తాడేపల్లి : వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి, మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాల ఫలితంగానే ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో ఉన్నత ర్యాంకులు, గుర్తింపు లభించాయని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. ఆ ఘనతను కూటమి ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. “చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం తప్ప అభివృద్ధి చేసింది ఏమీలేదు. ఓపీ జిందాల్ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన సీఎన్‌ఈఎస్ స్కాలర్స్ రూపొందించిన ఏఈఐ నివేదికలో 2021లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉండగా, జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి, విద్య, వైద్యం, మౌలిక వసతులు, సామాజిక భద్రతకు సంబంధించిన ఫలితాలతో 2024 నాటికి రాష్ట్రం 3వ స్థానానికి చేరింది. అదే కాలం నాటి పారామీటర్ల ఆధారంగా ఇప్పుడు 2వ స్థానానికి చేరితే ఆ ఘనత కూడా చంద్రబాబు ప్రభుత్వం సాధించినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు” అని అన్నారు. “జగన్ పాలనలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. ఆరోగ్యశ్రీ, ఆసరా, కొత్త మెడికల్ కాలేజీలు, నియామకాలు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, డీబీటీ ద్వారా సంక్షేమం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు వంటి మౌలిక వసతులు కల్పించాం. అలాంటి పునాదుల ఫలితాలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం తన ఘనతగా ప్రచారం చేసుకుంటోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీని ముందంజలో నిలిపిన జగన్ పాలన తర్వాత రాష్ట్రం 8వ స్థానానికి దిగజారిందని ఆయన అన్నారు.” “సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి పాలనలో రాష్ట్ర ఆదాయం కూడా తగ్గింది. 2024–25లో స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూ రూ.89,435 కోట్లు ఉండగా, 2025–26లో రూ.86,552 కోట్లకు తగ్గింది. మరోవైపు రోజుకు సగటున రూ.460 కోట్ల అప్పు చేస్తున్నారని, 29 నెలల్లో రూ.3,99,498 కోట్ల మేర అప్పులు చేశారని అన్నారు. పుట్టబోయే బిడ్డతో సహా ప్రతి పౌరుడిపై రూ.2,11,588 అప్పు భారం మోపారని చెప్పారు.” “డ్వాక్రా మహిళలను గతంలో మోసం చేసిన చంద్రబాబు.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.20 వేల కోట్లు చెల్లించి మహిళలకు అండగా నిలిచింది. సూపర్ సిక్స్ హామీల అమలుకు ఏటా రూ.1.19 లక్షల కోట్లు అవసరమని చెప్పి కూడా ఆ హామీలను అమలు చేయడం లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను లాస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా మార్చిన పరిస్థితి ఏర్పడింది” అని శివశంకర్ అన్నారు. “కూటమి నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది. వైయస్ జగన్ హయాంలో సాధించిన అభివృద్ధి ఫలితాలను తమ ఖాతాలో వేసుకోవడం, ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు కొత్త కొత్త పదాలు ఉపయోగించడం మానుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను గుర్తించకుండా మాయమాటలతో కాలం గడపడం సాధ్యం కాదు. జగన్ సాధించిన ప్రగతిని తమ ఘనతగా చెప్పుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు” అని శివశంకర్ స్పష్టం చేశారు.