అనంతపురం: నగర అభివృద్ధే లక్ష్యంగా పనిచేసి ప్రజల నమ్మకాన్ని మరింతగా నిలబెట్టుకోవాలని వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. వైయస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైన రమేష్‌గౌడ్, గెలుపొందిన, ఓడిపోయిన కార్పొరేటర్ అభ్యర్థులు, స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ విజయం వెనుక ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి ఉందని, అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలకు భయపడకుండా నిలిచినందుకే ప్రజలు నమ్మకంతో గెలిపించారని తెలిపారు. మేయర్ స్థానాన్ని గెలుచుకోవడమే కాకుండా ప్రతి డివిజన్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారంతా ప్రజలకు మరింత చేరువ కావాలని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అవినీతి, వివాదాలకు దూరంగా ఉంటూ అనంతపురం నగరాన్ని ప్రశాంతంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో దాడులు, దౌర్జన్యాలు, భూకబ్జాలు పెరిగాయని, ప్రజలు అన్నింటినీ గమనించి వైయస్ఆర్సీపీకి పట్టం కట్టారని గుర్తు చేశారు. పదవులు అధికారం చెలాయించడానికి కాదని, ప్రజలకు సేవ చేసే అవకాశాలని స్పష్టం చేశారు. మేయర్ రమేష్‌గౌడ్ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి అనంతపురాన్ని సుందరమైన, స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దుతామని, అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. తనను మేయర్‌గా గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.