అనంతపురం : ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పీజీ సీట్లను భర్తీ చేసేందుకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ విమర్శించారు. ఈ మేరకు ఎస్కే యూనివర్సిటీ నాయకులు హేమంత్, విద్యార్థులతో కలిసి వీసీని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో మిగిలిన పీజీ సీట్లకు వెంటనే స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని వారు కోరారు. కరువు ప్రభావిత అనంతపురం జిల్లాలో పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో అధిక ఫీజులు చెల్లించి పీజీ చదివే పరిస్థితి లేదని, ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుకోవాలనే ఆశతో ఉన్న విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు కల్పించకపోవడం అన్యాయమన్నారు. ఒకవైపు సీట్లు ఖాళీగా ఉండగా మరోవైపు పీజీ చదవాలనుకునే విద్యార్థులు అడ్మిషన్లు లేక ఉన్నత విద్యకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ఎస్కే యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పీజీ సీట్ల వివరాలను ప్రకటించి, అర్హులైన విద్యార్థులకు పారదర్శకంగా స్పాట్ అడ్మిషన్లు కల్పించాలని, దరఖాస్తుకు తగిన గడువు ఇవ్వాలని వారు కోరారు. పేద విద్యార్థుల ఉన్నత విద్యా ఆశయాలకు అడ్డంకులు లేకుండా తక్షణమే అడ్మిషన్లు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ విద్యార్థి నాయకులు శివ, తేజేశ్వర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, బబ్లు, సాయిచరణ్, పులి కార్తికేయ, రాహుల్‌రెడ్డి, ఇమ్రాన్, ఫయాజ్, జుబేర్ తదితరులు పాల్గొన్నారు.