రాజమహేంద్రవరం: త్వరలో జరగనున్న రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి వైయస్ఆర్సీపీని గెలిపించాలని మాజీ ఎంపీ, వైయస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్చార్జి మార్గాని భరత్‌రామ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక ఓటు కార్పొరేటర్‌కు, మరో ఓటు మేయర్ అభ్యర్థికి వేసి నగరాన్ని మళ్లీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అవకాశం కల్పించాలని కోరారు. క్వారీ మార్కెట్ జంక్షన్‌లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వద్ద మంగళవారం జరిగిన వైయస్ఆర్సీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తల సమావేశంలో ఆయన అభ్యర్థులను ప్రకటించారు. పాత 46వ (కొత్త 66) డివిజన్ నుంచి కళ్లి మురళి సతీమణి కళ్లి కృష్ణవేణి, పాత 47వ (కొత్త 68) డివిజన్ నుంచి వైయస్ఆర్సీపీ ఎస్సీ నాయకుడు తిరగటి దుర్గ సతీమణి తిరగటి సరస్వతిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ ప్రకటనతో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున హర్షం వ్యక్తం చేశాయి. మిగిలిన పాత 45, 48, 49 డివిజన్లకు అందరితో చర్చించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని భరత్‌రామ్ తెలిపారు. రెండున్నరేళ్ల కూటమి పాలనలో రాజమహేంద్రవరం నగరాభివృద్ధికి చేసిందేమీ లేదని భరత్‌రామ్ మండిపడ్డారు. నగరంలోని రహదారులు గోతులమయంగా మారాయని, ప్రణాళిక లేకుండా కేబుల్, విద్యుత్, పైప్లైన్ల కోసం రోడ్లను తవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో క్వారీ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహంతో పార్లమెంట్ నమూనా ఏర్పాటు, గ్లో గార్డెన్, క్వారీ రోడ్డు విస్తరణ, మోరంపూడి ఫ్లైఓవర్ వంటి పనులు చేపట్టామని గుర్తుచేశారు. వైయస్ఆర్సీపీని గెలిపిస్తే గోదావరి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించడంతో పాటు నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని చెప్పారు. నగర సమస్యలపై నిరంతరం ప్రశ్నించే ప్రతిపక్షంగా వైయస్ఆర్సీపీ నిలుస్తుందని, ప్రజలు తమకు అవకాశం కల్పించాలని కోరారు.