తాడేపల్లి/నంద్యాల/కుప్పం: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని వైయస్ఆర్సీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నామినేషన్ల ప్రక్రియ మొదలుకుని పోలింగ్ మరియు కౌంటింగ్ వరకు ప్రతి దశలోనూ అధికార పార్టీ అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు. ప్రతిపక్ష అభ్యర్థులను, ఏజెంట్లను పోలీసుల సహకారంతో అడ్డుకుంటూ రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పంతో పాటు నందికొట్కూరులోనూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ అధికార బలంతో ఫలితాలను తారుమారు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తీర్పును అడ్డుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసినా వాటిని తిప్పికొడతామని హెచ్చరించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజల మనసులో వైఎస్ జగన్ గారిపై ఉన్న ఆదరణను ఎవరూ చెరపలేరని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలతో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు : వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిందో ఈ మున్సిపల్ ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం. నేషనల్ మీడియా సైతం ఆంధ్రప్రదేశ్‌ను సౌత్ బీహార్‌తో పోలుస్తోందంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవాలి. ఎస్సీ నియామకం నుంచి నామినేషన్లు, స్క్రూటినీ, విత్‌డ్రాయల్స్, పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి దశలోనూ చంద్రబాబు తన అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించేయడం, అర్హతలు ఉన్నా అకారణంగా డిస్క్వాలిఫై చేయడం, అక్రమ కేసులతో అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడం చంద్రబాబు మార్కు ఎన్నికల విధానంగా మారింది. పోలింగ్‌కు ముందే ఏజెంట్లను బెదిరించి, పోలీస్ స్టేషన్లకు తరలించి, టీడీపీ గూండాలతో దాడులు చేయించి పోలింగ్ బూత్‌లలో ప్రతిపక్ష ఏజెంట్లు లేకుండా చేశారు. ఓటర్లు ఓటు వేయడానికి రాకుండా పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేయడం, బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడటం, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఏజెంట్లను కొట్టి బయటకు పంపించడం దారుణం. పోలింగ్ శాతం తక్కువగా ఉన్న చోట్ల అకస్మాత్తుగా శాతాలను పెంచడం, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అక్రమాలకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కుప్పంలో వైఎస్సార్సీపీకి మూడు వార్డుల్లో ఆధిక్యం రావడంతో అభ్యర్థులను, కౌంటింగ్ ఏజెంట్లను బయటకు లాగి పంపించడం, కళ్యాణదుర్గంలోనూ ఇదే తరహా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. చంద్రబాబు ప్రజాస్వామ్యానికి ఇచ్చే గౌరవం ఇదేనా? ఈరోజు కౌంటింగ్‌లోనూ ఏజెంట్లను బయటకు పంపించడం, అభ్యర్థులను లోపలికి రానివ్వకపోవడం, పలు కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం వంటి అక్రమాలు జరుగుతున్నాయి. పలమనేరు మున్సిపాలిటీలో రెండో రౌండ్లో వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థికి 856 ఓట్ల ఆధిక్యం వచ్చినా ఫలితాన్ని ప్రకటించకుండా అధికారులను, పోలీసులను పంపించేసి బెదిరింపులకు దిగడం దేనికి సంకేతం? రాజకీయంగా ప్రజల మధ్య పోరాడే ధైర్యం లేక వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న చంద్రబాబుకు చివరకు మిగిలేది ప్రజాస్వామ్య హంతకుడు అనే పేరే. ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు, అభ్యర్థులకు పోటీ చేసే హక్కు కల్పించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుంది. ప్రజల తీర్పును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోం : వైయస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 22 వార్డుల్లో గెలుపొందారు. ఇప్పటికే 22 మంది అభ్యర్థులకు డిక్లరేషన్ ఫారాలు ఇచ్చిన అధికారులు, మరో అభ్యర్థి గెలిచినా అతనికి డిక్లరేషన్ ఫారం ఇవ్వకుండా హోల్డ్‌లో పెట్టడం దుర్మార్గం. వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థికి రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి 1,200కు పైగా ఓట్ల మెజారిటీ వచ్చినప్పటికీ టీడీపీ నాయకులు రీకౌంటింగ్ పేరుతో అడ్డంకులు సృష్టించి, గంటల తరబడి కౌంటింగ్ నిలిపివేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? కౌంటింగ్ కేంద్రంలోకి బయట వ్యక్తులు గోడలు దూకి చొరబడుతుంటే పోలీసులు వారిని అడ్డుకోవాలి కానీ, మమ్మల్ని చుట్టుముట్టి నిర్బంధిస్తే ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడగలుగుతారు? ప్రశాంతంగా జరిగిన ఎన్నికల వాతావరణాన్ని కావాలనే టీడీపీ నాయకులు చెడగొడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగాం, ప్రజలను ఒప్పించుకుని ఎన్నికల్లో పోటీ చేశాం. ఇప్పుడు కూడా ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత టీడీపీకి లేదా? కలెక్టర్, ఎస్పీ, డీఐజీ వెంటనే జోక్యం చేసుకుని కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేయాలి. ప్రజల తీర్పును అడ్డుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే మేము చూస్తూ ఊరుకోం. పదిమంది లాఠీ దెబ్బలైనా, రెండు తుపాకీ తూటాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా వచ్చాం. గెలిచిన అభ్యర్థులకు వెంటనే డిక్లరేషన్ ఫారాలు అందించి, చైర్మన్ అభ్యర్థి గెలుపును అధికారికంగా ప్రకటించాలి. ప్రజల తీర్పును గౌరవించకుండా అధికార బలంతో ఎన్నికల ఫలితాలను మార్చాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలోనూ ప్రజాస్వామ్యం ఖూనీ : ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ కుప్పం: ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలోనే పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని చూపించి, ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగి గెలిచే ప్రయత్నం టీడీపీ నాయకులు చేయలేదు. ప్రజల మద్దతు లేదనే భయంతో నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు ప్రతి దశలోనూ అడ్డంకులు సృష్టించారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి స్క్రూటినీ, విత్‌డ్రాయల్స్ వరకు మా అభ్యర్థులను బెదిరించి, భయపెట్టి, దుర్భాషలాడి పోటీ నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. ఇన్ని అడ్డంకులు ఎదురైనా వైఎస్సార్సీపీ అభ్యర్థులు ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేసి చివరి ఘట్టమైన కౌంటింగ్ వరకు నిలబడ్డారు. కుప్పం మున్సిపాలిటీలో మొదటి రౌండ్లోనే 1, 2, 3, 5, 7, 8, 9, 12వ వార్డులతో సహా పలు వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఆధిక్యంలోకి రావడంతో టీడీపీ నాయకులు అరాచకాలకు తెరతీశారు. ప్రజలు వేసిన ఓట్లకు న్యాయం జరగకుండా కౌంటింగ్ ప్రక్రియను అడ్డుకున్నారు. కుప్పం కోసం ప్రత్యేకంగా ఎస్పీని నియమించామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఎస్పీ కళ్ల ముందే రాజ్యాంగం ఖూనీ అవుతుంటే, లా అండ్ ఆర్డర్ మాత్రమే మా బాధ్యత, మిగతా విషయాలు ఆర్వో చూసుకుంటారనడం బాధ్యతారాహిత్యం. ప్రజల హక్కులను కాపాడటం పోలీసుల బాధ్యత కాదా? అభివృద్ధిని చూపించి ఓటడిగే ధైర్యం లేక... ఎన్నికల కమిషనర్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత మరిచి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాడు. కౌంటింగ్ కేంద్రంలోకి వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఒక్క ఏజెంట్‌కే అనుమతిచ్చి, టీడీపీ అభ్యర్థికి ఇద్దరు ఏజెంట్లతో పాటు అభ్యర్థిని అనుమతించాడు. కలెక్టర్‌కు ఫోన్ చేసి మా అభ్యర్థులను బయటకు లాగి వేస్తున్నారని ఫిర్యాదు చేసినా స్పందన లేదు. కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి, రెండేళ్ల పాలన గురించి చెప్పుకుని ఓట్లు అడిగే ధైర్యం టీడీపీ నాయకులకు లేదు. ప్రజలు తమను ఆదరించలేదనే భయంతోనే ఇన్ని అరాచకాలు సృష్టించారు. 32కి 32 వార్డులు గెలిచామని ప్రకటించుకున్నా ప్రజలు ఆ ఫలితాలను నమ్మే పరిస్థితి లేదు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ జగన్ గారిపై కుప్పం ప్రజల్లో ఉన్న ఆదరణను నిరూపించగలిగాం. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఉంటే మొత్తం 19 వార్డుల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలిచేవారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి వైఎస్సార్సీపీ అభ్యర్థికి, కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు, కౌంటింగ్ కేంద్రంలో ధైర్యంగా నిలబడిన ప్రతి ఏజెంట్‌కు పార్టీ తరఫున సెల్యూట్ చేస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అడ్డుకున్నవారికి రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రజలే తగిన విధంగా సమాధానం చెబుతారు.