విజయవాడ: రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ మరోసారి అక్రమాలకు పాల్పడేందుకు ఇప్పటి నుంచే కుట్రలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారులను బెదిరిస్తూ, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా క్లస్టర్ల వారీగా నామినేషన్లు వేయించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల పరిధిలో నిర్ణయించిన చోట్ల నామినేషన్లు స్వీకరించాల్సి ఉండగా, కొంతమంది ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి తెస్తూ మండల కేంద్రాల్లోని క్లస్టర్ల వద్దకే అభ్యర్థులు వచ్చి నామినేషన్లు వేయాలని ఆదేశాలు ఇప్పిస్తున్నారని తెలిపారు. రాయచోటి, మైదుకూరులో ఇప్పటికే ఇలాంటి పరిస్థితులు తమ దృష్టికి వచ్చాయని వెల్లడించారు. గత మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు సాగించిన అక్రమాలనే పంచాయతీ ఎన్నికల్లోనూ పునరావృతం చేసేందుకు కూటమి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ కుట్రలను అడ్డుకుని పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు వెల్లడించారు. ఎవరెవరు ఏం మాట్లాడారంటే... ఎన్నికల కమిషన్ తక్షణం జోక్యం చేసుకోవాలి - మలసాని మనోహర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ మరోసారి అక్రమాలకు పాల్పడేందుకు ఇప్పటి నుంచే కుట్రలు చేస్తోంది. అధికారులను బెదిరిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా క్లస్టర్ల వారీగా నామినేషన్లు వేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో నిర్ణయించిన చోట్ల నామినేషన్లు స్వీకరించాల్సి ఉండగా, ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి తెస్తూ మండల కేంద్రాల్లోని క్లస్టర్ల వద్దకే అభ్యర్థులు రావాలని ఆదేశాలు ఇప్పిస్తున్నారు. రాయచోటి, మైదుకూరు ప్రాంతాల్లో ఇప్పటికే ఇలాంటి పరిస్థితులు మా దృష్టికి వచ్చాయి. గత మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు జరిగిన అక్రమాలనే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని చూస్తున్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో 84 స్థానాల్లో, 2,000కు పైగా ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. 50కి పైగా పోలింగ్ కేంద్రాల్లో తెల్లవారుజామున మూడు గంటలకే మా పోలింగ్ ఏజెంట్లను అరెస్టు చేయగా, మరో 50 కేంద్రాల్లో ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించారు. కౌంటింగ్ సమయంలో 700 నుంచి 800 ఓట్ల మెజారిటీ ఉన్న స్థానాల్లోనూ రీకౌంటింగ్ పేరుతో ఫలితాలను తారుమారు చేశారు. గెలుపు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన తర్వాత కూడా టీడీపీ అభ్యర్థులు గెలిచినట్లు మరో డిక్లరేషన్ ఫారం జారీ చేయడం అధికారుల వ్యవహారశైలికి నిదర్శనం. ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని సీఎం చెప్పడం సిగ్గుచేటు - అంకంరెడ్డి నారాయణమూర్తి, వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో 76 శాతం స్థానాలు గెలిచామని గొప్పలు చెప్పుకుంటున్నారు. రెండున్నరేళ్లలో ప్రజలకు ఏం మంచి చేశారో, ఏ పథకం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చారో చెప్పలేకపోతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పడం వాస్తవాలను కప్పిపుచ్చడమే. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. దొంగ ఓట్లు, ఏజెంట్ల అరెస్టులు, రీకౌంటింగ్ పేరుతో ఫలితాల మార్పు వంటి అక్రమాలకు పాల్పడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశించిన సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, పోలీసు భద్రతను కూడా కొన్ని చోట్ల సక్రమంగా అమలు చేయలేదు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నాలను నిలువరించి, నిబంధనలు ఉల్లంఘించే అధికార పార్టీ నాయకులు, అధికారులపై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలి.