్స్‌ను ఎందుకు తెరిచారని, బస్సులో ఎక్కించిన బాక్స్‌ను మార్గమధ్యలో ఎందుకు దించాల్సి వచ్చిందని నిలదీశారు. బ్యాలెట్ బాక్స్ మార్చే ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకే అప్పిరెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారని, ఆయనకు బెయిల్ రాకుండా లోకేష్, పెమ్మసాని అనేక ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిని కాపాడుతూ, వాటిని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.